
'కాశ్మీర్ ఫైల్స్' హడావుడి సద్దుమణగక ముందే వచ్చింది అక్షరు కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' చిత్రం. ఎన్నడూ లేని విధంగా, లాస్ట్ హిందూ సమ్రాట్ అని ఈ చిత్రం ట్యాగ్‌లో హిందూ పదం చేర్చారు. సినిమాలు కులమతాలకు అతీతంగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు హిందూత్వ రాజకీయాలు చెలరేగిపోయిన పూర్వరంగంలో ముస్లిం వ్యతిరేకత ఎక్కువగా చాటుకుంటే వాణిజ్యపరంగా లాభదాయకమని బాలీవుడ్ భావిస్తున్నది. పృథ్వీరాజ్ చౌహాన్ వీరుడు, దేశం కోసం పోరాడినవాడు. అయితే ఆఖరి హిందూ సమ్రాట్ కాదు... పృథ్వీరాజ్ పాత్ర కన్నా ముస్లింల దురాక్రమణ దుర్మార్గాలనే వాటిని చూపించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. మహ్మద్ గోరీ ఉత్తర్వులతో అంధుడిగా చేయబడిన పృథ్వీరాజ్ ఆయనను చంపినట్టు చెప్పే కథలను మరింత నాటకీయంగా చూపించారు. అంతేగాక ధర్మాన్ని పాటించే పృథ్వీరాజ్ ప్రేమించి పెళ్లాడిన సంయుక్తకు సమాన హక్కులు ఇచ్చినట్టు కూడా చిత్రించారు. అయితే పద్మావతి చిత్రంలో లాగే ఇందులోనూ ఆఖరులో ఆమె సామూహిక సతీసహగమనం చేసుకుంటారు! బాలీవుడ్‌కు, సంఘ పరివార్‌కు...చరిత్ర, తర్కం రెండూ అవసరం లేదు.
రాజకీయ అవసరాల కోసం మోడీ సర్కారు తొలిసారి తెలంగాణ అవతరణ దినోత్సవం ఢిల్లీలో జరిపిన సందర్భంలో హోంమంత్రి అమిత్‌షా అనేక ఆణిముత్యాలు వెలువరించి చరిత్రకారులను అబ్బురపరిచారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన యోధులలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు ఒకరని ప్రవచించారు. దానికి తోడు మరికొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావించి నాటి పోరాట నేతలైన కమ్యూనిస్టులను మాత్రం దాటవేశారు అమిత్‌షా. అలా చేయడంలో ఆశ్చర్యం లేదుగాని విశాఖ ఏజన్సీలో పోరాడిన గోదావరి బిడ్డ అల్లూరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడమేమిటని అంతా నివ్వెరపోయారు. ఏదో పొరబడ్డారని అనుకుందామంటే ఈ సందర్భంలో సాంస్కృతిక శాఖ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో కూడా అల్లూరి చిత్రం పెట్టారు. ఆయన నిస్సందేహంగా మహా యోధుడు. కాని 1924 లోనే బ్రిటిష్ పాలకులు ఆయనను అమానుషంగా బలిగొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 1940 లలో మొదలైంది. మరి దేశ హోం మంత్రి ఇంత పెద్ద పొరబాటు ఎలా చేశారు? అంటే ఒక తక్షణ సమాధానం లభిస్తుంది. ఆయన రాజమౌళి తీసిన ప్యాన్ ఇండియా కల్పనా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ చూసి చెప్పి వుంటారు! ఆ చిత్రంలో కొమరం భీమ్, అల్లూరి కలసి పోరాడినట్టు ఊహాజనిత కథతో ఏదేదో తీశారు. భారీ వ్యయంతో సెట్టింగులు, లొకేషన్లు, సాంకేతిక విలువలు, గ్రాఫిక్కులు అదిరిపోయినా చరిత్ర మాత్రం కాదు. వారిద్దరూ కొంతకాలం ఎవరికి చెప్పకుండా ఎక్కడికో పోయారనే అంశం ఆధారంగా ఈ కథ అల్లినట్టు రాజమౌళి (ఆయన తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్) చెప్పారు. చిత్రంలో మాత్రం పాత్రలు కల్పితాలు అని వేశారు. వారి పూర్తి పేర్లు చెప్పకుండా గారడీ చేశారు. అంతేనా? పంజాబ్ కేసరిగా ప్రసిద్ధుడైన లాలా లజపతిరారుపై కలకత్తాలో లాఠీచార్జి చేశారని ఆ చిత్రంలో చెబుతారు! కథాపరమైన ట్విస్టులు, ఫార్ములాలు అలా వుంచితే ఈ చిత్రంలో మరో విడ్డూరం రామరాజును రాముడిగా, భీమ్‌ను ఆంజనేయుడి ప్రతీకగా చూపుతారు. గాయపడిన రామరాజుకు పసర్లు, మూలికలతో చికిత్స చేసిన భీమ్ అక్కడున్న శ్రీరాముడి విగ్రహం, పక్కన కాషాయ జెండాలు తీసి రామరాజుకు కప్పుతాడు. శ్లోకాల మధ్య నీళ్ల లోంచి లేచి వస్తాడు రామరాజు. 'ఆంజనేయుడు సీత కోసం వెతకాలి గాని రాముడి కోసం కాదు' అని భీమ్ రామరాజు కోసం వెతుకుతూ వచ్చిన సీతతో అంతకు ముందు అంటాడు. కాబట్టి దర్శకుడి సంకేతం, సందేశం స్పష్టం.
