Jul 09,2023 07:46

మట్టి గోడల చాటున ఒట్టి మనుషులు
వానకి తడిచి ఎండకు ఎండి
గాలికి తుళ్ళి చలికి వణికి
అర్ధ ఆకలితో, అర్ధ నిద్రలతో
రోజులు గడుస్తున్నా
చలనం లేని జీవితాలు
నిత్యం సాగుతున్న ప్రయాణాలు
నిత్యం ఆగుతున్న ప్రాణాలు
ఆ..ఆగిన ప్రాణాలకు
ప్రాణం ఎప్పుడొస్తుందో..?

ఊరు పేరు లేని
పల్లె గుడిసెల చాటున
ఎక్కడో దూరంగా
మూలుగుతున్న శబ్దాలు
అన్నార్తుల ఆర్తనాదాలు
బోరుమని విలపిస్తున్న రోదనలు
ఒక్క పూటకోసం
ఒక్క బతుకు కోసం
బతక లేక బతుకుతున్న బతుకులు
కాలగర్భంలో కలిసిపోతు
ఎన్ని జీవితాలు కరిగిపోతున్నాయి
ఆ కరిగిన జీవితాల్లో
వెలుగు ఎప్పుడొస్తుందో..?

మొండి మనసుతో దష్ట చిత్తంతో
క్రూర మృగాలులా మారి
లేలేత చిరు మొగ్గలును
మూర్ఖపు బుద్ధితో
చిత్ర విచిత్రమైన ఆకృత్యాలతో
మారణహోమం సృష్టిస్తుంటే
మనిషిలో మానవత్వం మరణిస్తుంది
మానవత్వం ప్రజ్వలించే క్షణం
ఎప్పుడొస్తుందో..?

కార్మికుల కష్టాన్ని శ్రామికుల శ్రమని
నిరుద్యోగుల జీవితము
తాకట్టు పెట్టుకొని
పెట్టుబడి దారులు
బతుకు సాగిస్తున్నారు
ఆ దోపిడీదారుల జీవితాలు
భస్మాసురుని చేతుల్లో
భస్మం అయ్యేరోజు
ఎప్పుడొస్తుందో..?

ఐదేళ్లకొక్కసారి
వేషాలు వేసుకొని, ఊరూరా తిరిగి
పూట పూట కొత్త కొత్త మాటలతో
కొత్త ఆశలు పుట్టిస్తూ
పురిటిలోనే ఆశలు చంపేస్తు
రాజ్యమేలుతున్న నాయకుల
రాక్షస పాలన నిప్పుల్లో కలిసిపోయి
మనిషిని బతికించే రాజ్యం
ఎప్పుడొస్తుందో..?

లక్ష్మీ శ్రీనివాస్‌
9676601192