Aug 06,2023 16:18

ఒకసారి నక్కకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పిని ఓర్చుకోలేక అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకెళ్ళి తన బాధ చెప్పుకుంది.
'దానికెందుకు కంగారు? మూలికల పొడి ఇస్తాను. దాన్ని నీళ్ళలో కలిపి తాగు. భయపడాల్సిన పనిలేదు. తగ్గిపోతుంది' అంటూ ధైర్యం చెప్పి, పొడి ఇచ్చింది ఎలుగుబంటి.
నక్క దాన్ని ఎలుగుబంటి చెప్పినట్లే చేసింది. క్షణాల్లో నొప్పి తగ్గిపోయింది. నక్క తన స్థాయికి తగ్గట్టు ఫీజు ఇచ్చేసింది.
మరికొద్ది కాలానికి సింహానికి అలాగనే కడుపునొప్పి వచ్చింది. నొప్పితో సింహం మూలగ సాగింది.
అది చూసిన నక్క 'రాజా! భయపడకండి. మన వైద్యులు ఎలుగుబంటి మంచి మందు ఇస్తుంది' అంది.
సింహం ఎలుగుబంటిని పిలిపించింది. ఎలుగుబంటి వచ్చి రకరకాల పరీక్షలు చేసి, ముఖంలో ఆందోళన కనపరుస్తూ 'రాజా! ఇది మామూలు కడుపునొప్పి కాదు. చాలా ప్రమాదకరమైంది. మీరు దీన్ని సకాలంలో గుర్తించ లేకపోయారు. ఇది బాగా ముదిరిపోయింది. అయినా భయపడనవసరం లేదు. మీకు మంచి మందు వాడతాను. తప్పకుండా తగ్గుతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఖర్చూ దానికి తగ్గట్టే వుంటుంది' అంది.
సింహానికి అంత బాధలోనూ తగ్గుతుందన్నందుకు ఆనందం కలిగింది. 'ఖర్చు గురించి ఆలోచించకండి. వైద్యం ప్రారంభించండి' అంది.
ఆ రోజు నుండి ఎలుగుబంటి వైద్యం ప్రారంభించింది. ప్రతిపూటా రకరకాల కషాయాలను తాగించింది. అనేక రకాల మూలికలను వాడింది. రోజులు గడిచేకొద్దీ సింహానికి కడుపునొప్పి తగ్గకపోగా, నీరసం ముంచుకొచ్చింది. వ్యాధి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించలేదు. సింహం నక్కతో 'ఈ వైద్యునివల్ల వ్యాధి నయమయ్యేట్లు లేదు. ఉన్నరోగం తగ్గే సంగతి అటుంచి, నేనే పోయేట్టున్నాను. మరొక వైద్యుణ్ణి చూడు' అంటూ ఆజ్ఞ జారీచేసింది.
తనకు అంత సులువుగా నయం చేసిన ఎలుగుబంటి సింహానికేమిటిలా చేస్తున్నది అనుకుంది. అడవిలో మిగిలిన జంతువులను 'ఇంకెవరైనా మంచి వైద్యులున్నారా..?' అని విచారించింది. పక్క అడవిలో నెమలి వైద్యుని గురించి తెలిసి, పిలిపించింది.
నెమలి సింహాన్ని అన్నివిధాలా పరీక్షించి, ఎలుగుబంటి వైద్యం వివరాలు అడిగి తెలుసుకుంది. 'ఇదేమంత ప్రమాదకరమైనదేమీ కాదు. అన్ని పరీక్షలూ, అన్ని మందులూ అవసరంలేదు. ప్రతి దేహానికి మందులను తట్టుకునే శక్తి కొంతమేరకే వుంటుంది. మందులు అధికంగా వాడితే రోగం తగ్గకపోగా, ప్రాణం మీదకు వస్తుంది. ఎలుగుబంటి వైద్యుల వారికి ఇది తెలియదని నేననుకోను' అంటూ వైద్యం ప్రారంభించింది. ఒకటి రెండు మూలికలతోనే రాజుగారి బాధని తగ్గించింది. సింహం ఆనందంతో నెమలికి తగిన బహుమతులిచ్చింది.
తిరిగి వెళ్ళబోతూ నెమలి నక్కతో ఎలుగుబంటు వైద్యుని కలిసింది. 'మీరు రాజుగారికి చేసిన వైద్యం పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలాగా అనిపించింది నాకు. అంతపాటి వైద్యం అవసరమా?' అంది.
'మీరు సాటి వైద్యులు గనక నిజం చెబుతాను. సామాన్యులు పెద్దగా ధనం ముట్టజెప్పలేరు. అందుకని సరిపెట్టుకుంటాను. రాజుగారికీ అలానే చేస్తే నాకు ఏం మిగులుతుంది? అందుకని కొంత ఘనంగా వైద్యం చేస్తున్నట్లు నటించాను' అంది ఎలుగుబంటి.
'సామాన్యులకు తక్కువలో వైద్యం చేయడం మంచిదే.. కానీ డబ్బుల కోసం రోగి ప్రాణానికి ముప్పు తేవడం వైద్య ధర్మం కాదు కదా..! మీరే ఆలోచించండి. ఒకవేళ రాజుగారికి మీ వైద్యం వల్ల అపకారం జరిగితే.. అది వారి బంధువులు పసిగడితే మీకూ ప్రాణాప్రాయమే గదా! ధర్మబద్ధంగా తీసుకోండి. అంతేగానీ అడ్డదారిలో వైద్యాన్ని వ్యాపారం చేయకూడదు కదా! వైద్యుణ్ణి దేవునితో పోల్చారు మనపెద్దలు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి' అంటూ హితబోధ చేసింది నెమలి.
ఎలుగుబంటికి కనువిప్పు కలిగింది. 'ఇంకెప్పుడూ అలా చేయను. మీరు మా రాజుగారి వ్యాధిని నయం చేశారు. అలానే మంచిమాటలతో నాలో వున్న అక్రమార్జన అనే వ్యాధిని నయం చేశారు. ధన్యవాదాలు' అంది ఎలుగుబంటి.
అప్పటినుంచి బుద్ధిగా వైద్యం చేస్తూ అడవిలో మంచిపేరు తెచ్చుకుంది ఎలుగుబంటి.

డా. గంగిశెట్టిశివకుమార్‌