Jan 11,2023 07:26

సంవత్సరానికి ఒకసారి ఎపిఇఆర్‌సి దృష్టికి తెచ్చి, బహిరంగ విచారణ అనంతరం ట్రూఅప్‌ ఛార్జీలను అమలు చేసే విధానం ఉండేది. దాన్ని ఇటీవల మూడు నెలలకు ఒకసారి చొప్పున ఆ ప్రక్రియ జరిపి, నిర్ణయించాలనే విధానం తెచ్చారు. ఆచరణలో అది పూర్తి స్థాయిలో అమలులోకి రావలసివుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇకపై నెలనెలా ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. అందుకు పబ్లిక్‌ హియరింగ్‌తో సంబంధం లేకుండా ఒక ఫార్ములా ప్రాతిపదికగా నిర్ణయించాలంటోంది. వినియోగదార్ల నుండి ఆటోమేటిక్‌ పాస్‌ త్రూ పేరిట వసూలు చేయాలని చెప్పింది. విద్యుత్‌ చట్టం (2003) నిబంధనలకు ఇది విరుద్ధం. అలాగే రెగ్యులేటరీ ప్రోసెస్‌ను కూడా తోసి రాజనడమే !

ప్రతి ఏడాది మాదిరిగానే రాష్ట్రంలోని మూడు డిస్కాములు తమ వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఎఆర్‌ఆర్‌)లు ఎపిఇఆర్‌సి కి సమర్పించాయి. వాటిపై సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చునంటూ ఎపిఇఆర్‌సి నాలుగు దిన పత్రికల్లో ఇచ్చిన వాణిజ్య ప్రకటనకు స్పందనగా 30కి పైగా సంస్థలు, నిపుణులు, వ్యక్తులు, పార్టీల ప్రతినిధులూ అభ్యంతరాలు సమర్పించారు. జనవరి 19 నుండి 21 వరకు ఎపిఇఆర్‌సి ఆన్‌లైన్‌లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించనుంది. అన్ని అంశాలనూ పరిశీలించాక వచ్చే ఏడాది చార్జీల నిర్ణయాన్ని ఎపిఇఆర్‌సి మార్చి 31 లోగా టారిఫ్‌ ఆర్డర్‌ పేరిట ప్రకటిస్తుంది. ఎఆర్‌ఆర్‌లలోని కొన్ని అంశాలు, వాటి పర్యవసానాలూ చర్చిద్దాం.
 

                                                            భారీ లోటు పూడ్చేదెలా....!

డిస్కాములు మూడూ కలిపి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.52,590 కోట్లు తమ వార్షిక అవసరమని, చార్జీల పెంపు ద్వారా రూ. 697 కోట్లు సమకూర్చుకోగా 12,792 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే ఫెర్రో ఎల్లార్సు ఇతర విద్యుత్‌ అధికంగా వాడే పరిశ్రమల చార్జీలను రూ.697 కోట్ల రూపాయలు ఈ ఏడాది పెంచుతామని పేర్కొన్న డిస్కాములు మిగిలిన ఏ రంగం వినియోగదారుల మీదా అదనపు భారాలను ప్రతిపాదించలేదు కాని అంత భారీ లోటును ఏ విధంగా పూడ్చుకుంటాయో స్పష్టతనివ్వలేదు. జీవో 161 సాకుతో అంత భారీలోటు పూడ్చడంపై డిస్కాములు మౌనం వహించడం పారదర్శకతకు తీరని ముప్పు. లోటు ఎలా భర్తీ చేస్తారనే స్పష్టత లేకపోవడం వలన భవిష్యత్తులో భారాలు మోపుతారనే అనుమానం కలుగుతున్నది. అంతేగాక ప్రభుత్వం హడావిడిగా ముందుకు తెస్తున్న స్మార్ట్‌ మీటర్లవల్ల వేల కోట్ల రూపాయల భారం వినియోగదార్లపై పడుతుంది కనుక టారిఫ్‌ పెంపుదలను ప్రతిపాదించలేదని కొందరు చెబుతున్న మాట సత్యదూరం కాకపోవచ్చు.
 

