Jan 04,2023 06:49

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం కూలీలకు ఇవ్వాలంటే...ఉపాధి హామీ చట్టానికి ప్రస్తుత కూలీల సంఖ్యకు అనుగుణంగా రూ.ఒక లక్ష 20 వేల కోట్లు కేటాయించాలి. కాని ఈ సంవత్సరం రూ. 73 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గత సంవత్సరం బకాయిలు రూ. 8 వేల కోట్లు వున్నాయి. అంటే కేవలం రూ. 65 వేల కోట్లు. ఈ చట్టం అమలుకు అవసరమైన నిధుల్లో సగం కూడా కేటాయించకుండా తన వర్గబుద్ధిని చాటుకుంది. కష్టజీవులకు చట్టప్రకారం నిధులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన మిత్రులైన కార్పొరేట్‌ కంపెనీలకు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో బ్యాంకు అప్పుల రద్దు, ప్రత్యక్ష, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, వివిధ రాయితీల కింద సుమారు రూ. లక్షన్నర కోట్లు కట్టబెట్టింది.

           దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు స్వాతంత్య్రానంతరం చట్ట ప్రకారం పనికి హామీ కల్పించబడిన ఏకైక చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దీని ద్వారా దేశంలోని సుమారు 50 కోట్ల మందికి పని హక్కు కల్పించాల్సి వున్నప్పటికీ నేటికి 33 కోట్ల మందికి కూడా పని పెట్టలేని స్థితి వుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పేదలకు విస్తరించాల్సి వుండగా క్రమంగా కుదించబడుతున్నది. ముఖ్యంగా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల్లో ఒకటి రెండు సంవత్సరాలు మినహా ఈ పథకానికి నిధులను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీనివల్ల పని దినాలు తగ్గాయి. చేసిన పనికి నెల నుండి మూడు నెలల వరకు బిల్లులు పెండింగ్‌లో వుంటున్నాయి. నిధుల కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు, విన్నపాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అధికార ఆశ తప్ప ఉపాధి కూలీల గోడు పట్టడంలేదు. మతతత్వ రాజకీయాల చాటున కార్పొరేట్‌ అనుకూల విధానాలను వేగంగా అమలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఈ పథకాన్ని మెరుగు చేయడం కాదు, కుదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 5న ఈ పథకాన్ని సమీక్షించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోనున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకాన్ని భారీగా కుదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేదలకు పని అన్నది భిక్ష కాదు, హక్కు అని పాలకులు గుర్తించేటట్లు ఉద్యమించాలి.
 

                                                                                ఉపాధి హామీ చట్టం నేపథ్యం

2005 ఆగస్టు 23న దేశ పార్లమెంట్‌ చారిత్రాత్మకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ లోని అత్యంత వెనుకబడిన, నిత్య కరువుకు గురౌతున్న అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండమీదపల్లిలో నాటి ప్రధాని మన్మోహన్‌ 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఈ చట్టం వచ్చిన రెండు నేపథ్యాలను కావాలనే పాలక పార్టీలు, ప్రధాన మీడియా విస్మరిస్తుంటాయి. అందులో ఒకటి, నాటి ప్రజల జీవన పరిస్థితులు. రెండు, రాజకీయ పరిణామాలు. స్వాతంత్య్రానంతరం పాలకవర్గాలు అమలు చేసిన ఆర్థిక విధానాలు అంతిమంగా ఒకవైపు కొద్దిమంది దగ్గర సంపద పోగుబడడానికి. మరోవైపు పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిపోవడానికి కారణమయ్యాయి. ఈ పరిస్థితుల నుండి పాలకులు బయటపడడానికి ఎద్దులు, బండ్లు, ధోవతి, బియ్యం, సహకార రుణాల లాంటి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఈ పథకాలన్నీ తాత్కాలిక ఉపశమనాలే కావడంవల్ల ప్రజల జీవన విధానాన్ని మార్చలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో 1991లో పి.వి.నరసింహారావు నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేసింది. దీంతో ప్రజలను పెనం నుండి పొయ్యి లోకి తోసినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజల హక్కుగా ఉపాధి హామీ చట్టం రావలసి వచ్చింది.
             రెండవ నేపథ్యం, రాజకీయ పరిణామాలు. ఆర్థిక విధానాల దుష్ఫలితాలు రాజకీయ, సామాజిక రంగాల్లో మార్పులకు దారితీస్తాయి. పాలక పార్టీల్లో ఎవరికి పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యలపై నిత్యం పనిచేసిన వామపక్షాల బలం చట్టసభల్లో గణనీయంగా పెరిగింది. 2004లో వామపక్షాల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపిఎ-1 సంకీర్ణ ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా పరిపాలించాల్సి వచ్చింది. అందులో గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు అనేక కీలకమైన అంశాలు వున్నాయి.
 

