Oct 01,2023 12:19

'నేను ఎదుగుతున్న సమయంలో, నన్ను సున్నితమైన మనస్కురాలిగా, చాలా భావోద్వేగపూరితమైన వ్యక్తిగా, ముక్కోపిగా చూసేవారు.' ఆమె తన బిహేవియరల్‌ అండ్‌ డేటా సైంటిస్ట్‌, ప్రొఫెసర్‌ ప్రజ్ఞ అగర్వాల్‌ తన అనుభవాలను చెబుతూ, 'యూనివర్సిటీలో బోధనలు మొదలుపెట్టిన సమయంలో, చాలామంది పురుష సీనియర్‌ సహోద్యోగుల నుంచి నా ప్రవర్తనకు సంబంధించి సూచనలు వచ్చేవి. నేను దృఢంగా ఉండాలని, భావోద్వేగాలను నియంత్రించుకోవాలని, అలాగే కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించాలని చెప్పేవాళ్లు' అని అన్నారు.

photo

భావోద్వేగాల (ఎమోషన్స్‌) నూ లింగ (జెండర్‌) ఆధారంగానే నిర్ధారిస్తారని చిన్న వయసులోనే తనకు అర్థమైందని ఆమె చెప్పారు. ఆమె 'హిస్టీరికల్‌ - ఎక్స్‌ప్లోడింగ్‌ ది మిత్‌ ఆఫ్‌ జెండర్‌డ్‌ ఎమోషన్స్‌' అనే పుస్తకం కూడా రాశారు. లింగ ఆధారంగా మహిళలు, పురుషుల భావోద్వేగాల వ్యక్తీకరణ ఎలా ఉండాలని కోరుకుంటారనే విషయాలను ఆమె ఈ పుస్తకంలో వివరించారు.
          'ఎమోషన్స్‌ను బట్టి మహిళల ప్రవర్తనను నిర్ణయించేస్తారు. వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఆమె చాలా ఎమోషనల్‌ అని అంటారు. వారి భావోద్వేగాలు హేతుబద్ధత, వివేకం అనే వాటితో అణచివేతకు గురవుతాయి. వాటిని పురుషుల గుణాలుగా భావిస్తారు. కానీ, భావజాలం కంటే హేతుబద్ధత గొప్పదనే ఆలోచనను మనం సవాల్‌ చేయాలి' అని ఆమె అన్నారు.
 

