Feb 19,2023 08:27

నాన్‌వెజ్‌ రుచులు ఎప్పటికీ జిహ్వ చాపల్యాన్ని కలిగిస్తాయి. అందునా జల చరాలంటే.. ఆరోగ్యం కూడాను. వాటిలో కొవ్వు పదార్థాలు తక్కువగానూ, పోషకాలు ఎక్కువగానూ ఉంటాయి. చేపల్లో అల్జీమర్స్‌ను నిరోధించే కారకాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుకుగా పనిచేయడం, జ్ఞాపకశక్తి పెరగడం, మానసిక ఆందోళనను తగ్గించడం లాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్‌, ఇతర అనారోగ్య కారక నిరోధకాలున్నాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే వీటిని ఎండబెట్టి కూడా ఉపయోగించడం అనాది నుంచి వస్తున్నదే. నిలువ ఉంచడానికి ఉప్పులో ఊరబెట్టడం వల్ల తరచూ వాడక, అప్పుడప్పుడు వండుకోవచ్చు. మరి నోరూరించే ఆ డ్రై ఫిష్‌ రుచులేంటో తెలుసుకుందాం.

  • పండుగప్పతో..
1

కావలసినవి : చేప ముక్కలు - 1/2 కేజీ, నూనె - 150 గ్రా, దోసకాయ - 1, ఉల్లిపాయలు - 3, పచ్చిమిర్చి - 4, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ధనియాల పొడి - స్పూను, పసుపు - 1/4 స్పూను, ఉప్పు, కారం - తగినంత
తయారీ : బాండీలో నూనె వేడిచేసి, శుభ్రం చేసిన చేప ముక్కలను రెండువైపులా ఎర్రగా వేయించుకుని పక్కనుంచుకోవాలి. (ముక్కలు చెదిరిపోకుండా నెమ్మదిగా వేయించాలి) అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు గోల్డెన్‌ కలర్‌ వచ్చేలా వేపాలి. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, దోసకాయ ముక్కలు (కాస్త పెద్దగానే కట్‌ చేసుకోవాలి), పసుపు, కారం వేసి ఒకసారి కూరను కలిపి, మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత పక్కనుంచుకున్న చేప ముక్కలు వేసి, ధనియాల పొడి చల్లుకోవాలి. ఇప్పుడు బాండీని రెండు చేతులతో పట్టుకుని కూరను కలిపి రెండు నిమిషాలు మూతపెట్టి, ఉడికించాలి. అంతే ఎండు పండుగప్ప, దోసకాయ కూర రెడీ.

  • మెత్తళ్ళతో..
1

కావలసినవి: మెత్తళ్ళు (నెత్తళ్లు): 1/4 కేజీ, నూనె - 150 గ్రా, టమోటాలు - 2, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి తరుగు- 2 స్పూన్లు, ధనియాల పొడి - 2 స్పూన్లు, పసుపు - 1/4 స్పూను, ఉప్పు, కారం - తగినంత, నీరు - 1/4 కప్పు
తయారీ : బాండీలో నూనె లేకుండా మెత్తళ్ళను ఐదు నిమిషాలు తిప్పుతూ వేయించాలి. తరువాత వేడి నీటిలో వేసి గరిటెతో కదిపితే మెత్తళ్ళకున్న మురికి పోతుంది. ఆ నీటిని వంపేసి చల్లని నీటితో తేలికగా నాలుగైదు సార్లు కడగాలి. తరువాత బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి, మెత్తబడే వరకూ వేయించాలి. టమోటా తరుగు, ఉప్పు, పసుపు వేయాలి. టమోటా మెత్తగా ఉడికి, కూర అంచుల వెంబడి నూనె కనిపించేంత వరకూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. ధనియాల పొడి, కారం యాడ్‌ చేసి మూడు నిమిషాలపాటు వేయించాలి. తర్వాత కొద్దిగా నీటిని చేర్చి, నూనె తేలేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు మెత్తళ్ళను వేయాలి. కూరను నిదానంగా కలిపి, మూతపెట్టాలి. ఇలా సిమ్‌లోనే నూనె పైకి తేలేంతవరకూ ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే మెత్తళ్ళ కూర రెడీ.

  • వంజరంతో..
1

కావలసినవి : వంజరం చేప ముక్కలు - 1/2 కేజీ, కరివేపాకు - 5 రెబ్బలు, పచ్చిమిర్చి - 5, వెల్లుల్లి రెబ్బలు - 8, అల్లం - అంగుళం ముక్క, నిమ్మరసం- స్పూను, ఉప్పు - తగనంత, గరం మసాలా - స్పూను, ధనియాల పొడి - 3 స్పూన్లు, పసుపు - 1/2 స్పూను, కారం - స్పూను, నీరు - కొంచెం, మైదా - స్పూను, బియ్యపు పిండి - స్పూను
తయారీ : ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి, వెలుల్లి రెబ్బలు, అల్లం, నిమ్మరసం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం నీరు చేర్చి మిక్సీ పట్టి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమానికి బియ్యప్పిండి, మైదా కలిపి చిక్కని పేస్ట్‌ తయారుచేసుకోవాలి. వంజరం చేప ముక్కలకు ఈ పేస్ట్‌ను బాగా పట్టించి, గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత పెనం మీద నూనె చిలకరించి, చేప ముక్కలను సర్ది స్టౌ సిమ్‌లో ఉంచి మూడు నాలుగు నిమిషాలకొకసారి తిప్పుతూ వేయించాలి. ముక్క తిప్పిన ప్రతిసారీ దానిపై రెండు మూడు చుక్కలు నూనెను చిలకరించాలి. బాగా ఎర్రగా వేగిన తరువాత సన్నని కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే వంజరం ఎండుచేపల కూర రెడీ.

  • రిబ్బన్‌ ఫిష్‌తో
fish

కావలసినవి : చేప ముక్కలు - 1/4 కేజీ, నూనె - 4స్పూన్లు, అల్లం, వెల్లుల్లి తరుగు - 2 స్పూన్లు,
తయారీ : బాండీలో నూనె లేకుండా చేప ముక్కలను ఐదు నిమిషాలు తిప్పుతూ వేయించాలి. తరువాత వాటిని వేడి నీటిలో వేసి, రెండు నిమిషాలు అలా ఉంచేసి, చన్నీళ్ళతో కడగాలి. చాకుతో పొలుసులను రబ్‌ చేసి, క్లీన్‌ చేయాలి. నాలుగైదు సార్లు నీటిని మార్చుతూ కడగాలి. ఒక జాలీ గిన్నెలోకి ఈ చేప ముక్కల్ని వేయాలి. బాండీలో నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి తరుగు వేయించి చేప ముక్కలను వేసి ఐదు నిమిషాలు వేయించాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా వేసి రెండు నిమిషాలు తిప్పుతూ వేయించాలి. అంతే పప్పు చారులోకి రుచికరమైన ఉప్పు చేపల వేపుడు రెడీ.