Nov 27,2022 08:37

మానవ సమాజంలోని జీవన విధానం, ఆచార వ్యవహారాలు, ఆ సమాజ జీవనంలో సమ్మిళితమైన కళలు, విశ్వాసాలు.. అన్నీ కలిపితే ఆ జాతి యొక్క సంస్కృతి. ఈ సంస్కృతి ప్రాచీన కాలం నుంచి నేటి సాంకేతిక కాలం వరకు ఆయా కాలాలను బట్టి మారుతూ వస్తోంది. 'ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడూ కాదొక స్థిరబిందువు / నైన నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు' అంటాడు తిలక్‌. సంస్కృతికి - సామాజిక వ్యవస్థలకు విడదీయరాని సంబంధం వుంది. మానవ జీవితాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో సంస్కృతి ఒకటి. సంస్కృతి భావనను భిన్న అర్థాలలో ఉపయోగిస్తున్నారు. ప్రతి సంస్కృతి ఒక కాలంలో విరాజిల్లింది. కాలాతీతంగా సమాజంలో ఏదీ జరగదు. 'ఒక సమాజానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్వేగ అంశాలు.. ఆ సమాజపు సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఆ సంస్కృతిలో భాగాలే' అని యునెస్కో నిర్వచించింది. అయితే, ఈ సంస్కృతికి విపరీతార్థాలు చెప్పే వింతపోకడలు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో వాడుకలోకి వచ్చాయి.
శ్రమైక జీవనం, పరమత సహనం, లౌకికతత్వం, శాంతియుత సహజీవనం - అనాదిగా భారతీయ సంస్కృతి. గత కొద్ది సంవత్సరాలుగా ఈ సంస్కృతికి విఘాతం ఏర్పడింది. సంస్కృతి పరిరక్షణ పేరుతో మత మౌఢ్యాన్ని, పరమత విద్వేషాన్ని రగిలిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా జాతి, మత, ప్రాంత, భాషల పేరిట, ఆహారపు అలవాట్ల పేరిట చీలికలు తెచ్చే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. ప్రధానంగా సంస్కృతిలో ఒక భాగమైన మతాన్ని ఆధారం చేసుకొని ఈ దేశ ఘనచరితను, సంస్కృతిని మతానికి అనుకూలంగా మలచుకునేందుకు మతఛాందసవాద శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ సంస్కృతిని నిలువరించడానికి.. మానవీయ విలువలను, ఈ దేశ సంస్కృతిని నేటి తరానికి అందించడానికి చేసిన ఒక ప్రయత్నంలో భాగం.. ''మన సంస్కృతి'' అనే ఈ పుస్తకం. సంస్కృతి పట్ల అశాస్త్రీయ భావనలు ప్రబలంగా వున్న ఈ రోజుల్లో ఈ పుస్తకానికి ఎంతో ప్రాముఖ్యత వుంది.
ఈ పుస్తకంలో సంస్కృతి గురించి సవివరంగా చర్చించే, అవగాహన కల్పించే 19 వ్యాసాలను పొందుపరిచారు. వీటితోపాటు తిలక్‌ 'మన సంస్కృతి', పాబ్లొ నెరూడా 'నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు..', కలేకూరి ప్రసాద్‌ 'ధిక్కారం', సాబిర్‌ హుస్సేన్‌ సయీద్మ 'ఆలోచించు మిత్రమా..' కవితలను కూడా అందించారు.
మరీ ముఖ్యంగా నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, గురజాడ, గిడుగు, బండారు అచ్చమాంబ, కొమర్రాజు లక్షణరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, త్రిపురనేని రామస్వామి నుంచి ఆరుద్ర, తిలక్‌ వరకు ప్రముఖుల వ్యక్తిగత సంక్షిప్త సమాచారాన్ని ప్రత్యేకంగా అందించడం ఈ పుస్తకంలోని మరో ప్రత్యేకత. ప్రచురణకర్తల 'మా మాట'లో సంస్కృతి అనే పదాన్ని ఏఏ రకాలుగా, ఎన్నెన్ని రకాలుగా ఉపయోగిస్తున్నామో సవివరంగా ఇచ్చారు. 'సంస్కృతి సమాజంలో అంతర్భాగం. సమాజంతో పాటు నిరంతరం పరిణామం చెందుతుంది' అంటారు బివి రాఘవులు తన 'సాంస్కృతిక రంగంలో కృషి' అనే వ్యాసంలో. మార్క్సిస్టు అవగాహన, సంస్కృతికి నిర్వచనం, భావాల- విలువలు, ఫ్యూడల్‌ విలువలు, పెట్టుబడిదారీ విలువలు, సోషలిస్టు విలువలు, సాంస్కృతిక ఉత్పత్తి రూపాలు, సాంస్కృతిక పాత్ర నిర్వహించే వ్యవస్థలు, దాని వైవిధ్యం, ప్రత్యామ్నాయ సంస్కృతి- వంటి అనేక అంశాలను ఆయన తన వ్యాసంలో చర్చించారు. 'ప్రజాసంస్కృతి : వికాస పరిణామాలు' అనే వ్యాసంలో... తెలుగువారి ప్రజా సంస్కృతి పునర్వికాసానికి కమ్యూనిస్టు ఉద్యమం చేసిన కృషి, అందుకు సంబంధించిన అనుభవాలు, అవగాహన, ఆలోచనలను వకుళాభరణం రామకృష్ణ తన వ్యాసంలో విపులంగా వివరించారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా గల మానవుల చుట్టూ వారి జీవన వేదంలో కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు అంతర్భాగాలై అల్లుకుపోయాయి అంటారు 'సమైక్యతకు ప్రతీక జానపద సంస్కృతి' అనే వ్యాసంలో యాసలపు సూర్యారావు. 'భారతీయ సంస్కృతికి ప్రతీక చేనేత' వ్యాసంలో భారత చరిత్ర నిర్మాణంలోనూ, నాగరికత అభివృద్ధిలోనూ చేనేత ముఖ్యమైన పాత్ర పోషించింది అంటారు యు రామకృష్ణ.
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇంకా మిగతా వ్యాసాల్లోనూ సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలను సవివరంగా ఈ పుస్తకంలో చర్చించారు. సంస్కృతి అంటే అవగాహన కల్పించడానికి, సాంస్కృతిక రంగంలో నెలకొంటున్న తిరోగమన పద్ధతులను, క్షీణ విలువలను తిప్పికొట్టడానికి ఈ పుస్తకం కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తిగత లైబ్రరీలో తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకం. గిరిధర్‌ అరసవల్లి ఈ పుస్తకాన్ని చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సమాజ పురోగమనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.

- రాజాబాబు కంచర్ల