Apr 03,2023 09:14
  • గిరిజనులు, బిసిలను వెళ్లగొట్టే యత్నాలు
  • పురావస్తు శాఖ ద్వారా బెదిరింపులు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : గిరిజనుల, బిసిల భూములపై అధికార పార్టీకి చెందిన ఇద్దరు బడాబాబుల కన్ను పడింది. ఆ భూములు లాక్కొని వాటిలోని ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇందుకు పురావస్తు శాఖను రంగంలోకి దింపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఊరుకు ఊరే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. దీంతో, ఈ ప్రాంతంలో దశాబ్దాల తరబడి నివసిస్తోన్న గిరిజనులు, బిసిలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
         తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం పాండూరు పంచాయతీ పరిధిలోని ముట్టంగితిప్ప గ్రామంలో గిరిజనులు, సుబ్బయ్యనాయుడు కండ్రిగ గ్రామంలో బిసిలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. సర్వే నంబర్‌ 774, 1120, 1124లోని 65 ఎకరాలను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. పొలాల్లోనే ఇళ్లుకట్టుకొని జీవిస్తున్నారు. ఈ భూముల్లోని 50 ఎకరాలను 1975లో 80 గిరిజన కుటుంబాలకు, 15 ఎకరాలను 1978లో 15 బిసి కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఈ భూముల్లో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల నిర్మాణం జరిగింది. చెన్నరు ఈస్టు సర్కిల్‌కు చెందిన పురావస్తు శాఖాధికారులు ఈ భూములు తమవని, ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని గిరిజనులు, బిసిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, పురావస్తు శాఖ భూములైతే తమకు పట్టాలు ఎలా ఇస్తారని, స్కూలు, అంగన్‌వాడీ భవనం ఎలా కడతారని, ఇన్నాళ్లూ ఈ భూముల విషయం పురావస్తు శాఖకు గుర్తులేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ భూములను లాక్కుంటామంటే తాము ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పుతున్నారు. పురావస్తు శాఖ తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ భూముల్లో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు పురావస్తు శాఖను అడ్డుపెట్టుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కలిసి తమను వెళ్లగొట్టాలని చూస్తున్నారని గిరిజనులు, బిసిలు చెబుతున్నారు. ఈ భూములు తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీ సెజ్‌కు మూడు కిలోమీటర్లు, చెన్నరుకు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి విలువ రెండు కోట్ల రూపాయలకుపైనే ఉంది. పైగా, నిక్షేపాలు ఉండడంతో ఈ భూములు మరింత ఖరీదయ్యాయి.
 

                                                                        కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామాన్ని ఖాళీ చేయాలని, భూముల నుంచి వైదొలగాలని పురావస్తు శాఖాధికారులు బెదిరిస్తున్నారంటూ గిరిజనులు, బిసిలు కలిసి శనివారం కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సూళ్లూరుపేట ఆర్‌డిఒకు వివరంగా చెప్పాలని, మీ ప్రాంతానికి వచ్చి పరిశీలించి న్యాయం జరిగేలా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ధనంజయులు, మునిస్వామి, వసంతమ్మ ఉన్నారు.