
రాష్ట్రంలో తాజాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. నిబంధనను అతిక్రమించినవారికి రూ.100 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం అమలులోకి తెచ్చింది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, గ్లాస్‌లు నిషేధించాలి. వీటి నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి 350 మైక్రాన్లకు పైగా ఉండే ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఫ్లెక్సీ షాపులవారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏళ్ల తరబడి ఫ్లెక్సీ వ్యాపారాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి మార్కెట్‌లో కడుతున్న ఫ్లెక్సీలు ప్లాస్టిక్ నిషేధిత జాబితాలోకి రావంటూ తయారీదారులు చెబుతున్నారు. వాటిని తిరిగి వినియోగించుకునే ప్లాస్టిక్‌గా పర్యావరణ శాఖ నిర్ధారించింది. ఇతర రాష్ట్రాల్లో ఇదేమాదిరిగా నిషేధం విధిస్తే అక్కడ తయారీదారులంతా పర్యావరణ సర్టిఫికెట్లు తెచ్చుకొని, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించారు. ఎప్పటిలాగే ఫ్లెక్సీలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల యాజమాన్యం ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించియున్నారు.
ప్రస్తుతం తయారవుతున్న ఫ్లెక్సీలపై అడుగుకు రూ.10 వ్యయం అవుతోంది. అదే గుడ్డతో తయారుచేయాలంటే రూ.35 వెచ్చించాలి. అదికూడా ప్రస్తుతం ఉన్న యంత్ర పరికరాలతో సాధ్యం కాదు. పరికరాలను మార్చుకోవాలి. కనిష్టంగా రూ.20 లక్షలు పెట్టుబడి అవసరం కానుంది. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టే పరిస్థితిలో తయారీదారులు లేరు. మరోవైపు గుడ్డతో తయారీ చేస్తే ధర అధికమవుతుంది. ఇంత భారీ ఖర్చు భరించలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు బ్యానర్లు వేయించేందుకు ముందుకు రారు. పైగా వస్త్రం ఫ్లెక్సీ మన్నిక కూడా చాలా తక్కువ కావడం వల్ల వ్యాపారులు ఎవరూ బ్యానర్లు, హోర్డింగులు వేయించే అవకాశమే లేదు. ఇలా మొత్తంగా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది.
పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు హోర్డింగ్‌ల నుండి అధిక ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా హోర్డింగ్‌లో ఉన్న ఫ్లెక్సీలను తొలిగించడం వల్ల అవి ఏర్పాటు చేసిన సంస్థలకు, వ్యాపార సంస్థలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. తద్వారా పురపాలక సంఘాలకు కూడా ఆదాయం పడిపోతుంది. ఇప్పటి ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నాయకునిగా చేసిన ఓదార్పు యాత్ర, పాదయాత్రల్లో ప్రచారానికి అధికంగా వాడుకుంది ఈ ఫ్లెక్సీలనే. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల ప్రచారానికి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల ప్రచారానికి విశేషంగా ఫ్లెక్సీలను వినియోగిస్తున్నారు.
వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు సరికదా ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది. నదుల్లో ఇసుకను ఇష్టం వచ్చినట్లు తోడేస్తున్నారు. అడవులను ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు విరుద్ధంగా గనులు తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే క్రమంలో నదీపాయలు ప్రవహించే మార్గాలను చదును చేసి ఫ్లాట్లుగా మారుస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో పంటపొలాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలోని కొండలను కొల్లగొడుతున్నారు. విశాఖలో కాలుష్య నివారణకు అసలు చర్యలు తీసుకోకపోగా, రుషికొండను బోడిగుండును చేశారు. క్వారీల్లో, చెరువుల్లో మట్టిని పరిమితిని మించి ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో. ఈ ప్రతి విధ్వంసం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందనేది వాస్తవం. నీటి వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న కంపెనీలను అడ్డుకునే ప్రయత్నం ఒక్కటి కూడా వైసిపి ప్రభుత్వం చేయలేదు.
ముఖ్యమంత్రికి నిజంగా పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి. నివారణా చర్యలు చేపట్టాలి. వాటన్నింటిని వదిలిపెట్టి కేవలం ఫ్లెక్సీలను నిషేధిస్తే సరా? బాగా వాడుకలో ఉన్న ఒక వస్తువుని నిషేధించాలంటే అది ఒక క్రమపద్ధతిలో అంచలంచెలుగా జరగాలి. పైగా పర్యావరణానికి అత్యంత హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు, గ్లాస్‌లు నిషేధించకుండా ఫ్లెక్సీలను నిషేధించడమనేది నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది. లక్షల మంది జీవనభృతికి సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం ఆచితూచి సమగ్రంగా ఆలోచన చేసి, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
- డా|| తన్నీరు కళ్యాణ్ కుమార్,
తెనాలి.