పరివార్ పరంపర
'బాహుబలి'తో అపూర్వ స్థానం పొందిన రాజమౌళి కట్టప్ప పాత్రను ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో కూడా చెబుతూ వచ్చారు. విడుదలకు ముందే ఆర్‌ఆర్‌ఆర్ గురించీ మాట్లాడటం మొదలెట్టారు. ఆ చిత్రం చివరలో చూపిన పాటలో గాంధీ, నెహ్రూ లేకుండా నేతాజీ, ప్రకాశం వంటి వారిని, సంఘ పరివార్ చెప్పే కొందరు నేతలను, ఆఖరులో ఛత్రపతి శివాజీని కూడా చూపించారు. దానికి ఏదో అతకని వివరణ ఇచ్చారు. కాని ఇందులోని సందేశం చాలా స్పష్టం. బాహుబలి విజయం తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రపై కథ రాస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఆయన రాసిన 'బజరంగీ భారు జాన్' కూడా హిందూ ముస్లిం ఇండియా, పాకిస్తాన్ సంబంధాల నేపథ్యంలో నడుస్తుంది.
వాజ్‌పేయి హయాంలో కూడా తెలుగులో 'ఖడ్గం, ఆజాద్, జై...' వంటి చిత్రాలలో బిజెపి తరహా రాజకీయాలు చూపించారు. మోడీ రాజ్యంలో మిగిలిన అన్ని రంగాలలో జరిగినట్టే ఇది వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫాం కూడా వచ్చాక సెన్సార్ లేకుండానే కూడా ప్రేక్షకులను చేరే అవకాశం లభిస్తున్నది. సెన్సార్ బోర్డు లోనూ బిజెపి ఇష్టులే తిష్టవేసి వున్నారు. మరీ ముఖ్యంగా హిందీ చిత్ర రంగం లేదా బాలీవుడ్ అనేది ఇందుకు వేదికగా మారడం పరిశీలకులను ఆందోళన పరుస్తున్నది. 'బాజీరావు మస్తానీ, పద్మావతి'... కంగనా రనౌత్ తీసిన 'మణికర్ణిక (విజయేంద్ర ప్రసాద్ రాసిన ఝాన్సీలక్ష్మి కథ), తానాజీ, పానిపట్...' వంటి చిత్రాలు గతంలోనే ఈ ధోరణిని ప్రారంభించాయి. చరిత్ర పుస్తకాలు లేదా రాజకీయ విధానాలలో మార్పులు ఒకటైతే అతి పెద్ద వినోద సాధనంగా అందరికీ అందుబాటులో వున్న సినిమాల ద్వారా విస్తార జన బాహుళ్యం మెదళ్లలో మత విద్వేషం జొప్పించబడుతుందనేది ఈ ఆందోళనకు కారణం. పరివార్ తరహా అధీకృత దేశభక్తి, భారత సైన్యం శౌర్యం మేళవించిన యుద్ధ చిత్రాలు లేదా ఆపరేషన్లు కూడా సినిమాలుగా వచ్చాయి.
