Sep 06,2023 17:02

ప్రజాశక్తి - యానాం (కాకినాడ) : పర్యవరణాన్ని పరిరక్షించుకుంటూ, కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ టీవీఎస్‌ ప్రకాశరావు అన్నారు. బుధవారం స్థానిక మెట్టకూరు నవోదయ విద్యాలయంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా ''విద్యాలయ పరిసరాలు పచ్చదనం'' కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యాలయ పరిసరాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా, పచ్చగా ఉంచాలని కోరుతూ సింగిల్‌ యూసేజ్‌ ప్లాస్టిక్‌ ను నిర్మూలించే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని కోరారు. నీటిని వృధా చేయకుండా సంరక్షిస్తూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు కనీసం ఒక లీటరు నీటిని పొదుపు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై పిల్లలు తయారుచేసిన నినాదాలు చెబుతూ ప్రదర్శించారు. అనంతరం విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఆయుష్‌ వెల్నెస్‌ హాస్పిటల్‌ న్యూట్రీషియన్‌ డాక్టర్‌ గ్లోరీ కుమారి పిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను వివరించారు. అనంతరం సిబ్బంది విద్యార్థులు అరిటాకులో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థుల కెప్టెన్‌ పాపారావు, విద్యాలయ వైస్‌ ప్రిన్సిపల్‌ బేగం, సీనియర్‌ అధ్యాపకులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.