ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : మండలంలో మూడు పంచాయతీలలో ఒక సర్పంచ్, రెండు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.అనుపమ తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జార్జిపేట పంచాయతీ సర్పంచ్ కోలా సత్యవతి అకాలంగా మరణించడంతో సర్పంచ్ ఎన్నికకు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నీలపల్లిలో రెండో వార్డు సభ్యులు, తాళ్లరేవులో 11వ వార్డు సభ్యుల పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీన ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని ఆమె తెలిపారు. 8వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 14వ తేదీన నామినేషన్‌ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పోటీలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు జార్జి పేట, నీలపల్లి, తాళ్లరేవు పంచాయతీల లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని దీనికి పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.










