
ఈ విద్యుత్ బస్సులను ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేయాలి. అందుకు వచ్చే సబ్సిడీ వారికే చెల్లించబడుతుంది. ప్రయివేటు వ్యక్తులే ఆర్.టి.సి ల ద్వారా బస్సులు నడపాలి. అందుకుగాను ఆర్.టి.సి లు వారికి డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్‌పోర్టుకు నడుస్తున్న బస్సులు ఇదే తరహాలో నడుస్తున్నాయి. వీటిపై టి.ఎస్ ఆర్.టి.సి.కి వచ్చే ఆదాయం కంటే ప్రయివేటు వారికి చెల్లించే మొత్తమే ఎక్కువ. దేశం మొత్తంలో విద్యుత్ బస్సుల కథ ఇదే. ఈ విధానం ఆర్.టి.సి.లకు గుదిబండ అయింది.
ఇటీవలి కాలంలో విద్యుత్ బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నది. అందుకుగాను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. పర్యావరణ హితం కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నది. వాస్తవాలను ఒకసారి పరిశీలిద్దాం. భారత దేశంలో విడుదల అవుతున్న కాలుష్యంలో పరిశ్రమల ద్వారా 50 శాతం, వాహనాల ద్వారా 20 నుండి 30 శాతం, ఇతరత్రా కారణాల ద్వారా మిగతా కాలుష్యం విడుదల అవుతున్నది. దేశంలో 2019 మార్చి 31 నాటికి (ఆ తర్వాతి వివరాలు ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు) రిజిస్టర్ అయిన వాహనాలలో ద్విచక్ర వాహనాలు 74 శాతం, కార్లు, జీపులు, టాక్సీలు కలిపి 12.99 శాతం. బస్సులు 0.69 శాతం. అంటే విడుదల అవుతున్న కాలుష్యంలో బస్సుల వాటా నామమాత్రం. 2019 నాటికి దేశం మొత్తంలో 10 లక్షల 47 వేల బస్సులుండగా అందులో ఆర్.టి.సి బస్సులు కేవలం 1,35,847. ఆర్.టి.సి. బస్సులు అతి తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. కేవలం 0.69 శాతంగా ఉన్న బస్సుల కాలుష్యం గురించి అంత హడావుడి ఎందుకు?
వాహన కాలుష్యంలో సింహ భాగం ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు తదితరాల నుండి విడుదల అవుతున్నది. దీన్ని నియంత్రించడం సమస్యకు సరైన పరిష్కారం. ఇది జరగాలంటే ప్రజా రవాణాను గణనీయంగా పెంచి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం అత్యంత ఆవశ్యకం. కానీ ఆ దిశగా చేపడుతున్న చర్యలేవి ?
ప్రపంచంలోని అత్యధిక దేశాలు వ్యక్తిగత వాహనాల వినియోగం (రోజువారీ అవసరాల కోసం) నియంత్రించి ప్రజా రవాణాను విస్తృతపరచి వినియోగించుకునేలా చట్టబద్ధంగా పలు చర్యలు చేబడుతు న్నాయి. లక్సమ్‌బర్గ్ దేశంలో ప్రజా రవాణా అందరికి పూర్తిగా ఉచితం. అమెరికాలో సైతం కొన్ని రాష్ట్రాలు, నగరాలలో ప్రజా రవాణా ఉచితం/ అతి తక్కువ. ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో కూడా బస్సుల చార్జీలు నిర్వహణ ఖర్చులో 30-40 శాతానికి మించి వసూలు చేయరు. నిర్వహణ ఖర్చులో అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వివిధ రూపాలలో సర్దుబాటు చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడా ప్రజా రవాణాను లాభనష్టాల స్కేలుతో కొలవరు. కాలుష్య నివారణ గురించి మాట్లాడే ముందు ప్రజా రవాణాను విస్తృతపరచి, అందుబాటు ధరలతో అందరూ రోజువారీ అవసరాల కోసం వినియోగించుకునేలా చేయడం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి.
ప్రపంచంలో అన్ని దేశాలలో లక్ష జనాభాకు 60 బస్సులున్నాయి. చైనాలో ప్రతి 1000 మందికి 6 బస్సులు ఉంటే భారత దేశంలో ప్రతి 10,000 మందికి కేవలం 4 బస్సులు మాత్రమే ఉన్నాయని, దేశంలో 90 శాతం మందికి సొంత వాహనాలు లేవని స్వయంగా రవాణా శాఖామాత్యులు నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రజా రవాణా దేశంలో ఎంతగా విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రిగారి ప్రకటనే తెలియజేస్తున్నది. ఇక విద్యుత్ బస్సుల విషయానికి వస్తే వాటి ఖరీదు సుమారు రూ. 2 కోట్లు. అదే డీజిల్ ఇంజన్ లగ్సరీ బస్సు రూ. 40 లక్షలు. ఆర్డినరీ బస్సు అయితే రూ. 25 లక్షలు. ప్రస్తుతం భారత దేశానికి కావలసింది ప్రజల అవసరాలకు తగిన విధంగా బస్సులను పెంచడం. ఇటీవల కేంద్ర మంత్రివర్గం 10,000 విద్యుత్ బస్సులను 169 నగరాలు/పట్టణాలలో ప్రవేశ పెట్టాలని, అందుకు రూ. 20,000 కోట్లు కేంద్రం భరించాలని నిర్ణయించింది. ఇదే ఖర్చుతో 40,000 డీజిల్ బస్సులు కొనుగోలు చేయవచ్చు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. విద్యుత్ బస్సులలో ప్రధానమైనది బ్యాటరీ. ఇదే అత్యంత ఖరీదైనది. దీన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కాశ్మీర్‌లో విద్యుత్ వాహనాల బ్యాటరీకి అవసరమైన లిథియం ఇటీవలే బయట పడింది. అందుచేత మన దేశం మరో పది సంవత్సరాలు వేచి చూడవచ్చు. ఈలోగా ఖనిజ సంపద, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ బస్సులపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ధరలు కూడా క్రమంగా తగ్గుతాయి. మనం ఇంతగా తొందరపడి ఒళ్ళు కాల్చుకోవడం అవసరమా ?
