Jul 09,2023 09:11


తెల్లతెల్లవారుతూనే దిగాలుగా గుమ్మంలో కూర్చొనుంది రాధమ్మ. రాత్రంతా ఏడ్చినట్టుంది. కళ్లు వాచిపోయి, ఎర్రగా నిప్పుకణికల్లా వున్నాయి. కళ్ల కింద కట్టిన నీటిచారికల తడి... సూర్యుని లేత కిరణాల తాకిడికి ఎరుపెక్కి కనిపిస్తున్నాయి.
రెండురోజులుగా తిండీతిప్పలు లేకుండా శోకదేవతలా విలపిస్తూనే వుంది. అలసిపోయి ఏ అర్ధరాత్రో కలత నిద్రలోకి వెళ్లినా... 'నాల్గు దినాల్లోనే మా బతుకులింత దయిద్రంగా అయిపోనాయేట్రా దేముడా'... అని రోదిస్తోంది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని దాదాపు 222 గ్రామాల్లోని ఒక గ్రామం అగ్రహారం. గోదావరి పక్కన పచ్చని పొలాలు, దాన్ని అనుకుని పెద్ద అటవీ ప్రాంతం. గ్రామంలోని గిరిజనుల జీవనాధారమంతా అడవులతోనే ముడిపడి వుంది. కొద్దోగొప్పో వున్న భూమిని సాగు చేసుకోడంతో పాటు అగ్రహారం గ్రామంలోని కుటుంబాలన్నీ అడవి నుంచి కట్టెలు, వెదురు రెమ్మలు, కూరగాయలు, అడవిలో దొరికే పళ్లు, కాయలు, పుట్టగొడుగులు, తేనె, చింతపండు వంటివి సేకరించుకొని, సంతల్లో అమ్ముకోవడం, హాయిగా పిల్లాపాపలను పోషించుకోవడం మాత్రమే తెలిసిన అమాయక జీవులు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన కుటుంబాలు... ఇప్పుడు ఆ అడవికి దూరమయ్యాయి.

ప్రశాంతంగా సాగుతున్న బతుకుల మీద పోలవరం ప్రాజెక్టు విస్తరణ ఉరమని పిడుగులా పడింది.
నాలుగు రోజుల క్రితం పొద్దున్నే వేసిన చాటింపు... ఆ గ్రామవాసుల చెవులకు కర్ణకఠోరంగా వినిపించింది.
'రేపు అగ్రారం గేమంలోని కుటుంబాలన్నీ తమ ఇళ్లను ఖాళీసేసేసి, ఇందుకూరు గేమంలో ఏర్పాటు సేసిన పునరావాస కాలనీకి ఎల్లిపోవాలహో..!' అంటూ చాటింపు వేశారు.
ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. ఇళ్లలోని వారంతా రోడ్లపైకి వచ్చారు. ఎగసిపడుతున్న ఆవేదనను అణచుకోలేక బావురుమన్నారు. పదిహేడేళ్లుగా ఇదిగో అదిగో అంటున్న పరిహారం సరిగా అందను కూడా లేదు. భూమి స్థానంలో భూమి కేటాయించనూ లేదు. ఒకరిద్దరికి ఇచ్చినా అవి సక్రమంగా లేవు.
ఆ చాటింపు విన్న వారంతా ఆందోళనగా రోడ్ల మీదకు వచ్చారు.
పొద్దు పొద్దునే అడవికి బయల్దేరిన రాధమ్మ- ఆ చాటింపు విని కుప్పకూలిపోయింది. 'అడవుల నుంచి పుల్లాపుల్లా పోగేసుకొని, పైసాపైసా కూడెట్టుకొని కట్టుకున్న ఇల్లిది. ఈ ఇంటిని వదిలియ్యాలా? ఇక్కడే పుట్టినం... ఇక్కడే పెరిగినం... ఇక్కడే చస్తం. అంతేగాని పేనం పొయ్యినా ఇంటిని, ఊరును ఒగ్గేదిలేదు' అని బావురుమంది.
గుండెలోని బాధని కళ్లలోనే దాచుకుంటూ... అప్పటివరకూ మౌనంగా వున్న రాధమ్మ భర్త రాజయ్య 'ఏందే రాధమ్మ... నీకసలే ఒంట్లో సరిగలేదు. ఊర్కోయే. పెబుత్వం వాల్ల గుండెలు రాల్లయినాయే. ఆల్లు మన గోస ఇంట్లేదు. ఏటి సేత్తాం' అంటూ రాధమ్మను సముదాయిస్తున్నాడు.