'కాశ్మీర్ ఫైల్స్' రాజకీయాలు
ఇటీవల 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రం ఈ ధోరణిని పరాకాష్టకు చేర్చింది. వీటన్నిటిలోనూ హిందూ ముస్లిం మతాలను వైరి వర్గాలుగా చూపించడం సర్వసాధారణం. చరిత్రలో జరిగిన యుద్ధాలు, ఆక్రమణలు, ఓటములు అన్నిటినీ మత ప్రాతిపదికనే చిత్రిస్తూ ముస్లింలు దురాక్రమణదారులనే సందేశం కీలకంగా ఇవి నడుస్తాయి. 'కాశ్మీర్ ఫైల్స్'ను నేరుగా మోడీతో సహా బిజెపి అధినేతలు, ప్రభుత్వాలు బహిరంగంగా నెత్తికెత్తుకోవడమేగాక పలు రాష్ట్రాల్లో వినోదపు పన్ను కూడా రద్దు చేశాయి. తాము ఆ చిత్రం చూస్తున్న దృశ్యాలను వారు ట్వీట్ చేశారు. మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కాశ్మీర్‌కు 370వ అధికరణం రద్దు చేసి, రాష్ట్ర హోదా తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి గవర్నర్ ద్వారా కేంద్రమే ఏలుతున్నది. ఈ సమయంలో వరసగా తొమ్మిది మంది పండిట్లు ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారు. వారికి భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వం 1990 నాటి పరిస్తితిని చూపించే 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని మాత్రం విపరీతంగా ప్రచారం చేసి నిర్మాతలకు లాభాలు కురిపించింది. అనుపమ్ ఖేర్ మినహా మరే ప్రముఖ నటుడు లేని ఈ ద్వితీయ శ్రేణి చిత్రం వారం రోజులలో 200 కోట్లు వసూళ్లు రాబట్టి భారీ బడ్జెట్‌లతో తీసిన 'పుష్ప, కెజిఎఫ్ 2' వంటి చిత్రాలతో పోటీ పడింది. బిజెపికి రాజకీయ ఆయుధంగా మారింది. ఒకప్పటి సోవియట్ లోని తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై కట్టుకథలతో 'తాష్కెంట్ ఫైల్స్' తీసిన వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్ర నిర్దేశకుడు. ఇటీవల ఈయన లండన్‌లో యూనివర్సిటీలలో మాట్లాడాలంటే అనుమతి లభించలేదు. కారణం మత విభజన సందేశంతో తీసిన 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రమే. ఈ చిత్రాన్ని మలేషియా, సింగపూర్ వంటి దేశాలు నిషేధించాయి. కాశ్మీర్ పండిట్లపై హత్యాదాడులను ప్రతివారూ ఖండిస్తారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, మూడోసారి ఎంఎల్‌ఎ యూసఫ్ తరిగామి వాస్తవానికి పండిట్లపౖౖె దాడిని ఎదుర్కొనే సందర్భంలోనే తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. ఉగ్రవాదులకు గాని వారికి బలయ్యేవారికి గాని మత తేడాలు వుండవు. శవాల్లో మతాలు చూడటం కుసంస్కారం, కుటిల రాజకీయం. కాశ్మీర్‌లో పండిట్ల కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ముస్లింలూ బలయ్యారు. ఉగ్రవాదులే గాక పోలీసులూ సాయుధ దళాలు వారిపై నిర్బంధం సాగిస్తుంటారు. కనుక కాశ్మీర్ దుర్ఘటనలను మత కోణం లోనే చూపడం అలాంటి వ్యూహం మాత్రమే. ఇదే వ్యూహంతో 'కాశ్మీర్ ఫైల్స్' తీసి మరీ ప్రచారం చేయడం రాయితీలతో ప్రోత్సహించడం మరెంత విచిత్రం? ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి మరో ఫైల్స్ తీసేందుకు సన్నద్ధమవుతున్నారట.
చివరి హిందూ సమ్రాట్!