                                                            అసంబద్ధ ప్రతిపాదనలు

మూడు డిస్కాముల వార్షిక విద్యుత్‌ వినియోగం 2022-23లో 72,040 ఎం.యు. యూనిట్లు కాగా అది 2023-24లో 76,774 ఎం.యు. కి పెరుగుతుందని చూపారు. కానీ ఫిక్స్‌డ్‌ చార్జీల ఖర్చు గతంలో రూ.7,938 కోట్లు ఉండగా వచ్చే ఏడాది రూ.11,218 కోట్లకు పెరుగుతుందని పేర్కొన్నారు. పరిమాణంలో 6.57 శాతం విద్యుత్‌ పెరుగుదలకు 41.32 శాతం ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుదలను డిస్కాములు పేర్కొనడం అసంబద్ధం. ఎపిఇఆర్‌సి నిశితంగా పరిశీలించి దానిని తగిన విధంగా పునర్నిర్ణయించడం అవసరం. సౌర, పవన, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరుల నుండి విద్యుత్‌ కొనుగోలు వల్ల తీవ్ర ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అలాగే అధిక ధరలకు పవర్‌ ఎక్స్చేంజి నుండి డిస్కాములు విద్యుత్తును కొంటున్నాయి. గతంలో ఎపిఇఆర్‌సి గరిష్ట ధరను నిర్ణయించినా దానిని కూడా అప్పుడప్పుడు డిస్కాములు ఉల్లంఘిస్తున్నాయి. ఇటువంటి ఉల్లంఘనల పట్ల ఇఆర్‌సి కఠినంగా వ్యవహరించాలి. వాటిని కట్టడి చేసేలా నిబంధనలు రూపొందించడం అవసరం.
 

                                                       విద్యుత్‌ అవసరాలు- మిగులు !

విద్యుత్‌ అవసరాలను గరిష్టంగా రాష్ట్ర ఎపి జెన్కో నుండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ జనరేటింగ్‌ స్టేషన్స్‌ నుండి కొనుగోలు చేయడం విజ్ఞతగా ఉంటుంది. కాని, పిపిఎ ల గడువు ముగిసిన కేంద్ర జనరేటింగ్‌ స్టేషన్ల నుండి కొనుగోలు ఆపేయాలని గత ఏడాది ఎపిఇఆర్‌సి ఆదేశించింది. సాంకేతికంగా ఇది బాగా అనిపించినా, ప్రైవేటు విద్యుత్‌తో పోల్చితే చౌకగానే లభించే అవకాశముంది. కాబట్టి గతం నుండి మన డిస్కాములు కొనుగోలు చేస్తున్న కుడిగి, వల్లూరు అలాగే నైవేలి లిగ్నైట్‌ రెండు యూనిట్లు ఈ నాలుగు స్టేషన్ల నుండి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతించడం అవసరం. ఆ దిశగా ఇఆర్‌సి పునరాలోచించాలి.
           రానున్న ఏడాది (2023-24) 89,243 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులో ఉంటుందని 76,774 మిలియన్‌ యూనిట్లు వినియోగించగా 12,469 మిలియన్‌ యూనిట్లు మిగులు తేలుతుందని డిస్కాములు పేర్కొన్నాయి. దాదాపు 16 శాతం మిగులు విద్యుత్తు తలకు మించిన భారమే. ఇంత మిగులు ఉండగా పవర్‌ ఎక్స్చేంజిలో అధిక రేటుకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో సర్కారుకే ఎరుక! ఏది ఏమైనా అవాంఛిత కొనుగోళ్లను నియంత్రించడం అవసరం. అలాగే మిగులు విద్యుదుత్పత్తిని ఐదు శాతానికి మించి అనుమతించడం నష్టదాయకం. ఈ నేపథ్యంలోనైనా అదానీ కంపెనీ ఉత్పత్తి చేసే సౌర విద్యుత్తును సెకి ద్వారా కొనుగోలు చేయాలన్న ప్రయత్నం ప్రభుత్వం విరమించుకోవడం మంచిది.
 

