మిట్ట మధ్యాహ్నం పక్షులు, జంతువులూ వేసవి తాపం తట్టుకోలేక సేదదీరాయి. మర్రిచెట్టు కొమ్మమీద కాకి, కోతి దిగువన నక్క, గాడిద చేరాయి. వాటి మధ్య మాటలు కలిశాయి. 'ఏమిటో? ప్రతి ఒక్కరికీ మేమంటే అలుసు. ఏ శబ్దం వచ్చినా ఏమిటా 'కాకిగోల' అంటూ మమ్మల్ని తక్కువగా మాట్లాడతారు' అన్నది కాకి బాధగా. 'మీరే నయం. మమ్మల్నైతే ప్రతిదానికి 'నక్కబుద్ధులు', 'జిత్తులమారి' లాంటి మాటలతో పొడుచుకు తింటారు. ఆ మాటలు వింటే గుండెల్లో గునపాలు గుచ్చినట్టుంటుంది. మేమేం అపకారం చేశాం. మా బతుకు మేం బతుకుతున్నాం అంతే' అన్నది నక్క.
అంతలో కోతి కలగజేసుకుని 'మమ్మల్ని అయితే మరీ దారుణం. ప్రతిదానికీ కోతిచేష్టలు అంటూ ఎగతాళి చేస్తారు. మా రూపం గురించి కూడా నీచంగా మాట్లాడతారు. ఏంచేయగలం? మౌనంగా భరించడం తప్ప' అన్నది. దానికి గాడిద, 'మాది మరీ హీనమైన బతుకు. బండెడు చాకిరీ చేయించుకుంటారు. మా అరుపు భరించలేరు. పనికిమాలిన వారిని తిట్టడానికి మా పేరు తరచూ వాడుతుంటారు. ఆ తిట్టుపదాలు వింటున్నపుడు చెవులు బద్ధలైపోతుంటాయి. కానీ ఏమీ చేయలేక భరిస్తున్నాం' అన్నది గాడిద.
అలా చాలాసేపు తమ తమ బాధలు చెప్పుకున్నాయి. చివరకు కాకి 'ఇలా ఎంతకాలం బాధ పడాలి? దీనికేదైనా పరిష్కారం ఉంటుంది. వెతకాలి' అన్నది. 'పరిష్కారం వెదకడం మనవల్ల అయ్యేపనేనా?' అన్నది గాడిద నిరాశగా. ఈ మాటలన్నీ చెట్టుకు వేలాడుతున్న ముసలి గబ్బిలం విన్నది. 'మీరు ఇంకా నయం. మమ్మల్నయితే మరీ చులకనగా చూస్తారు. అపశకునంగా భావిస్తారు. అలా అని నేనేం బాధపడను. అదిగో అటు చూడండి. మనకంటే చిన్నప్రాణి చీమ ఇవేమీ ఆలోచించక బాటపక్కన పడిన గింజలను ఒక్కొక్క దానిని సేకరిస్తున్నది. వాటిని వానాకాలం అవసరాలకు పుట్టలోకి చేర్చుకుంటుంది. చీమకు మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే దాని బరువు కంటే ఎనిమిది రెట్లు బరువును మోసుకుపోతుందట. అంతేకాదు నిరంతర శ్రమజీవి. చీమలు చేసేపని కూడా చాలా క్రమశిక్షణగా, సంఘటితంగా చేస్తాయి. అందుకే చిన్నప్రాణి అయినా చీమను ముందుచూపుకు, క్రమశిక్షణకు మారుపేరుగా, సంఘజీవిగా ఉదహరిస్తుంటారు మనుషులు. వయసుతో వచ్చిన అనుభవంతో మీకో విషయం చెప్పదలిచాను. మనకు పుట్టుకతోనే కొన్ని లోపాలు, కొన్ని సుగుణాలు సహజంగానే వస్తాయి. అన్నీ సరిగ్గా ఉండే పరిపూర్ణ జీవి అంటూ సృష్టిలో ఏదీ ఉండదు. అలాగే అన్ని లోపాలతోనూ ఏ జీవీ ఉండదు. మనలోని లోపాలను ఎత్తి చూపుతూ కొందరు ఆనందం పొందుతుంటారు. వారిలో కూడా లోపాలుంటాయి. ఆ సంగతి వాళ్ళు గమనించరు. అందువల్ల ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చొనే కంటే మనకు వీలైన పనిని మనసుపెట్టి ఆ చీమలాగా చేసుకుపోతూ ఉంటే అద్భుతాలు మనం సాధించవచ్చు. తను చిన్నప్రాణి అని, వంటిమీద కనీకనపడగానే నలిపేస్తారని బాధపడుతూ కాలం గడుపుతూ ఉంటే చీమను ఎవరూ ఇంతగొప్పగా పొగడరు. అలాకాక తన పని తాను శ్రద్ధగా చేసుకుపోవడం వల్ల మంచిపేరు తెచ్చుకుంది' అంటూ హితబోధ చేసింది.
కాకి, కోతి, నక్క, గాడిద సంతోషంగా తలలూపి, ముసలి గబ్బిలానికి కృతజ్ఞతలు చెప్పి, అది ఇచ్చిన సలహా పాటిస్తూ ఆనందంగా జీవించాయి.
డా. గంగిశెట్టి శివకుమార్