హద్దులెరుగని స్వేచ్ఛా తీరాల వెంటబడి
నిబంధనల వలలు విసురుతున్నారెవరో
ఆశయాల పిడికిళ్లు బిగించి ఉవ్వెత్తున
ఎగిసిపడే వినూత్న ఆలోచనల కెరటాలు
అభ్యుదయ ఆకాశాన్ని అంటకుండా
పరిధి దాటి కొత్త తరంగాలను ప్రవహించనీయకుండా
పెదవి దాటి కొత్త ప్రశ్నలు ఉద్భవించనీయకుండా
ఎల్లలు ఎరుగని విముక్తి వనాల చొరబడి
ఆంక్షల అడ్డుగోడలు కడుతున్నారెవరో..!
ఆవేశాలను గుండెలనిండా నింపుకొని
ఉధృతంగా వీచే విమర్శల సుడిగాలులు
మూక సిద్ధాంతాలను మట్టుపెట్టనీయకుండా
పరిమితులు దాటి కొత్త మెదళ్లను ఆలోచించనీయకుండా
కంచెలు దాటి కొత్త భావనలు మొలకెత్తనీయకుండా
అవధులు కానని స్వతంత్ర విహంగాల చుట్టూ
నిరంతరం కనిపెట్టుకుని కావలి కాస్తున్నారెవరో
ఆత్మవిశ్వాసపు రెక్కలు గట్టిగా విదిల్చుకొని
మూఢనమ్మకాల ఇనుప సంకెళ్ళను తెంచుకుని
నవ చైతన్య శిఖరాలకు ఎగరనీయకుండా
పరివేషాలను దాటి కొత్త తరాన్ని అడుగువేయనీయకుండా
నిశీధి చీకట్లను దాటి కొత్త వెలుగులవైపు చూడనీయకుండా
లక్ష్మణరేఖలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థల వెంబడి
నియంత్రణల ముళ్ళకంచెలు నాటుతున్నారెవరో..!
ఒంటి కాలితో నడిచే ధర్మానికి ఉక్కు పాదాలను తొడిగి
కొనఊపిరితో ఉన్న న్యాయానికి జవసత్వాలు ఊది
అవినీతి రాబందుల పెడరెక్కలు విరవకుండా
అక్రమార్కుల పాలిట కొత్త చట్టాలు రాయనీయకుండా
రేపటితరం కోసం కొత్త ప్రపంచానికి
పునాదులు వేయనీయకుండా
అడ్డుపడుతున్నారు ఎవరో.. ఛేదించాలి మరి
ఆ అదుపు సంకెళ్ళను..
ఉదయించాలి భరతమాత పొత్తిళ్ళలో..!
ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985