
తిరుపతి నగరంలో గురు, శుక్ర వారాల్లో నిర్వహించిన రాష్ట్రాల కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సు శ్రామిక వర్గాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. కార్మిక జీవనోపాధులకు భరోసాను కల్పించే చట్టాలన్నిటినీ రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్ కంపెనీలకు శ్రమశక్తిని దోచిపెట్టే ఉద్దేశ్యంతో తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లకు సమ్మతిని సమీకరించడమే ఈ సదస్సు లక్ష్యం. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా.. బిజెపి మాత్రం తన మందబలంతో లేబర్ కోడ్‌లకు ఈ సదస్సులో సమ్మతి లభించినట్లుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఆసాంతం కార్మికుల ప్రయోజనార్థమే అన్నట్టు సాగినా..ఆయన వినియోగించిన పదజాలం వెనుక 'పెట్టుబడి'దారుల స్వరాలే ప్రతిధ్వనించాయి. 'ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేసెస్, వర్క్ ఫ్రం హోం ఎకోసిస్టమ్, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ (అనువైన పనిచోటు, ఇంటి నుంచే పని వాతావరణం, అనువైన పనిగంటలు)..ఇదే భవిష్యత్ అని ఆయన ఉద్బోంధించారు. కోవిడ్ సాకుతో బహుళజాతి సంస్థలు ఈ విధానాలు అమల్జేసి ఇప్పటికే పనిగంటలు పెంచి వేతనాలు తగ్గించడమే కాకుండా కోట్లాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన వైనాన్ని చూశాం. తొలగింపులు కొనసాగుతూనే వున్నాయి. ఈ విధానాలే గొప్పవంటూ కార్మికలోకాన్ని గందరగోళ పర్చేందుకు మోడీ తిరుపతి సదస్సును వేదికగా చేసుకున్నారు. 'ఓలా, జొమాటో వంటి ఇ-కామర్స్ ఆధారిత చిన్నచిన్న పనులకు సంబంధించిన 'గిగ్' ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకొని 'గ్లోబల్ లీడర్'గా అవతరించాలన్నది ప్రధాని మరో ఉద్ఘాటన. గాలి బుడగ లాంటి ఈ 'గిగ్' ఎకానమీలో ఉపాధికి భరోసా అన్వేషించడమంటే ఎండమావిలో నీటి చెమ్మ వెతుక్కోవడం వంటిదే. సాధారణ కార్మికులకుండే కనీస హక్కులకు కూడా నోచుకోకుండా 'గిగ్' ఉద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. లేబర్ కోడ్‌లతో శ్రమజీవుల హక్కులను కాలరాయొద్దంటూ ఈ సదస్సుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కార్మికులపైనా కార్మిక సంఘాల నాయకులపైనా నిర్బంధం ప్రయోగించడం సిగ్గుచేటు.
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పేరిట ఇప్పటికే శ్రమదోపిడిని ఒక కొలమానంగా నిర్దేశించిన కేంద్రం...లేబర్ కోడ్‌ల విషయంలోనూ రాష్ట్రాలపై తీవ్ర ఒత్తిళ్లను కొనసాగిస్తోన్న సంగతి విదితమే. ఈ ర్యాంకుల్లో దేశంలోనే నంబర్1 గా నిలిచేందుకు గతంలో టిడిపి ప్రభుత్వం వెంపర్లాడగా.. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తూ దానినే పారిశ్రామిక ప్రగతిగా చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశంలోనే తొలిసారి లేబర్ కోడ్‌లకు మద్దతు ప్రకటిస్తూ శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టి మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు తలొగ్గిన అపఖ్యాతి కూడా వైసిపి తన ఖాతాలో వేసుకుంది. కార్మిక మంత్రుల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలోనూ లేబర్ కోడ్‌లను ప్రశంసలతో ముంచెత్తారే తప్ప కార్మికుల ఘోషను పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏ దేశంలోనైనా పనిగంటలు, ఉపాధి భద్రత, కనీస వేతనం, పని ప్రదేశాల్లో రక్షణ, ఆరోగ్య సంరక్షణ, పరిహారం, పదవీ విరమణ అనంతర భృతి...అనేవి పరిశ్రమల యాజమాన్యాలు శ్రమజీవుల పట్ల నిర్వర్తించాల్సిన కనీస కర్తవ్యాలు. లాభాల వేటలో శ్రమజీవులను అనునిత్యం దోపిడి చేస్తే.. పని చేసేందుకు కార్మికుడనేవాడే లేకుండా పోతాడనే భయంతో కనీసం వారి జీవనోపాధులకైనా కనీస భద్రత కల్పించాలని 'పెట్టుబడి' మేధావులు సైతం కోరుతుంటారు. భారత ప్రజలను పీక్కుతిన్న వలసవాద ఆంగ్లేయుల పాలనలోనూ కార్మిక హక్కులు కాస్తయినా గుర్తింపునకు నోచుకున్నాయి. కార్మికుల విశాల పోరాటాల ఫలితంగా స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పెద్దలు, స్వాతంత్య్రోద్యమ పాలకులు శ్రమజీవుల బతుకుదెరువులకు భరోసాను కల్పించే అనేక చట్టాలు అమల్లోకి తీసుకొచ్చారు. నయా ఉదారవాద సంస్కరణల అమల్లోకి వచ్చిన 1990 దశకం నుంచే కార్మిక చట్టాల నిర్వీర్యానికి తెరదీసిన పాలకులు ఇప్పుడు ఏకంగా సమాధే కట్టేస్తు న్నారు. కార్పొరేట్ అనుకూల ఉన్మాదంతో ఊగిపోతున్న మోడీ సర్కార్ దుర్మార్గాన్ని విశాల కార్మిక ఐక్యతా పోరాటాలతోనే తిప్పికొట్టాలి.