కొద్ది క్షణాలు కురిశాక
ఒంటరి మేఘంలోంచి
ప్రకృతి స్వర నివేదన
ఊపిరిలూదుతుంది .
ఒంటరి సమయాల్లో
చల్లని గాలి ఓదారుస్తుంది.
మౌన భాష వింటూ
చెట్లు ఊగిపోతాయి.
సాయంత్రాలు అలసిపోతాయి.
నాల్గు గోడల మధ్య
వీచే గాలులకి
ఊహలు ఎగసిపడుతుంటాయి .
నిర్వేదంలోంచి లేచి
పచ్చని ఆకుల్లోంచి మెరిసిపోతాను .
ఒకింత నా ప్రపంచంలో
నా పై ఎగిరే పక్షులు
నా చుట్టూ ఋతువుల్ని
అలంకరిస్తాయి .
ఈ క్షణాల్లో
ఈ ఒంటరి క్షేత్రంలో
ఏకాంత నిక్షేపాల్ని
ఏరుకుంటున్నాను .
కొద్దిపాటి సమయాలు అలసిపోయాక
మౌనాలు సుషుప్తి గావిస్తున్నాయి .
ఈ ఏకాంత క్షణాల్ని
సమ్మోహన పడనివ్వండి .
- గవిడి శ్రీనివాస్
70192 78368