                                                                 ఫీలింగ్స్‌ దాచేయాలన్న ఒత్తిడి

పాతకాలపు కళలు, సాహిత్యంలో కొన్ని భావాలు పురుషులకే సొంతం. మరికొన్ని కేవలం ఆడవారిలోనే ఉంటాయనే భావనలు ఉన్నాయి. ఉదాహరణకు, ఈర్ష్య, అసూయ అనేవి మహిళలకు సంబంధించినవిగా, అలాగే ధైర్యం వంటి మంచి భావాలు పురుషులకి సంబంధించినవిగా భావిస్తారు. ప్రస్తుతం పరిస్థితులు కొంతవరకూ మారినా, పూర్తిగా మాత్రం కాదు. ఈ రోజుల్లోనూ పురుషుల్లో ఆవేశం, ఆధిపత్యాన్ని ప్రదర్శించే, ప్రోత్సహించే భావనలు ఉన్నాయి.. అలాగే మహిళలు సానుభూతి, సంరక్షణ కలిగి ఉండాలని చెబుతుంటారని ఢిల్లీకి చెందిన సైకియాట్రిస్ట్‌ శివాని మిస్రి సాధు చెప్పారు.
           'ఈ భావన పురుషుల్లో సున్నితమైన భావాలను దాచేలా ఒత్తిడి చేస్తుంది. అలాగే మహిళల్లో వారి ధైర్యాన్ని మరుగున పడేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ బాధ, భయాన్ని బయటికి చెప్పుకునేందుకు పురుషులు ఇష్టపడరు. మహిళలు తమ కోపాన్ని ప్రదర్శించలేరు. ఎందుకంటే మహిళలు సంరక్షణ, పోషణ వంటి తమ బాధ్యతలకు అది సంబంధం లేనిదని భావిస్తారు' అని ఆమె చెప్పారు.
మహిళలు తమ భావాలను వ్యక్తపరిస్తే, ఆమెను చాలా సున్నిత మనస్కురాలిగా, లేదంటే బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా, అదీకాకపోతే చాలా ఆవేశపరురాలిగా భావిస్తారు.
            'ఇలాంటి మాటలు మహిళలకు సానుకూలమైనవి కావు. అవి మహిళల న్యాయమైన భావాలను కూడా తప్పుగా భావించేలా చేస్తాయి. అందుకే మహిళలు తమ భావాలను అణచివేసుకుంటారు. అందువల్ల వాటిని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారు' అని ప్రొఫెసర్‌ ప్రజ్ఞ చెప్పారు.
అలాగే, మహిళల్లో, పురుషుల్లో కోపాన్ని కూడా వేర్వేరుగా చూస్తారు. పురుషలకి కోపం వస్తే దానిని సాధారణంగా భావిస్తారు. అదే మహిళలు కోప్పడితే ఆమె వ్యక్తిత్వ సమస్యగా చూస్తారు.
          పని ప్రదేశాల్లో కోపం ప్రదర్శించే పురుషుల కంటే, కోపగించుకునే మహిళలకు తక్కువ వేతనం లభిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
'మహిళలు, పురుషుల గురించి మాట్లాడుతున్నాం. కానీ కొంతమంది ఈ రెండు గ్రూపుల్లోని వారు. ట్రాన్స్‌జెండర్లు, లేదా లింగ నిర్ధారణ కాని వ్యక్తులపై పెద్దగా పరిశోధనలు జరగలేదు. కానీ, తమపై లింగ ఆధారంగా స్పందించాల్సిన ఒత్తిడి ఉంటోందని కొంతమంది ట్రాన్స్‌మెన్‌ (పురుషులుగా మారిన వారు), ట్రాన్స్‌వుమెన్‌ (మహిళలుగా మారిన వారు) చెప్పారు' అని ప్రజ్ఞ తెలిపారు.
 

                                                                           విశ్వాసాల ప్రభావం..

శతాబ్దాల కిందట సృష్టించిన సామాజిక, సాంస్కృతిక అంశాలపై మన భావాలు ఆధారపడి ఉంటున్నాయి. ఆ ఆలోచనలను చిన్నప్పటి నుంచే విశ్వసించడం మొదలవుతుంది.
          తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు, అబ్బాయిలను వేర్వేరుగా చూస్తారని, అందువల్ల అలాంటి భావాలు మన మెదడులో అలా ఉండిపోతున్నాయని అధ్యయనంలో తేలింది.
          చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఏంటి అమ్మాయిలా ఏడుస్తున్నావు? కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు అమ్మాయిలను నిశ్శబ్దంగా ఉండమనడం, ఎక్కువ మాట్లాడొద్దని అమ్మాయిలకు చెప్పడం, మృదువుగా మాట్లాడాలనడం, గట్టిగా నవ్వొద్దనడం వంటివి వింటుంటాం.
ఈ భావ విభజన లింగానికి సంబంధించనదని, సంప్రదాయకంగా లింగ ఆధారంగా విభజన జరిగిందని సైకాలజిస్ట్‌ శివాని సాధు అన్నారు.