'రాజయ్య మావో.. రాధమ్మత్తో.... ఓపాలి ఇటరాండే... మాయమ్మ పడిపోనాదే' అంటూ కేకలు పెట్టి ఏడుస్తోంది అక్కమ్మ కూతురు మల్లి.
హడావుడిగా అందరూ అక్కమ్మ ఇంటికి పరుగెత్తారు.
'ఏమైందే బిడ్డా...' అంటూ రాధమ్మ, రాజయ్య వెళ్లేసరికి అక్కమ్మ సోయలో లేదు. డొక్కలు ఎగరేస్తంది.
అక్కమ్మకి 60 ఏళ్లు. ఆమెకున్న ఎకరం భూమిని ప్రభుత్వం లాగేసుకుంది. దానికి పరిహారంగా 30 కిలోమీటర్ల దూరంలో, ముంపు ప్రాంతంలో భూమి ఇచ్చారు. అక్కమ్మతో పాటు చాలామందికి అక్కడ భూములిచ్చారు. 'బంగారం పండే బూములు మాయి. ఆటిని లాగీసుకొని, పంటకు పనికిరాని బూములిచ్చీరు. ఆటిని ఏటి సేసుకోం దొరా' అంటూ అధికారుల ముందు మొరపెట్టుకున్నారు. వాళ్ల ఓట్లకోసం వచ్చే నాయకుల దగ్గర సాష్టాంగపడ్డారు. ఒక్కరూ వారి గోడు వినలేదు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతునే వున్నారు.
'ఏటైనదే అమ్మకు.... నిన్నకూడా బానే వున్నీదికదే' అంది రాధమ్మ.
'అందరికీ తెలిసిందేగా... మాకిచ్చిన బూమినే మరో ఇద్దరికి కూడా ఇచ్చారు. ఆల్లేమో... ఇది మా బూమి అని అమ్మ మీదికి గొడవకొచ్చీరు. నీకు పట్టా ఇచ్చినోడికి సెప్పుకో అన్నారంటనే' అని చెపుతూనే ఏడుస్తోంది మల్లి.
'అవునే రాధమ్మ... అక్కమ్మకి, నాకు, కుంజంకి ఒక్క మడికే పట్టా ఇచ్చీరు. ఎవురి బూమి ఆల్లకీమని ఆ ఆపీసరయ్య కానికి పొయ్యినం...' అని బదిరినాగ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
'ఏటైనదో సెప్పకుండా ఆ ఏడుపేందిరా' అన్నాడు రాజయ్య
'ఏం సెప్పను మావా. మన అక్కమ్మ గద్దరగా మాటాడుద్ది కదా... ఆపీసరయ్యతో తగువుకు దిగినాది. నా బూమి నాకు సూపిచ్చమని నిలదీసినాది.'
'ఆ... అయితే...'
'ఎవురి పట్టా కాయితాలు ఆరికే ఇయ్యి దొరా. ఒక్క మడికే ముగ్గురికి కాయితాలిత్తే మేమేం సెయ్యాలా! మేం మేం కొట్టుకుసావాల్నా. బంగారం పండే మా బూమిని లాగీసుకుని ముంపు చెక్క ఇచ్చీరు. దాన్ని మేము ఏటి సేసుకోవాల?' అని ఆపీసరయ్యని నిలేసినాది.
'కోపంతో ఊగిపోయిన ఆపీసరయ్య... ఏంటే ముసలీ... అరుస్తున్నావ్‌..! అదైనా ఇచ్చాం సంతోషించు. అయినా ముసిల్దానికి నీకెందుకే భూమి. చస్తా కట్టుకుపోతావా... పోపో. ఇచ్చింది తీసుకో... లేకపోతే అదీ వుండదు అని జవాన్ని పిలిచి బయటికి తోసేయించాడు'
'నేను సత్తే నా బూమిలోనే సత్తాను తప్ప... ఇంకోకాడికి పొయ్యేది లేదు... నా బూమిని ఒగ్గేది లేదని అక్కడే కుప్పకూలిపోనాది' అన్నాడు బదిరినాగ.
ఆఫీసర్‌ను అక్కమ్మ నిలదీసిన సంగతి బదిరినాగ చెపుతుంటే... అందరూ ఆసక్తిగా వింటున్నారు.
'అక్కమ్మ కదల్టలేదు మావా...' అన్న రాధమ్మ కేకతో అందరి చూపు అక్కమ్మ వైపు మళ్లింది.