ఆ హడావుడి సద్దుమణగక ముందే వచ్చింది అక్షరు కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' చిత్రం. ఎన్నడూ లేని విధంగా, లాస్ట్ హిందూ సమ్రాట్ అని ఈ చిత్రం ట్యాగ్‌లో హిందూ పదం చేర్చారు. సినిమాలు కులమతాలకు అతీతంగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు హిందూత్వ రాజకీయాలు చెలరేగిపోయిన పూర్వరంగంలో ముస్లిం వ్యతిరేకత ఎక్కువగా చాటుకుంటే వాణిజ్యపరంగా లాభదాయకమని బాలీవుడ్ భావిస్తున్నది. పృథ్వీరాజ్ చౌహాన్ వీరుడు, దేశం కోసం పోరాడినవాడు. అయితే ఆఖరి హిందూ సమ్రాట్ కాదు. సంఘపరివార్ ఎప్పుడూ చెప్పే శివాజీతో సహా ఎందరో రాజులున్నా ప్రచారం కోసం ఈ మాట జోడించారు. ఇంతా చేసి ఈ చిత్రం భారీ చరిత్ర చిత్రాల కోవలో నిర్మించిందేమీ కాదట. పృథ్వీరాజ్ పాత్ర కన్నా ముస్లింల దురాక్రమణ దుర్మార్గాలనే వాటిని చూపించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. మహ్మద్ గోరీ ఉత్తర్వులతో అంధుడిగా చేయబడిన పృథ్వీరాజ్ ఆయనను చంపినట్టు చెప్పే కథలను మరింత నాటకీయంగా చూపించారు. అంతేగాక ధర్మాన్ని పాటించే పృథ్వీరాజ్ ప్రేమించి పెళ్లాడిన సంయుక్తకు సమాన హక్కులు ఇచ్చినట్టు కూడా చిత్రించారు. అయితే పద్మావతి చిత్రంలో లాగే ఇందులోనూ ఆఖరులో ఆమె సామూహిక సతీసహగమనం చేసుకుంటారు! బాలీవుడ్‌కు, సంఘ పరివార్‌కు...చరిత్ర, తర్కం రెండూ అవసరం లేదు. యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ థియేటర్లో ఆ చిత్రం చూస్తున్న ఫొటోలు విడుదల చేసి ఊపునిచ్చేందుకు ప్రయత్నించారు. యు.పి తో సహా మరికొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు వినోదపు పన్ను తగ్గించాయి. ఇన్ని సందేహాలతో చుట్టబెట్టినందుకే పృథ్వీరాజ్ ఆశించిన ఆదరణ పొందడం లేదని తొలి వార్తలు. ఈ చిత్రం కోసం అక్షరు కుమార్ చరిత్ర పుస్తకాలపై దాడికి దిగారు. పృథ్వీరాజ్ గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా కనిపించదనీ, మొఘలాయిల గురించే ఎక్కువగా రాశారని ఆరోపించారు. సిబిఎస్‌ఇ సిలబస్‌లో 10వ తరగతిలో పృధ్వీరాజ్‌పై రెండు అధ్యాయాలు వున్నాయి. పైగా పృథ్వీరాజ్ మరణం తర్వాత 300 ఏళ్లకు బాబర్ దండయాత్ర జరిగితే ఆ రెంటినీ కలిపి చూపడమేమిటన్నది మరో ప్రశ్న. ఉత్తముడైన రాజు-దుష్టుడైన సుల్తాన్ ఫార్ములాతో ఇంకొన్ని చిత్రాలు విడుదలవొచ్చు. ఇవేగాక బాహుబలి ప్రభాస్ ఆదిపురుష్ పేరిట శ్రీరాముడిగా కనిపించే చిత్రం భారీగా తయారవుతున్నది. ఈ రాముడు ఎన్టీఆర్ చిత్రాల్లో లాగానో లేక బాపు చిత్రాల్లో లాగానో వుండబోరు. సంఘ పరివార్ రూపొందించిన రాంబో రాముడి తరహాలో పోస్టర్లు కనిపిస్తున్నాయి. ప్రభాస్ పెదనాన్న గాడ్‌ఫాదర్ కృష్ణంరాజు బిజెపి మాజీ మంత్రి.
సంఘ పరివార్‌కు గిట్టని తారలు ప్రముఖులపై దాడులు, కేసులు, ట్రోలింగులు కూడా ఘెరంగా తయారైనాయి. జావేద్ అక్తర్, సల్మాన్ ఖాన్, అమీర్‌ఖాన్, షారూక్ ఖాన్ వంటి వారిపై పరువు నష్టం కేసులు, సోషల్ ట్రోలింగులు చూస్తున్నాం. దీపికా పదుకొనే జెఎన్‌యుకు వెళ్లడం అపరాధంగా దాడి చేశారు. స్వతంత్ర భావాలు గలవారిపై కేసులు, దాడులు చేయడంలో కంగనా రనౌత్ వంటి వారు ముందున్నారు. వివిధ భాషల్లో ఇదే తరహాలో మరికొందరు తయారైనారు. వ్యాపారం ముఖ్యం తప్ప మరే విలువలు వుండనివారు కూడా తోడవుతున్నారు. అయితే అదే సమయంలో సృజన స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం నిలిచే కళాకారులు, దర్శకులు కూడా ధైర్యంగా ముందుకొస్తున్నారనడానికి కొద్ది కాలం కిందట సంచలనం సృష్టించిన సూర్య చిత్రం 'జై భీమ్' ఒక ఉదాహరణ. 'మొఘల్ ఏ ఆజం, మదర్ ఇండియా, దో బిఘ జమీన్, షహీద్...' వంటి చిత్రాలకు పట్టం కట్టి సమైక్యతా సందేశం చాటిన బాలీవుడ్ ఈ పరిస్థితి దాటి తప్పక ప్రగతిశీలంగా నిలుస్తుందని ఆశిద్దాం. అలాగే తెలుగు తదితర భాషల్లోనూ అభ్యుదయ సంప్రదాయం నిలబెట్టుకుందాం.
తెలకపల్లి రవి