                                                                         ఉపాధి చట్టం ఉద్దేశ్యం- అమలు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ముఖ్యంగా రెండు లక్ష్యాలు కీలకమైనవి. ఒకటి గ్రామీణ పేదలకు ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం వంద రోజుల పనిని చట్టం ప్రకారం కల్పించడం, పేదల జీవితాలకు కనీస భద్రతను ఇవ్వడం. రెండు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించడం. ఈ చట్టం మన రాష్ట్రంలో 2021 లెక్కల ప్రకారం 13 జిల్లాల్లో 661 మండలాలు, 13,285 గ్రామ పంచాయితీలు, 47,115 నివాస ప్రాంతాల్లో అమలవుతుంది. 71,39,720 జాబ్‌ కార్డులు వున్నాయి. 5,99,739 స్వయం సహాయక సంఘాల్లో 1,03,55,184 మంది కూలీలు ఈ చట్టం ద్వారా పనికి అర్హులు. ఈ చట్టం ద్వారా మన రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ. 22,82,661.53లతో 38,18,487 పనులు, గ్రామీణ మౌళిక సదుపాయాల కోసం రూ.7,04,847.62లతో 92,9106 పనులు, రూరల్‌ శానిటేషన్‌కు రూ.117754.26లతో 11,21,648 పనులు కల్పించబడ్డాయి. చట్ట ప్రకారం అర్హులందరికి పనులు కల్పించి, అందుకవసరమైన నిధులను కేటాయించి వుంటే గ్రామీణ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు వచ్చి వుండేది. అయితే పాలక పార్టీలకు ఈ చట్టాన్ని అమలు చేయడం ఇష్టంలేదు కాబట్టే చట్టం అమలులోకి వచ్చిన 17 సంవత్సరాల తర్వాత కూడా పనికి అర్హత వున్న వారిలో కేవలం 35 కుటుంబాలకు కూడా వంద రోజుల పని కల్పించబడడంలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం ప్రకారం ఉపాధి హామీ కూలికి రోజుకు రూ. 237 ఇవ్వాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో రూ. 142.27 పైసలు మాత్రమే అందుతుంది.
             కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం కూలీలకు ఇవ్వాలంటే...ఉపాధి హామీ చట్టానికి ప్రస్తుత కూలీల సంఖ్యకు అనుగుణంగా రూ.ఒక లక్ష 20 వేల కోట్లు కేటాయించాలి. కాని ఈ సంవత్సరం రూ. 73 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గత సంవత్సరం బకాయిలు రూ. 8 వేల కోట్లు వున్నాయి. అంటే కేవలం రూ. 65 వేల కోట్లు. ఈ చట్టం అమలుకు అవసరమైన నిధుల్లో సగం కూడా కేటాయించకుండా తన వర్గబుద్ధిని చాటుకుంది. కష్టజీవులకు చట్టప్రకారం నిధులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన మిత్రులైన కార్పొరేట్‌ కంపెనీలకు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో బ్యాంకు అప్పుల రద్దు, ప్రత్యక్ష, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, వివిధ రాయితీల కింద సుమారు రూ. లక్షన్నర కోట్లు కట్టబెట్టింది. బిజెపి అధికారంలోకి రాకముందు 2013-14లో వంద రోజులు పూర్తి చేసిన కార్మికుల సంఖ్య 4,70,000 వుండగా, 2014-15లో 2,50,000, 2015-16 నాటికి 1,70,000 మందికి తగ్గిపోయింది. ప్రస్తుతం 2,10,000 వుంది. సగటు కూలీ పనిదినాల సంఖ్య 2013-14లో 46 రోజులు వుండగా, 2014-15లో 39 రోజులకు తగ్గింది. ప్రస్తుతం 33 రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారు.కేరళలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం మాత్రమే ఉపాధి కూలీలతో పాటు, వ్యవసాయ కూలీలకు రోజు కూలీ రూ.600 అమలు చేస్తున్నది. దేశంలో గ్రామీణ పేదలతో పాటు, పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ. ఈ మధ్యనే రాజస్థాన్‌ ఈ దిశగా చర్యలు తీసుకుంది. వ్యవసాయ రంగంలోకి వచ్చిన ఆధునిక యంత్రాలు గ్రామీణ ప్రజల వ్యవసాయ పనిదినాలను తగ్గించి వేస్తున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం 15 రాష్ట్రాల్లో 57.8 శాతం మంది మహిళలు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఇందులో కేరళ, తమిళనాడు అగ్రభాగన వున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌లో గాని, ఉత్తరప్రదేశ్‌లో గాని తామ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం, 100 రోజుల పని దినాలు, ఎందుకు అమలు కావడంలేదు? పట్టణ పేదలకు పని ఎందుకు కల్పించడంలేదు ?
 