రాధమ్మ ఆందోళనగా రాజయ్య చెయ్యి పట్టుకొంది.
భయపడిన మల్లి 'అమ్మా ....' అంటూ ఏడుపు లంకించుకుంది.
'రాధమ్మా... బిడ్డని కూసంత సముదాయించే...' అంటూ 'అరే నాగా.. ఆ ఆరంపీ డాటరయ్యకి కబురెట్టరా' అన్నాడు రాజయ్య.
'అట్టాగే మావా... మనూల్లోనే వుండె. నేను బేగి లాక్కొత్తా...!' అంటూ హడావుడిగా పరుగెత్తాడు బదిరినాగ.
'అమ్మా...అమ్మా...' మల్లి బోరున విలపిస్తోంది. చుట్టుపక్కల వాళ్లంతా అక్కమ్మ ఇంటి దగ్గర పోగయ్యారు. మల్లి ఏడుపు అక్కడివారి హృదయాలను మరింత బరువెక్కించింది.
అందరి ముఖాల్లోనూ వైరాగ్యం. ఏమీ చెయ్యలేని అసహాయత. అక్కడున్న వారంతా భూములనో, ఇళ్లనో, రెండింటినో కోల్పోయినోళ్లే. రేపోమాపో ఈ గ్రామం నుంచి నెట్టేయబడేటోళ్లే.
'మావా... అక్కమ్మ వల్లు చల్లగ అయితాంది' అంటూ కేకపెట్టింది రాధమ్మ.
'నువ్వుర్కోయే... ఏటవదుగని' అని గంభీరంగా అన్నా... రాజయ్య కూడా ఆందోళనగానే అక్కమ్మ వైపు చూస్తున్నాడు.
అప్పటివరకూ ఎగరేస్తున్న డొక్కలు మెల్లమెల్లగా ఆగిపోయాయి. చలనంలేని ఎముకల గూడు... పోరాటంతో అలసిపోయి ఆగిపోయినట్టుంది.
'తొవ్వియ్యండి... తొవ్వియ్యండి...' అంటూ బదిరినాగ ఆర్‌ఎంపి డాక్టర్‌ని తీసుకొచ్చాడు.
ఎండుకట్టెలా పడివున్న అక్కమ్మ చెయ్యి పట్టుకొని నాడి చూశాడు. స్టెతస్కోపుతో పరీక్షించిన డాక్టర్‌... పెదవి విరిచాడు. లేచి నుంచొని 'ప్రాణం పోయింది' అన్నాడు.
ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఏడ్పులతో నిండిపోయింది. చాలా రోజులుగా ఉగ్గబట్టుకున్న దు:ఖం గోదావరి వరదపొంగులా తన్నుకొచ్చింది.
'అదురుట్టవంతురాలు... సత్తే నా బూమిలోనే సత్తానని శపతం సేసింది. అట్టాగే సచ్చిపోనాది. ఈ బూమిలోనే కలిసిపోతాది. మట్టి, నీల్లనే సూత్తన్నారు మావా... ఆటివల్ల నట్టపోయే పేనాల్ని ఎవురూ సూత్తలేదు' కళ్లొత్తుకుంటూ బయటికొచ్చాడు బదిరినాగ.
రోడ్డుపైకొచ్చి రెండడుగులు వేసాడో లేదో... బదిరి నాగాకు ఇటువైపే వస్తోన్న పోలీసు జీపు, అక్కడి ఆఫీసరు జీపు వస్తూ కనిపించాయి. వాటిని చూస్తూ.. అక్కడే నుంచుండిపోయాడు.
బదిరినాగాకు దగ్గరలో వున్న చెట్టుకింద జీపులు రెండు ఆగాయి.
పోలీసు జీపులోంచి ఒక కానిస్టేబుల్‌ దిగి, 'అరేరు... ఇట్రా. ఏంటా గుంపు?' అని అధికార దర్పం చూపించాడు.
'మా అక్కమ్మ దొరా.... అక్కమ్మ సచ్చిపోనాది దొరా...'
'సర్‌... ఆ ముసల్ది చచ్చిందంట'... జీపు దగ్గరకొచ్చి ఆఫీసర్‌కి చెప్పాడు కానిస్టేబుల్‌.
'దరిద్రం వదిలింది. సరేసరే... రేపటికల్లా ఈ విలేజ్‌ వదిలిపోవాలని అందరికీ చెప్పండి' అన్నాడు ఆఫీసర్‌.
