అక్షరాలన్నీ ఏకమై
వాక్య నినాదపు సమిధలై
భావ వ్యక్తీకరణ సమ్మెతో
వీధుల్ని నిర్బంధిస్తున్నాయి
ఎన్నాళ్లని ఎన్నేళ్లని
ప్రజ్వలిస్తూ గర్జిస్తూ
వాక్యాలను ఈటెలుగా చేసి
సమస్యపై సంధిస్తూ
సమరంతో ఏకీభవిస్తున్నాయి
ఏకరువాక్షరాలన్నీ
పేరాలుగా విస్తరించుకుపోతూ
వ్యవస్థ మనుగడ
ప్రశ్నార్థకంగా కూర్చుని వుంటే
ప్రస్తుత తీరుపై
శాశ్వత యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి
నోళ్లు తెరిచి అడిగినా
మనసు విప్పి అర్థించినా
కరగని తీరుతెన్నులపై
కవనాలుగా మారి
కథావస్తువులా చేరి
వ్యాసాలుగా తిరగబడుతున్నాయి
నింగినంటుతున్న ధరలపైనా
అగాథంలో పడి విలపిస్తున్న
సగటు జీవన సరళిపైనా
కలాలన్నీ ఏకమై
కాగితాల రెపరెపలతో
నిరసన ప్రకటిస్తున్నాయి
ఇంకెన్నాళ్లని ఎన్నేళ్లని
మడత విప్పిన పేపరుపై
ముడి విప్పని కష్టాల్ని
అక్షరాలుగా చల్లాలి
మొద్దుబారిన మస్తిష్కాలపై
అక్షర సమరం చేయాలి
ఇప్పుడు కవితలన్నీ
కంకణం కట్టుకుని
బతుకు కోతలపై
రాతలుగా తిరగబడుతున్నాయి
వ్యథల జీవన వ్యవస్థపై
నవలా చైతన్యపు పేరాలుగా
కరువు అరువుని ఎత్తిచూపే
కథా సంపుటాలుగా
సమాజంపై పరుచుకుపోవాలి
ఏకరువాక్షరాలన్నీ ఏకమై
సామాజిక నాడి లోపల
చైతన్యం నిండిన
ఎర్రని ఇంకువలే
బొట్లు బొట్లుగా రాలి
అక్షర వెలుగులు చిమ్మాలి
ఎప్పటికప్పుడు.. లోకాక్షరాలు
నిత్య చైతన్యంతో
అక్షర సమిధలై.. సాయుధులై..
చేయిచేయి కలపాలి..
కలం బలం చాటాలి..
నరెద్దుల రాజారెడ్డి
96660 16636