Oct 06,2023 07:04

              విమర్శనాత్మక జర్నలిజాన్ని ఏమాత్రం సహించలేని బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం, ఆన్‌లైన్‌ వార్తా వెబ్‌సైట్‌ 'న్యూస్‌ క్లిక్‌'పై తీవ్రమైన ప్రతీకార దాడులకు దిగింది, దారుణమైన వేధింపులకు గురి చేసింది. అయినా ఇప్పటి వరకు, 'న్యూస్‌ క్లిక్‌'పై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించలేదు. వెబ్‌సైట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థను, మరొకరిని ఘోరమైన 'ఉపా' (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-యుఎపిఎ), ఇతర చట్టాల్లోని నిరంకుశ నిబంధనల కింద అరెస్టు చేయడానికి గల కారణమేంటో కూడా చెప్పలేకపోయింది. చైనాతో సంబంధాలు కలిగిన తీవ్రవాద కేసులో ఈ వెబ్‌సైట్‌పై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే చైనా అనుకూల ప్రచారం లేదా తీవ్రవాద సంబంధాలు కలిగినట్లుగా సూచించే ఏ వ్యాసం లేదా సమాచారం ఇంతవరకు వెలుగులోకి రాలేదు. అలాగే తమకు ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని కూడా ఇవ్వలేదని వెబ్‌సైట్‌ యాజమాన్యం చెబుతోంది. తమపై మోపిన నేరాల వివరాలు కూడా తమకు తెలియచేయలేదని పేర్కొన్నారు. ఇంకా, 'న్యూస్‌ క్లిక్‌'తో సంబంధమున్న ఉద్యోగులు, కంట్రిబ్యూటర్ల నివాసాలపైనా దాడులు చేశారు. వారిలో చాలా మంది మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వెబ్‌సైట్‌పై తీసుకున్న ఈ చర్యలేవీ కొత్తవేమీ కాదు. 2021 నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి), ఆదాయ పన్ను శాఖల దాడులను, నిశిత పరిశీలనలను 'న్యూస్‌ క్లిక్‌' ఎదుర్కొంటూనే వుంది. ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంతవరకు చార్జిషీట్‌ ఒక్కటి కూడా దాఖలు చేయలేదు. 'న్యూస్‌ క్లిక్‌'కు అనుకూలంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు కలిగిన కేసులో ఢిల్లీ హైకోర్టు పుర్కాయస్థను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. పైగా 'న్యూస్‌ క్లిక్‌' సంస్థపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ ఇ.డి ని కూడా ఆదేశించింది. ఇదే విషయమై ఆదాయ పన్ను శాఖ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా దిగువ కోర్టు తోసిపుచ్చింది.
           'న్యూయార్క్‌ టైమ్స్‌'లో వచ్చిన ఒక వ్యాసం ఆధారంగా ప్రస్తుత వరుస దాడులు, చర్యలు చేపట్టారు. 'న్యూస్‌ క్లిక్‌'లో ఒక పెట్టుబడిదారుడి చర్యలను, ఉద్దేశ్యాలను ఆ వ్యాసం ప్రశ్నించింది. ఆ వ్యక్తికి చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు వున్నాయని ఆరోపించబడింది. కానీ భారత్‌కు వ్యతిరేకంగా అక్రమ ప్రచారాన్ని చేపట్టేలా ఆ వార్తా వెబ్‌సైట్‌లో ఎలాంటి నిర్దిష్ట వ్యాసాన్ని పేర్కొనలేదు. కేవలం 'న్యూయార్క్‌ టైమ్స్‌' వార్తా కథనం ఆధారంగానే ప్రభుత్వ ప్రతినిధులు ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఒక పద్ధతి ప్రకారం దూషణలకు దిగడం వంటివి చేశారు. మీడియా సంస్థను బలిపశువును చేయడానికి, విమర్శనాత్మక జర్నలిజంపై ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో చర్యలు చేపట్టడానికే మంగళవారం నాటి చర్యలు ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. కేవలం సంస్థకు అందుతున్న నిధులపై అనుమానంతో ఏ ప్రభుత్వమైనా ఇంతలా జర్నలిస్టులను దారుణంగా లక్ష్యం చేసుకోరాదు, చేసుకోలేదు కూడా. తద్వారా రాజ్యాంగంలో హామీ కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా దెబ్బతీయరాదు. నిరంకుశమైన అంతర్గత భద్రతా చట్టం కింద 1975లో ఎమర్జన్సీ సమయంలో మోసపూరితమైన ఆరోపణలపై పుర్కాయస్థను అరెస్టు చేశారు. అప్పుడు ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి నాయకునిగా వున్నారు. ఈనాడు, అటువంటి ఎమర్జెన్సీ ఏదీ ప్రకటించకపోయినా చరిత్ర పునరావృతమైనట్లు కనిపిస్తోంది.
 

/ 'హిందూ' సంపాదకీయం /