అక్కమ్మ ఇంటి దగ్గరున్న జనం... రోడ్డు మీద పోలీసు జీపు ఆగటం చూసి, ఆందోళనగా జీపు దగ్గరకొచ్చారు.
'మీరందరూ రేపటికల్లా ఈ గ్రామం నుంచి వెళ్లిపోవాలి. మీ కోసం ఇందుకూరులో కొత్తకాలనీ, కొత్త ఇళ్లు కట్టించింది ప్రభుత్వం. మీకు ఇళ్ల పట్టాలిచ్చినా... ఒక్కడూ ఇక్కడ నుంచి కదల్లేదు. మర్యాదగా రేపొద్దునకల్లా ఈ ఊరు ఖాళీ చెయ్యాలి. లేదంటే ప్రభుత్వం చెయ్యాల్సింది చేసేస్తుంది' అన్నాడు కానిస్టేబుల్‌.
'దొరా... మా మీద కనికరం సూపీండి. ఇప్పటికిప్పుడంటే ఎట్టా ఎల్తాం. పైగా మా అక్కమ్మ సచ్చిపోనాది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజయ్య.
'అదేం కుదరదు. ఏడెనిమిది నెలలుగా ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఊరు ఖాళీ చెయ్యడం లేదు. మీకివ్వాల్సిన పరిహారం ఇచ్చినా... మా భూమి, మా నేల అంటూ కదలడంలేదు. రేపొద్దునకల్లా ఈ ఊర్లో ఒక్కరు కనబడటానికి వీల్లేదు' అన్నాడు ఆఫీసర్‌.
ఆడా మగ, పిల్లాజెల్లా అంతా ఆఫీసరు చుట్టూ చేరి... దండాలు పెట్టారు. కనికరించమని వేడుకున్నారు.
పోలీసులు వాళ్లందరినీ దూరంగా నెట్టేశారు.
'వీళ్లకి ఫైనల్‌ వార్నింగ్‌ ఇవ్వండి. ఇక పక్క గ్రామానికి వెళదాం..' అన్నాడు ఆఫీసర్‌.
అక్కడి గుంపును పక్కకు నెట్టేసి, రెండు జీపులూ అగ్రహారం గ్రామానికి పక్కనే వున్న మరో గ్రామం వైపు దూసుకుపోయారు.
'రాజియ మావా... ఇప్పుడేంది దారి...' అన్నాడు బదిరినాగ.
'సేసేదేటుంది నాగా... అక్కమ్మ కోరిక పెకారం ఇక్కడే పాతిపెడదాం. ఆ తర్వాత మన ఎంకటేసు గాడ్ని తీసుకొని ఆ అధికార పార్టీ నాయకుడి దగ్గరకెల్దాం...'

వెలుగురేఖలింకా పూర్తిగా విచ్చుకోలేదు...
వాతావరణం మబ్బులు పట్టి గుంబనంగా వుంది. చిన్నచిన్న చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి.
ఊరంతా మేల్కొనే వున్నారా? అన్నట్టుగా అందరి ఇళ్లలోనూ అలికిడి వినిపిస్తోంది. ఎవరి ముఖాల్లో చూసినా అలజడి... ఆందోళన.
రాత్రంతా ఎవరూ నిద్రపోయినట్లు లేదు. వరదగుడి కమ్మినట్లుగా అందరి కళ్లలోనూ గూడుకట్టుకున్న కన్నీళ్లు...
అప్పుడు బయల్దేరింది కలకలం. రోడ్డు పొడవున దుమ్ములేపుకుంటూ యమపాశాల్లా దూసుకొస్తోన్న నాలుగు జెసిబి లు. ఒక ట్రాక్టర్‌లో కొందరు కూలీలు, పోలీసు వ్యానులో దాదాపు 20మంది వరకూ పోలీసులు, ఆ వెనుకే జీపులో ఆఫీసరు. వాహనాలన్నీ వరుసగా వచ్చి అగ్రహారం గ్రామం మధ్యలో ఆగాయి.
పిల్లా జెల్లా, ముసలీముతకా... అంతా వాళ్లకు అడ్డు నిలిచారు. అందరికంటే ముందు రాధమ్మ నిలబడింది.
'ఈ బూమి, ఈ ఊరు... మా సొంతం. మా హక్కును లాక్కోవద్దు. మాకు సరైన నష్టపరిహారం ఇయ్యాలి' అంటూ గట్టిగా నినాదాలిస్తోంది. ఆమెతో పాటు కొందరు యువతీయువకులు కూడా నినాదాలిస్తున్నారు.
