పరిశ్రమలు తమ ఉత్పత్తి ఒప్పందాలను ముందస్తుగా చేసుకుంటాయి. కానీ ఇలా ప్రతి నెలా ఏదోక పేరుతో విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఈ భారాన్ని పరిశ్రమలు భరించాల్సి వస్తుంది. 5 నుండి 10 శాతం లోపుగా లాభాలు వచ్చే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కావడంవల్ల ఈ పరిశ్రమలకు ఆర్డర్లు కూడా తగ్గిపోతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దివాళా తీయడం, లేదా మూసివేయడం పెరుగుతుంది. ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది.
రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చిన్న పరిశ్రమలు ఈ దశాబ్దంలో ఎన్నడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయాయి. అందుకు ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర బిజెపి అనుసరిస్తున్న కార్పొరేట్ ఆధిపత్య అనుకూల విధానాలు, రెండు పెరిగిన ముడిపదార్థాల ధరలు, మూడు కరోనా మహమ్మారి. వీటికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ చార్జీలు, విద్యుత్ సుంకాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు-2020 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, వ్యవసాయదారులకు శాపంగా ఉంది. ఈ వినాశకర విధానాన్ని దేశంలో అందరికంటే ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వ్యవసాయం అడుగంటిపోతున్నది. రైతులు పంటలు సాగు చేయడానికి తీవ్ర విముఖత చూపుతున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల సాగుభూమి బీడుగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ నత్తతో పోటీ పడుతున్నాయి. చేనేత, బీడీ లాంటి కుటీర పరిశ్రమలు విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల పోటీకి తట్టుకోలేక క్షీణించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరించి యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలే వీటి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే విధానాలను అమలుచేస్తున్నాయి.
పరిశ్రమలపై విద్యుత్ భారం
ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత బిల్లు మరుసటి నెలలో చెల్లించడం ఇప్పటివరకు అమలవుతున్న విధానం. కానీ వైసిపి ప్రభుత్వం గత దశాబ్దం కింద వాడిన కరెంటుకు చెల్లించిన బిల్లుకు వ్యత్యాసం వచ్చిందని ఇప్పుడు చెల్లించమంటోంది. దీనికి 'ట్రూ అప్ చార్జీ' అని ముద్దు పేరు పెట్టారు. విద్యుత్ తయారీకి వాడిన ఇంధనం ధరలు మారుతుంటాయని 'ఇంధన సర్దుబాటు చార్జీ' వంటి రకరకాల చార్జీలు వినియోగదారులపై వేస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల మీద గత సంవత్సరంతో పోలిస్తే 72 శాతం ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు ఈ సంవత్సరంలో పెరిగాయి. లెవీ యూనిట్‌కు 85 పైసలు, విద్యుత్ సుంకం యూనిట్‌కు ఆరు పైసల నుండి ఏకంగా ఒక్క రూపాయికి పెంచారు. వీటివల్ల ఏడు రూపాయల అరవై పైసలు వున్న యూనిట్ చార్జీ 9 రూపాయలకు పెరిగింది. 2019కి ముందు యూనిట్ రూ.4.95 వుండేది. పెరిగిన విద్యుత్ చార్జీల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రతి నెలా సుమారుగా రూ. 4.18 లక్షల అదనపు భారం పడుతుంది. ఇంత మొత్తాన్ని ఈ పరిశ్రమలు భరించే స్థితిలో లేవు. ఇప్పటికే 20 శాతం పరిశ్రమలు మూతపడినట్లు ముఖ్యంగా ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయంలో 60 శాతం వరకు విద్యుత్తే ముడిసరుకుగా ఉంటుంది. అందవల్ల ఈ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతకు సిద్ధమయ్యాయి. ఇంజినీరింగ్, స్పిన్నింగ్ మిల్లుల్లో ఉత్పత్తి వ్యయంలో 20 నుండి 40 శాతం విద్యుత్ వాడకం జరుగుతుంది. ఇలాంటి అనేక పరిశ్రమలు విద్యుత్ భారాలను భరించలేక దివాళా అంచులకు చేరాయి.
పరిశ్రమలు తమ ఉత్పత్తి ఒప్పందాలను ముందస్తుగా చేసుకుంటాయి. కానీ ఇలా ప్రతి నెలా ఏదోక పేరుతో విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఈ భారాన్ని పరిశ్రమలు భరించాల్సి వస్తుంది. 5 నుండి 10 శాతం లోపుగా లాభాలు వచ్చే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కావడంవల్ల ఈ పరిశ్రమలకు ఆర్డర్లు కూడా తగ్గిపోతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దివాళా తీయడం, లేదా మూసివేయడం పెరుగుతుంది. ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఉన్న నిరుద్యోగానికి వీరు అదనపు నిరుద్యోగులుగా చేరుతున్నారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యత
దేశంలో 6.33 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) లు ఉన్నాయి. ఇందులో 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. దేశ జాతీయోత్పత్తిలో వీటి వాటా 30 శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో 45 శాతం, విదేశీ ఎగుమతుల్లో ఈ పరిశ్రమల ఉత్పత్తులు 48 శాతంగా ఉన్నాయి. రాష్ట్రంలో 55,761 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు 13,360.15 కోట్ల పెట్టుబడులతో 2,27,027 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో వీటి పాత్ర గణనీయంగా ఉన్నది. 2023-24 నాటికి 1,50,000 ఎంఎస్‌ఎంఈ లు ఏర్పాటు చేసి 7,50,000 మందికి ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి 2023 జులైలో ప్రకటించారు. ఇంతటి లక్ష్యం నిజంగా నెరవేరలంటే ఈ పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కాని ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను 1,25,000లకు పెంచాలని సుమారు ఐదు సంవత్సరాల క్రితం లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికీ ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు కేవలం 55,761 మాత్రమేనని 2023-24 ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే నివేదికలో ప్రభుత్వమే ప్రకటించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో పాలకులు ఆలోచించడంలేదు. తాము అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, పెంచుతున్న విద్యుత్ చార్జీలు, విద్యుత్ సుంకాలు చిన్న పరిశ్రమల ఉనికిని దెబ్బతీస్తున్న విషయాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.