                                             హిందూజాకు రూ.1200 కోట్లు కట్టబెడతారా !

విశాఖపట్నం జిల్లాలోని 1040 మెగావాట్ల హిందూజా పవర్‌ ప్లాంట్‌ నుండి విద్యుత్‌ కొనుగోలు విషయంలో సుదీర్ఘ కాలంపాటు వివాదం కొనసాగింది. ఎపిఇఆర్‌సి, కేంద్ర అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌, సుప్రీం కోర్టులో సైతం నడిచింది. చివరికి యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.82 చొప్పున చెల్లించాలని 1.8.2022న ఎపిఇఆర్‌సి తీర్పునిచ్చింది. దానిపైనా హిందూజా అపీల్‌ చేయడంతో ప్రస్తుతం వాయిదాలు నడుస్తున్నాయి. ఎపిఇఆర్‌సి ఉత్తర్వుల ప్రకారమే డిస్కాములు హిందూజాకు రూ.3.82 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నాయి. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాలెన్స్‌ పేమెంట్‌ పేరిట డిస్కాముల నుండి 1200 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చడానికి యత్నించడం దారుణం. ఈ మేరకు న్యాయ సలహా పేరిట ఎపి పవర్‌ కో-ఆర్డినేషన్‌ కంపెనీకి సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎపిఇఆర్‌సి గతంలోనే ఈ బ్యాలెన్స్‌ పేమెంట్‌ వంటివి కుదరదని చెప్పింది. దానిపై అపీల్‌ కూడా పెండింగ్‌ లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇఆర్‌సి పరిధిలోకి చొరబడడమే అవుతుంది. కనుక వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడం, ఎపిఈఆర్‌సి పరిధిని రక్షించుకోవడం కోసం హిందూజాకు బ్యాలెన్స్‌ పేమెంట్‌ల పేరిట ఒక్క రూపాయి కూడా ఇవ్వడాన్ని అనుమతించరాదు. అలా ఇవ్వడం ప్రజాధనాన్ని ఆ కంపెనీకి కట్టబెట్టడమే అవుతుంది.
 

                                                          స్మార్ట్‌ మీటర్లతో కొత్త భారం

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో బిగించారు. ఆ అనుభవాన్ని అధ్యయనం చేసేందుకు ప్రయాస్‌ ఎనర్జీ గ్రూపునకు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. వారు అధ్యయన నివేదికనిచ్చి కొన్ని నెలలు గడచినా ఆ వివరాలను సర్కారు వెల్లడించలేదు. వారి సిఫార్సుల అమలుకు డిస్కాములు ఏమి చేశాయి అన్నది ఇప్పుడైనా తెలియజేయాలి. ప్రభుత్వం అందుకు సిద్ధం కాకపోతే ఇఆర్‌సి ఆదేశించాలి.
            శ్రీకాకుళం అనుభవం ఏమిటో నిర్ధారించకుండానే యావత్‌ రాష్ట్రంలోనూ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం చెప్పింది. తాజాగా 200 యూనిట్లు పైన వినియోగించే అన్ని కనెక్షన్‌లకు స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి మీడియా ద్వారా తెలియజేశారు. అందుకయ్యే ఖర్చు వ్యవసాయం తప్ప మిగతా రంగాల వినియోగదారుల నుండే వసూలు చేస్తామని చెప్పారు. వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే ఇటువంటి అంశాలను ఎపిఇఆర్‌సి దష్టికి తెచ్చి, అందుపై బహిరంగ విచారణ జరిపిన తరువాత అటువంటి ఏర్పాట్లు చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్లడం తగదు.
            వినియోగదార్లు ఇప్పటికే అధునాతనమైన ఐఆర్‌డిఎ మీటర్లకు డబ్బు చెల్లించి ఏర్పాటు చేసుకున్నారు (డిస్కాముల ద్వారానే). అలాంటిదీ వాటిని తొలగించి, స్మార్ట్‌ ప్రి పెయిడ్‌ మీటర్లు వేల రూపాయలు పోసి కొనుక్కోవలసిన అవసరం సాధారణ గృహ వినియోగదారులకేముంది? సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా! కేవలం స్మార్ట్‌ మీటర్ల తయారీ పరిశ్రమలకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ఇటు వినియోగదారుల సొమ్ము కానీ అటు సర్కారు ఖజానా నుండి కానీ ఎందుకు చెల్లించాలి ?
 