'అదెవరు..?' అన్నాడు ఆఫీసర్‌ ఒక పోలీసుతో.
'అది రాజయ్య గాడి పెళ్లాం సర్‌... రాధమ్మ...'
'అక్కమ్మ చచ్చింది... ఇది తయారైందా..?' అందరినీ గెంటేయండి. గంటలో ఈ గ్రామం నిర్మానుష్యంగా మారిపోవాలి' అన్నాడు కఠినంగా.
'ఆపీసరయ్యా... నీకు దండమెడతం. పిల్లాజెల్లా వున్నారు. కొద్దిరోజులు గడువీండి దొర, కాలీ సేసేత్తాం.....' అంటూ వేడుకున్నాడు రాజయ్య.
పోలీసులు రాజయ్యను పక్కకు లాగేశారు.
'మీకేం నొప్పిరా... ఇళ్లు ఇచ్చాం. పరిహారం ఇచ్చాం. ఇంకా ఇక్కడినుంచి ఖాళీ చెయ్యడానికి ఏం రోగం' అన్నాడు ఆఫీసర్‌.
'దొరా... ఈడనే పుట్టినం, ఈడనే పెరిగినం. ఆ అడవితల్లినే నమ్ముకుని బతుకుతున్నం. ఆ ఇందికూరు ఈడికి 30 కిలోమీటర్లు. అక్కడ పనుల్లేవు. అడవిలేదు. మేమెట్టా బతికేది. దొరా.. మా దొడ్డ మనసుగలోరు. కాసంత దయసూపండి' అంటూ ఆఫీసర్‌ కాళ్లమీద పడ్డాడు రాజయ్య.
'ప్రతివాడూ ఉపన్యాలిచ్చేవోడే. ఎస్‌ఐ, వీరందరినీ గెంటేయండి. మామూలుగా చెబితే వీళ్లు వినరు. ఆ ఇళ్లు, బోర్‌వెల్స్‌ అన్నీ కూల్చేయండి. పవర్‌ సప్లరు కట్‌ చేయండి...' అని ఆర్డర్‌ వేశాడు.
పోలీసులు రంగంలోకి దిగారు. అడ్డొచ్చినవారిని లాగిపడేస్తూ... ఇళ్లపైకి జెసిబీ లను నడిపించారు.
మధ్యాహ్నం అయ్యే సరికి గ్రామంలోని 77 కుటుంబాలు రోడ్డున పడ్డాయి
అప్పటివరకూ కళకళలాడుతున్న పచ్చని పల్లె అగ్రహారం గ్రామంలోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఆ శిథిలాల్లోంచి తమ వస్తువులను ఏరుకొని మూటకట్టుకొంటున్నారు కొందరు.
రాధమ్మ తన ఇంటిముందు శోకదేవతలా కూర్చొనుంది మాటా పలుకూ లేకుండా. కళ్లు వర్షిస్తున్నాయి... మనసు కోపం, ఆవేశం, అసహాయతలతో రగిలిపోతోంది.
రాధమ్మను ఒక కంట గమనిస్తూనే, పనికొచ్చే వస్తువులన్నిటినీ రాజయ్య మూట కడుతున్నాడు.

ఇందుకూరు పునరావాస కాలనీ.
చిన్నచిన్న పెట్టెల్లా ఇళ్లయితే కట్టారు గానీ, కాలనీలో నీళ్లు లేవు. కరెంటు లేదు. ఇదొక ముంపు ప్రాంతం. గట్టిగా వర్షం వస్తే... ఈ కాలనీ అంతా మునిగిపోతుంది.
సరైన రోడ్లు కూడా లేవు. పాములు, విషపురుగులు యదేచ్ఛగా తిరుగుతున్నాయి.
ఇందుకూరు వచ్చి రెండురోజులైనా ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు.... గూడుకట్టుకున్న విషాదం తప్ప.
రాధమ్మకు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్రలేదు. రాజయ్యే బలవంతంగా రెండు ముద్దలు పెడుతున్నాడు. లేకపోతే అదీ లేదు. ఇంటిముందు అలా కూర్చునే వుంది.
రాధమ్మకు ఏమవుతుందోననే అందోళనతో బయటకు కూడా వెళ్లకుండా ఆమెను కనిపెట్టుకొని వుంటున్నాడు రాజయ్య.
అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేలేత కిరణాలు రాధమ్మ ముఖం మీద పడి ఎరుపెక్కుతున్నాయి. ఏడ్చిఏడ్చి ఎర్రబారిన కళ్లు చింతనిప్పుల్లా వున్నాయి. చారలు కట్టిన కన్నీటి ధారలు ఎర్రగా మెరుస్తున్నాయి.
'మావా... మావా..' అనుకుంటా ఎర్రజెండాలు పట్టుకొన్న నలుగురిని తీసుకొని హడావుడిగా వచ్చాడు బదిరినాగ...
రాధమ్మనే చూస్తా కూర్చున్న రాజయ్య... 'ఏట్రా నాగ... ఏటైనాది...' అంటూ వసారాలోంచి బయటకి వచ్చాడు.
'మావా... మన నిర్వాసితుల తరపున ఈల్లు పోరాటం సేత్తన్నారు. పునరావాసం, సరైన పరిహారం, బూములు కోల్పోయినవారికి బూములు ఇయ్యాలని పాదయాత్ర సేత్తన్నారు. మనం కూడా ఆ పాదయాత్రకు ఎల్దాం. మన కట్టాలు సెప్పుకుందాం...' అన్నాడు.
'అరే నాగా... అధికార పార్టీవోల్లకి కోపమొత్తదేమోరా... మనోల్లకి చాలామందికి పరిహారం రాలేదు. బూములు ఇయ్యినేదు. ఈ కాలనీ సూసీవుగా ఎట్టావున్నాదో. ఇది బాగవ్వాలంటే మన ఎంకటేసుగాడు సెప్పినట్టు సేత్తే మంచిదేమో' అన్నాడు రాజయ్య.
రాధమ్మ అలా కూర్చొనే వుంది గంభీరంగా.... వాళ్ల మాటలన్నీ వింటూ...
'అన్నా... ఇన్నేళ్లు మీరు పోరాటం చేస్తూనే వున్నారు. వాళ్లచుట్టూ వీళ్లచుట్టూ తిరుగుతూనే వున్నారు. ఏం జరిగింది? కాళ్లు పట్టుకొని బతిమాలితే పనులు కావన్నా.... నిలదీసి అడగాల్సిందే. మీ కోసం, మీ హక్కుల కోసం మేము నిర్వహిస్తున్న పాదయాత్ర రేపు మీ ఊరు మీదుగానే వెళుతుంది. మీ కాలనీ వాళ్లంత పాదయాత్రకు రండి. మీ సమస్యలపై అందరం కలిసి పోరాడదాం' అన్నారు ఎర్రజెండా కార్యకర్తలు.
రాజయ్య... ఏం చెప్పాలో అర్థంకాక... నసుగుతున్నాడు.
'అన్నా... మేము రేపొద్దునే పాదయాత్రకు వత్తాంలే' అన్నాడు బదిరినాగ.
'నాగా... రేపొద్దున కాదు... ఇపుడే... ఇప్పుడే ఎల్తన్నాం' అంటూ లేచింది రాధమ్మ. మాటలు పేలుతున్న తూటాల్లా వున్నాయి.
'ఆల్లు మనకోసం పాదయాత్ర సేత్తుంటే... రేపెల్లుడేంది. ఇప్పుడే ఎల్దాం... మనోల్లందరినీ పోగేసుకురా...' అంది.
పవిట చెంగును నడుముకు బిగించింది. పాదయాత్రికుల చేతిలోనున్న ఎర్రజెండాను లాక్కున్నట్టుగానే తీసుకొని భుజాన వేసుకుంది.
రక్తవర్ణంగా మారిన ఆమె కళ్లు సూర్యబింబాల్లా అగుపిస్తున్నాయి. ఆమె కన్నీళ్లు ఎరుపెక్కిన అగ్నిశిఖల్లా మెరుస్తున్నాయి.
'ఇప్పటిదాకా ఇంటికోసం ఏడ్సాం... బూమికోసం ఏడ్సాం....పరిహారం కోసం ఏడ్సాం. ఇంక ఏడ్వడం కాదు... పోరాట్టమే. మల్లీ రాయే...' అంటూ ఒక చేత్తో మల్లి చెయ్యి పట్టుకుంది. మరో చేత్తో ఎర్రజెండా భుజానేసుకుని పాదయాత్రలో కలిసేందుకు అడుగు ముందుకేసింది రాధమ్మ. ఆమె అడుగులో అడుగు కలిపాడు రాజయ్య.

రాజాబాబు కంచర్ల
94900 99231