       'ప్రాచీన సమాజాల్లో మానవ మనుగడ కోసం లింగ ఆధారంగా విభజన జరిగింది. పురుషులు ఆహారం కోసం వేటాడడంతో పాటు వారి సమూహానికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అందువల్ల ధైర్యం, బలం పురుషులకి అవసరం. మహిళలు కుటుంబ సంరక్షణ చూసుకోవడం వల్ల వారికి సానుభూతి, సున్నితత్వం అవసరమని భావించారు' అని ఆమె చెప్పారు.
          అవి రానురాను మతపరమైన, సామాజిక విశ్వాసాలుగా రూపాంతరం చెందాయి. పారిశ్రామిక విప్లవ కాలం వచ్చేనాటికి పురుషులు ఫ్యాక్టరీలకు వెళ్లడం ప్రారంభమైంది. అప్పుడు పురుషులు మానసికంగా దృఢంగా ఉంటారని, మహిళలు ఇంటిని చక్కబెట్టుకునే లక్షణాలు కలిగి ఉండాలని ఆశించారు. అది కాలక్రమేణా పాతుకుపోయింది.
      ఇక్కడ విచిత్రమేంటంటే, మహిళలపై ముందుగానే కొన్ని నిర్దిష్టమైన భావోద్వేగాలు విధించి ఉంటాయి. అలాంటప్పుడు మహిళలు వారి భావోద్వేగాలను వ్యక్తం చేస్తే, వారి ప్రవర్తనపై తీర్పులు చెప్పేస్తారు.
       ఇదొక్కటే కాదు, ప్రస్తుతం మహిళలు పని ప్రదేశాల్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వారు పురుష లక్షణాలైన అధికారం, దృఢత్వంతో పాటు మహిళల గుణాలైన వినయం, ఒదిగి ఉండడాన్ని కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఈ తరహా ఆలోచనా విధానం మహిళలకు ఇబ్బందికరంగా మారుతోందని ప్రొఫెసర్‌ ప్రజ్ఞ చెప్పారు. ఉదాహరణకు, 'రాజకీయాల్లో మహిళలను వారి భావోద్వేగాలను బట్టి అంచనా వేస్తారు. హిల్లరీ క్లింటన్‌ బాగా మాట్లాడతారు. అలాగే, ఆమె తరచూ కోప్పడుతుంటారనే భావన కూడా ఉంది' అని ఆమె చెప్పారు.
          ఆమె తక్కువగా నవ్వుతుంటారని స్త్రీ, పురుష ఓటర్లు భావిస్తున్నారని కూడా ఒక సర్వేలో వెల్లడైంది. ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తగినంత మద్దతు పొందలేకపోయారు.
 

                                                                       మారుతున్న పరిస్థితులు..

లింగ ప్రాతిపదికన భావోద్వేగాలను విభజించడంలో, ఈ ఆలోచన మరింత లోతుగా పాతుకుపోవడంలో మీడియా, టీవీ, సీరియల్స్‌, సినిమాల పాత్ర కూడా పెద్దదే.
         చాలా సందర్భాల్లో మీడియా స్త్రీ, పురుషుల భావోద్వేగాలను ఇలాంటి మూస ఆలోచనలకు అనుగుణంగా చూపిస్తుంది. సినిమాలు, సీరియల్స్‌లో మగవారు బలవంతులుగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. అలాగే, మహిళలు చాలా సున్నితంగా, భావోద్వేగపూరితంగా కనిపిస్తారు.
అయితే, ఈ ధోరణిలో ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి. 'ఆ దిశగా మీడియా కొంత సానుకూల ధోరణిని అవలంబిస్తోంది. సంప్రదాయంగా వస్తున్న విశ్వాసాలు ఇప్పడిప్పుడే విచ్ఛిన్నమవుతున్నాయి. కొన్ని పురుష పాత్రలు కూడా కొంత సున్నితంగా, భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహిళలు కూడా ఇప్పుడు ధైర్యం ఉన్న పాత్రలు, శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇది ప్రేక్షకుల మూస ఆలోచనలను మార్చేందుకు సాయపడుతుంది' అని సైకాలజిస్ట్‌ శివాని సాధు చెప్పారు.
కొత్త పరిస్థితులకు అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకుంటాం. కానీ, కొంతమందిలో ఈ మార్పు చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది.
ఎవరైనా తమ భావోద్వేగాలను వ్యక్తీకరించలేకపోతే అది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపించొచ్చు. వారు ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి, నిరాశకు గురయ్యే అవకాశముంది.
ఎవరు ఏమనుకుంటారోననే ఆందోళన లేకుండా తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉండడమే ఆదర్శవంతమైన పరిస్థితి అని ప్రొఫెసర్‌ ప్రజ్ఞ చెప్పారు.
అలా జరిగితే తమ బాధ, దుఃఖం, భయం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఎవరూ వెనకాడరని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు దు:ఖం, భయం వంటి వాటిని వ్యక్తం చేసేందుకు ఎవరూ సిగ్గుపడరని అంటున్నారు.
అప్పుడు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించే వాతావరణం ఏర్పడుతుంది.
'మన భావోద్వేగాలను వ్యక్తపరచడమే మనల్ని మనుషులుగా చేస్తుందని గుర్తుంచుకోవాలి' అని ప్రొఫెసర్‌ ప్రజ్ఞ చెప్పారు.