                                                      ఇకపై నెల నెలా ట్రూ అప్‌..!

సంవత్సరానికి ఒకసారి ఎపిఇఆర్‌సి దృష్టికి తెచ్చి, బహిరంగ విచారణ అనంతరం ట్రూఅప్‌ ఛార్జీలను అమలు చేసే విధానం ఉండేది. దాన్ని ఇటీవల మూడు నెలలకు ఒకసారి చొప్పున ఆ ప్రక్రియ జరిపి, నిర్ణయించాలనే విధానం తెచ్చారు. ఆచరణలో అది పూర్తి స్థాయిలో అమలులోకి రావలసివుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇకపై నెలనెలా ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. అందుకు పబ్లిక్‌ హియరింగ్‌తో సంబంధం లేకుండా ఒక ఫార్ములా ప్రాతిపదికగా నిర్ణయించాలంటోంది. వినియోగదార్ల నుండి ఆటోమేటిక్‌ పాస్‌ త్రూ పేరిట వసూలు చేయాలని చెప్పింది. విద్యుత్‌ చట్టం (2003) నిబంధనలకు ఇది విరుద్ధం. అలాగే రెగ్యులేటరీ ప్రోసెస్‌ను కూడా తోసి రాజనడమే! మొత్తంగా ట్రూఅప్‌ విధానాన్నే రద్దు చేయాలి.
 

                                                                భారాల పరంపర !

గత కొద్ది సంవత్సరాలుగా టారిఫ్‌ పెంపు, శ్లాబుల మార్పిడి, ఫిక్స్‌డ్‌ చార్జీలు, అదనపు డిపాజిట్లు తదితర రూపాలలో వినియోగదారులపై భారాలు మోపారు. గృహ వినియోగదార్లకు 50 యూనిట్ల వరకు కనీస శ్లాబును పునరుద్ధరించడం అవసరం. నివాసాలకు ఫిక్స్‌డ్‌ చార్జీలు రద్దు చేయాలి. ఎస్సీ, ఎస్టీ తరగతులకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్తుకు రకరకాల పేర్లతో కోతలు పెట్టారు. నివాస ప్రాంతంతో నిమిత్తం లేకుండా అర్హత ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్‌ కొనసాగించే చర్యలు చేపట్టాలి. చేనేత, క్షౌర వంటి వృత్తిదార్ల కుటుంబాలకూ రాయితీ సమస్యగా మారుతోంది. మరోవైపు కృష్ణపట్నం జెన్‌కో ప్లాంటు ప్రైవేటీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మీటర్‌ రీడర్ల పొట్టకొట్టాలని చూస్తోంది. ఇటువంటి ఎన్నో భారాలు, వివిధ తరగతులకు ఇబ్బందులూ పెరుగుతున్నాయి. పబ్లిక్‌ హియరింగ్‌, ఆ తరువాత వచ్చే టారిఫ్‌ ఆర్డర్‌ ఏం చెబుతుందో !

బి తులసీదాస్‌

బి తులసీదాస్‌