కానీ ఇందుకు భిన్నంగా విద్యుత్ బస్సుల కోసం ఉరుకులు పరుగులు తీయడం వెనుక కారణం ఏమిటీ? ఈ విద్యుత్ బస్సులను ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేయాలి. అందుకు వచ్చే సబ్సిడీ వారికే చెల్లించబడుతుంది. ప్రయివేటు వ్యక్తులే ఆర్.టి.సి ల ద్వారా బస్సులు నడపాలి. అందుకుగాను ఆర్.టి.సి లు వారికి డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్‌పోర్టుకు నడుస్తున్న బస్సులు ఇదే తరహాలో నడుస్తున్నాయి. వీటిపై టి.ఎస్ ఆర్.టి.సి.కి వచ్చే ఆదాయం కంటే ప్రయివేటు వారికి చెల్లించే మొత్తమే ఎక్కువ. దేశం మొత్తంలో విద్యుత్ బస్సుల కథ ఇదే. ఈ విధానం ఆర్.టి.సి.లకు గుదిబండ అయింది. కేంద్ర ప్రభుత్వం 2015 నుండి ఫేమ్ 1, 2019 నుండి ఫేమ్ 2 పథకాలను ప్రవేశపెట్టింది (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్). ఫేమ్ 2 విధి విధానాలలోనే బస్సుల కొనుగోలు, నిర్వహణ, నడపడం వంటివి ప్రయివేటు వారే చేయాలనే షరతు కేంద్రం విధించింది. దీనికి జి.సి.సి. (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) అని పేరు పెట్టింది. అంటే ఖర్చులు, లాభాలు కలుపుకొని నిర్ణయించడం. ఇదే విద్యుత్ బస్సుల కథలోని అసలు రహస్యం. ప్రజల సొమ్మును కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టడం, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడమే పరమావధి.
దీని వెనుక మరో పెద్ద కుట్ర కూడా దాగి ఉంది. గ్లోబల్ వార్మింగ్ (పర్యావరణ పరిరక్షణ) పేర శిలాజ ఇంధనాల వాడకం గణనీయంగా తగ్గించాలని, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం పెంచాలని ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. దానికే (జస్ట్ ట్రాన్సిషన్) అని పేరు పెట్టారు. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం (27 శాతం) వెదజల్లుతున్న దేశం అమెరికా. ఆ తర్వాత 22 శాతం యూరోప్ దేశాలు, సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ దేశాలు 9 శాతం మాత్రమే. అత్యధిక కాలుష్యాన్ని ప్రపంచంపైకి వదిలి ప్రజల జీవితాలను, వాతావరణాన్ని కలుషితం చేస్తున్న అమెరికా, యూరప్ దేశాలు ప్రధాన బాధ్యత వహించాలి. ఆ దేశాలు అందుకు సిద్ధంగా లేవు. కానీ అమెరికా జూనియర్ భాగస్వామిగా మారిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం నెత్తికెత్తుకొని దేశాన్ని నాశనం పట్టిస్తున్నది. భారత దేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు 25 శాతం, శిలాజ ఇంధనాలు 44 శాతం. దేశంలో విద్యుత్ తయారీ ప్రధానంగా 78 శాతం ధర్మల్ విద్యుత్. బొగ్గే ఇందుకు ప్రధానం. శిలాజ ఇంధనాలు వాటి అనుబంధ పరిశ్రమలలో 2 కోట్ల 15 లక్షల మంది పని చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగం సింహ భాగాన ఉంది. పవన, సోలార్ లాంటి కొత్త విద్యుత్ ఉత్పాదన 96 శాతం ప్రైవేటు రంగానిది. ఇంతటి కీలకమైన ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రయివేటు వారికి ధారాదత్తం చేసేందుకు, కోట్లాది మందిని నిరుద్యోగ సైన్యంలోకి నెట్టేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అమెరికాకు లొంగి కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే మోడీ ప్రభుత్వ విద్యుత్ బస్సుల ఆలోచన. ఈ కుట్రలను అర్ధం చేసుకోవాలి.
/ వ్యాసకర్త 'ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్' ప్రధాన కార్యదర్శి /
ఆర్. లక్ష్మయ్య