                                                                              పాలక పార్టీల స్వభావం

బయటకు ఎన్ని మాటలు చెప్పినా పాలక వర్గ పార్టీలన్నింటికీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం ఇష్టం లేదు. కారణం తమ వెనుక వున్న పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల ప్రయోజనాలు. పేదలకు పని హక్కుగా వుండకూడదనేది ప్రపంచీకరణ విధానం. శాశ్వత ఉద్యోగాలను తొలగించే విధానాలను అమలు చేస్తున్న పాలక పార్టీలు గ్రామీణ పేదలకు పని హక్కును చిత్తశుద్ధితో అమలు చేస్తారని ఊహించలేము. అంతేకాదు. ఉపాధి హామీ వల్ల వస్తున్న సామాజిక మార్పులు కూడా వీరు అంగీకరించడంలేదు. అందుకే ఈ చట్టం పట్ల ఈ వర్గాలు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. వీరి స్వభావానికి అను గుణంగా ప్రభుత్వాలు ఈ నిధులను ఇతర పనులకు మళ్లించడం, యంత్రాలతో పనులు చేయించడం, అవినీతిని పరోక్షంగా ప్రోత్సహించడం జరుగుతున్నది.చట్ట ప్రకారం పేదలకు ఉన్న పని హక్కును కోల్పోవడం అంటే వారు జీవించే హక్కును కోల్పోవడమే. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న రోజుల్లో గ్రామీణ ప్రజల వినియోగ వ్యయం 8.8 శాతం తగ్గింది. ఆహారంపై చేసే సగటు వ్యయం భారీగా తగ్గిపోయింది. దీని ప్రభావం గర్భణీ స్త్రీలు, పిల్లలపై స్పష్టంగా వుంది. పేదల్లో 68 శాతం మంది గర్భణీ స్త్రీలు రక్తహీనతతో, 42 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కార్మిక చట్టాలను, రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వం వ్యవసాయ కూలీల ఉపాధి హామీ చట్టం ఉసురు తీస్తున్నది. కార్మిక, కర్షకుల ఐక్యత ద్వారానే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించ గలం. అందుకే విశాల ఐక్యత, విశాల ఉద్యమాలే పరిష్కారం.

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు/
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