కాలం బండిలో నిత్యప్రయాణికుణ్ణి
గమ్యం చేరేవరకు అలుపెరుగని బాటసారిని
సాగిపోయే సమయమంతా నాదే
వినియోగించుకుంటే
ఉజ్వల భవితకు అదే దారి..
అహర్నిశలు ఆశల సౌధాలు నిర్మిస్తాను
కలల రూపాలన్నీ వాటికి అందిస్తూ
కనురెప్పల వెనుక స్వప్నాలలో సృజిస్తూ
కాల ప్రవాహంలో
మనసు వేగం పెంచుతున్నా..
ఉషోదయ కిరణాలకు ఉత్తేజం పొందుతూ
మధ్యాహ్నం మండుటెండలో నడుస్తూ
సాయంత్ర సమయాన్ని సద్వినియోగం చేస్తూ
రాత్రికి జ్ఞాపకాలు నెమరేస్తూ నిద్రిస్తున్నా...
రుతువుల మార్పులా మారుతుంది తనువు
ప్రవాహములా పెరుగుతుంది ఆశల వేగం
ఆలోచనలకు పుడుతుంది అక్షర రూపం
చిత్రకారుని లావణ్య విన్యాసాల సొగసులతో..
ఉప్పొంగుతుంది
ఉద్రేకపు ఆలోచనల సమాహారం
చూచే చూపుల బట్టి
కనిపించే సమాజ రూపం
ఆవేశం కప్పుకొని
మనసు మౌనంగా ఏడుస్తుంది
ఎగిసిపడే అక్షరం మంచులా కరుగుతుంది..
కడుపులో బాధ ఆవేశముతో ఉప్పొంగుతుంటే
కన్నీరు కార్చిన కళ్ళు చల్లబడి ఏడుస్తుంటే
కాల ప్రవాహం వేగంలో
ఎన్నో జ్ఞాపకాలు దొర్లుతుంటే
మొండి చేసిన మనసు
మౌనంగానే వింటుంది...
యుగాల మైలురాళ్లు ఒక్కొక్కటి దాటుకుంటూ
నదీ జలపాతాలు సంస్కృతులు నేర్పుతుంటే
పుట్టిన నుండి పరిణామాలు చెందుతుంటే
పురిటి కేక వేసిన రోజు
కళ్ళు మూసిన రోజు
కాలం ఒక్కటే..
కొప్పుల ప్రసాద్,
9885066235