2019-20 నాటికి రాష్ట్రంలో రూ. 54,236.53 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి చేస్తున్న 109 భారీ పరిశ్రమల్లో 71,856 మంది మాత్రమే ఉపాధి పొందుతుండగా, రూ. 13,360.15 కోట్ల పెట్టుబడితో నడుస్తున్న 55,761 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో 2లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమలు దివాళా తీస్తే యువతకు ఉపాధి తీవ్ర సమస్యగా మారుతుంది. వైజాగ్-చెన్నై ఇండిస్టియల్ కారిడార్, బెంగళూరు-చెన్నై ఇండిస్టియల్ కారిడార్, హైదరాబాద్ -బెంగళూరు ఇండిస్టియల్ కారిడార్ల పేర్లతో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యువతకు ఎండమావులను చూపుతున్నాయి. ఈ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు 'వైఎస్సార్ ఎ.పి ఒన్', 'వైఎస్సార్ నవోదయం స్కీమ్', 'వైఎస్సార్ జగనన్న మెగా ఇండిస్టియల్ హబ్ పాలసీ' ఇలా రకరకాల పేర్లు ప్రకటించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టాలంటే అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కానీ వైసిపి ప్రభుత్వం గతంలో ఎంఎస్‌ఎంఈ లకు ప్రకటించిన ప్రోత్సాహకాలే అమలు చేయడంలేదని ఈ సంస్థల ఛాంబర్స్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ లెక్కలు ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.200 కోట్లు, సిన్నింగ్ టైక్స్‌టైల్ పరిశ్రమలకు రూ.200 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.1400 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఒకవైపు విద్యుత్ భారాలు, రెండోవైపు ప్రోత్సహకాల బకాయిలు. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు. ఈ ముప్పేట దాడితో ఈ చిన్న పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విధానలకు రాష్ట్రం వత్తాసు
కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్నది. అన్ని రంగాల్లో వాటికి ఎదురులేని గుత్తాధిపత్యాన్ని కల్పించే నిర్ణయాలను అమలు చేస్తున్నది. ఈ కంపెనీలకు గత తొమ్మిది సంవత్సరాల్లో రూ.17.46 లక్షల కోట్ల ను వివిధ రకాల పేర్లతో రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను అతి చౌకగా అప్పగించడం, వాటిని దివాళా తీయించే చర్యలను చేపట్టడం, సహజ వనరులను లూటీ చేసేందుకు వీలుగా చట్టాలను మార్చేయడం జరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తున్నది. వీటిని ప్రతిఘటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదే విధానాలను పార్లమెంట్‌లో బలపరుస్తున్నది. రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమవుతున్నది. గౌతం అదానీ రహస్యంగా ముఖ్యమంత్రిని కలిసాడు. ఓడరేవులు, సముద్ర నిక్షేపాలు, గనులు అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి స్పందించడంలేదు.
విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సు ముగిసి ఏడు నెలలు పూర్తయింది. అక్కడ చేసుకున్న ఒప్పందాల్లో ఇప్పటివరకు ఎన్ని అమలులోకి వచ్చాయో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. 25 దేశాలకు చెందిన 30 పెద్ద కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు వచ్చారని, 378 ఒప్పందాలు జరిగాయని, వీటి విలువ రూ.13.42 లక్షల కోట్లని వీటి వల్ల ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఈ ఒప్పందాల్లో రూ.9,57,112 కోట్ల పెట్టుబడి పునరుత్పాదక శక్తి అంటే సోలార్, గాలి మరల విద్యుత్ ఉత్పత్తి కోసం చేసుకోబడ్డాయి. మన రాష్ట్రంలో ఈ రంగంలోకి పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి. వీటిల్లో అతి తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చౌకగా కరెంట్‌ను ఉత్పత్తి చేసి గృహ వినియోగదారులకు, వ్యవసాయదారులకు, చిన్న పరిశ్రమలకు ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి అన్ని ఏర్పాట్లు ఈ కంపెనీలు చేసుకుంటున్నాయి. ఇందులో భాగమే గృహాలకు స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానాలు వ్యవసాయంతో పాటు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తీవ్ర సంక్షోభాల్లోకి నెడుతాయి. వీటిని ప్రతిఘటించాల్సిన నేటి ప్రధాన ప్రతిపక్షం కేంద్రాన్నే బలపరుస్తున్నది. టిడిపి అధికారంలో ఉన్న 1999లో ప్రపంచబ్యాంకు నుండి 100 కోట్ల డాలర్ల అప్పు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఎంపిఎస్‌ఇబి)ని ముక్కలు చేశారు. ఇప్పటికీ అదే విధానాలను సమర్థించుకుంటున్నారు.
కరోనా మహమ్మారి వల్ల దేశంలో 37 శాతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు శాశ్వతంగా మూతబడ్డాయి. మన రాష్ట్రంలో కూడా వేల పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకోవడమో, శాశ్వతంగా మూతవేయడమో జరిగింది. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటాయి. తద్వారా ఉపాధి సమస్య తీవ్రమవుతుంది. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే విద్యుత్ భారాల నుండి వ్యవసాయాన్ని, చిన్న పరిశ్రమలను రక్షించుకోవాలి.
(రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు) వి. రాంభూపాల్