- పని పరిస్థితులు ఘోరం
- కనీస వేతనాలు మృగ్యం
- ఆరోగ్యం దెబ్బతింటే ఇక అంతే
- కార్మికుల గోడు వినేందుకు కంపెనీలు విముఖత
- ఓలా, ఉబర్, అమెజాన్‌లో ప్రమాణాలు సున్నా
- 'ఫెయిర్‌వర్క్ ఇండియా' తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థల్లో అంతులేని శ్రమ దోపిడి సాగుతోందని, పని పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయని ఫెయిర్ వర్క్ ఇండియా అనే పరిశోధనా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. బహుళజాతి సంస్థలకు, దేశీయ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తుండటంతో ఇ-కామర్స్ కంపెనీల ఆగడాలు యేటికేడు శృతిమించుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట పాలకులు కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తుండటంతో అవి మరింతగా శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయి. ఓలా, ఉబర్, డుంజో, ఫార్మాఈజీ, అమెజాన్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్..తదితర ఇ-కామర్స్ కంపెనీలు కార్మిక చట్టాలేవీ తమకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇష్టానుసారం ఉద్యోగుల తొలగింపులు, వేతనాల కోత సర్వసాధారణమై పోయింది. ఈ సంస్థల్లో సరుకుల చేరవేతలో కీలకంగా ఉండే గిగ్ కార్మికులంతా ఒక యూనియన్‌గా ఏర్పడి.. ఆందోళనకు దిగినా ఆ సంస్థలు పట్టించుకునే స్థితిలో లేవు. కార్మికుల ఆందోళన పట్ల కనీసం వాటి స్పందన కూడా తెలపడం లేదు. కనీస వేతనాల్లేవు. సరైన పని పరిస్థితుల్వేని కోట్లాది మంది గిగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా..ప్రభుత్వాలూ పట్టించుకోవటం లేదని 'ఫెయిర్ వర్క్ ఇండియా' తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఐటీ, పబ్లిక్ పాలసీ విభాగంతో కలిసి సంయుక్తంగా జరిపిన పరిశోధనకు సంబంధించి తాజాగా నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది.
పార్లమెంట్‌లో ప్రస్తావన
భారత్‌లో గిగ్ కార్మికుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆన్‌లైన్ వేదికలపై, ఇ-కామర్స్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరి న్యాయమైన కోరికలు, హక్కుల్ని పరిరక్షించాలని ప్రభుత్వాలు ఆలోచించటం లేదు. కార్మికుల రక్షణ, భద్రతపై విధానపరమైన నిర్ణయాలు చేయటం లేదు. ఏ ఒక్క కార్మికుడికీ కనీసం ఆరోగ్య బీమా వర్తించటం లేదు. కార్మికుడు హఠాత్తుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యబారిన పడితే, అతడ్ని ఆదుకునే ఆర్థిక భద్రతా సేవలు లేవు. ఈ-కామర్స్ కంపెనీలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. గిగ్ కార్మికుల సమస్యలపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలు ఎన్నోమార్లు ప్రస్తావించారు. హక్కుల ఉల్లంఘన, వివక్ష నెలకొందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ రంగంలో సరైన విధానాల్ని తీసుకురావాలని కోరారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని 'ఫెయిర్‌వర్క్ ఇండియా' పరిశోధన వెల్లడించింది.
యాజమాన్యాల ఇష్టారాజ్యం
భారత్‌లోని ఇ-కామర్స్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులకు న్యాయమైన వేతనాలు దక్కటం లేదు. న్యాయమైన హక్కులు, యాజమాన్య పద్ధతులు, కాంట్రాక్ట్ విధానాల్లేవని, సరైన పని పరిస్థితులు లేవని నివేదిక పేర్కొన్నది. కంపెనీల్లో అమలవుతున్న పని విధానాలతో కార్మికులకు ఎలాంటి లబ్ది చేకూరటం లేదు. బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, ఉర్బాన్ మాత్రమే కనీస వేతనాల అందజేతపై కట్టుబడి ఉన్నామని అధికారికంగా తెలిపాయి. మిగతా కంపెనీలేవీ స్పష్టత ఇవ్వలేదు. కార్మికులు నిరసనగళం వినిపించినా పట్టించుకునే నాథుడే లేడు. తమ గోడు ఎవరికి చెప్పలనేది కూడా కార్మిక సంఘాలకు తెలియని పరిస్థితి. కారణం మూడో పార్టీకి వర్క్ కాంట్రాక్ట్ ఇస్తూ కంపెనీలు తమ సేవల్ని అందజేస్తున్నాయి. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లతో తమకు సంబంధం లేదని ఈ-కామర్స్ కంపెనీలు భావిస్తున్నాయి.
అనేక కంపెనీల స్కోర్ జీరో
తమకు కనీస వేతనాలు దక్కటం లేదని కార్మికులు, ఇతర సిబ్బంది, కార్మిక సంఘాలు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై ఇ-కామర్స్ కంపెనీలు బహిరంగంగంగా స్పందించటం లేదు. 12 ఇ-కామర్స్ కంపెనీలపై 'ఫెయిర్‌వర్క్ ఇండియా' అధ్యయనం చేసింది. కార్మికుల కనీస వేతనాలు..తదితర అంశాలను ఆధారంగా స్కోర్ కేటాయించింది. ఇందులో ఓలా, ఉబర్, డుంజో, ఫార్మాఈజీ, అమెజాన్‌లకు 'జీరో' స్కోర్ వచ్చింది. ఉర్బాన్‌కు 7, బిగ్‌బాస్కెట్‌కు 7, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలకు 5 స్కోర్ దక్కగా, గ్రోసరీ-రెండు, జొమాటో-4, జెప్టొ-2, పోర్టర్-1కు లభించింది. స్థానికంగా ఒక గంటకు కనీస వేతనాన్ని పరిగణలోకి తీసుకొని వేతనాలు చెల్లిస్తున్నామని బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, ఉర్బాన్ ఆధారాలు సమర్పించాయి. న్యాయమైన వేతనాలు ఏమేరకు అందుతున్నాయన్న వివరాలు మాత్రం విడుదల చేయటం లేదు.










