Nov 22,2022 07:28

నంలో ఉండాల్సిన ఏనుగులు, పులులు జనంలో సంచరించి పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఒడిషా నుండి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చిన ఏనుగులు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పటికి ఎనిమిది మంది రైతులను పొట్టన పెట్టుకున్న ఏనుగులు వ్యవసాయ పంటలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. ఇంత విధ్వంసం జరుగుతున్నా పాలకులు చేష్టలుడిగి ఉండడం దుర్మార్గమే.
        ప్రపంచవ్యాప్తంగా 1950 నాటికి భూభాగంలో 14 శాతం భూమి అరణ్యాలతో నిండి ఉండేది. అడవిలో దొరికే విలువైన కలప, ప్రకృతి సిద్ధమైన గనుల తవ్వకాలకు చేపట్టిన మైనింగ్‌ కార్యక్రమాలు, పారిశ్రామికీకరణకు అటవీ ప్రాంతాన్ని ఎన్నుకోవడం వంటి చర్యల ఫలితంగా అటవీ ప్రాంతం ప్రస్తుతం 14 శాతం నుండి 6 శాతానికి పడిపోయింది. వన్య ప్రాణులు సహజ సిద్ధంగా ఏర్పర్చుకున్న ఆవాసాలు కూడా ధ్వంసమయ్యాయి. దాంతో వన్యప్రాణులు జనావాసాల మీదకు వచ్చి దాడి చేసే పరిస్థితి నెలకొన్నది. మన కేంద్ర ప్రభుత్వం అందించే వివరాల ప్రకారం దేశంలో ప్రతి ఏటా ఏనుగుల దాడుల వలన 1500 మంది, పులుల దాడి చేయడం వలన సుమారు 100 మంది మరణిస్తున్నారు. అంతే కాకుండా వేలాది పశువులు, వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అవ్వడంతో రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నది.
       శాస్త్రీయమైన విధానాలతో ఏనుగులు, పులులు వంటి జంతువులు జనారణ్యంలోకి రాకుండా చర్యలు చేపట్టడంలో మన ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమయ్యాయి. వన్యప్రాణుల దాడుల వలన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, పంటలు, ఆస్తులు నష్టపోయినవారిని ఎలా ఆదుకోవాలి అనే అంశాలపై ఈరోజుకు కూడా స్పష్టమైన విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించలేదు.
          భౌగోళిక స్వరూపం రీత్యా ఒడిషా అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండటం, అక్కడ మైనింగ్‌ కార్యకలాపాలు ఎక్కువ అవ్వటం, ఏనుగులు తినటానికి ఇష్టపడే చెరకు, అరటి, బొప్పాయి వంటి పంటలకు అనువైన ప్రాంతం కావడంతో ఏనుగులు పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో తిష్ట వేశాయి. ఈ ఏనుగుల సంచారం వలన మైదాన ప్రాంతంలో ఉండే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు సంచారంతోనే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పులుల సంచారం ఇంకా ఆందోళన పెంచుతున్నది. గ్రామాల్లో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికైనా అటవీ, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నోడల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి ఏనుగులు, పులులను బంధించేందుకు చర్యలు చేపట్టాలి. జిపిఎస్‌ టెక్నాలజీ ఉపయోగించి వాటి కదలికలను బట్టి నిరంతరం ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాలి.

- బి.వి.రమణ,
పార్వతీపురం మన్యం జిల్లా