Apr 09,2023 07:45

చీకటి తెరలు తొలగక మునుపే
నిద్రకు వీడికోలు పలికి
సూరీడుతో పోటీ పడాల
గడప గడపకీ
మెలకువ పాట పాడాల
సాగరాన అలలు సాగినట్టే
నా కాళ్ళు రెక్కలు
కదులుతూ వుండాలి
నేనొక నడిచే ఫల వృక్షమై
వీధుల్లో కదలాడాల
కంప చీపురుకు తెల్లచీర కట్టినట్టు
ఏళ్ళు ముదిరిన శరీరం
బేరాల ఏతమేసి డబ్బులు తోడాల
సావుకారిగారి దర్శనమయ్యాక
రాలిన పైసలతో
పొయ్యిమీద ఎసర నీళ్ళు మరగాల
సల సలా మరుగుతున్న నీళ్లలా
ఆలోచనల అలలు తెంచుకున్న
పేగుల చుట్టూ తిరుగుతాయి
ఇప్పుడేమీ తేటతెల్లం కాదు
గుడ్డు పగిలి పోవాల
గులకతో చెప్పకుండా పిల్లలు
ఎగిరిపోయిన వైనం
నిప్పులా గుండెను కాల్చాల
ఆకలికి నేనెప్పుడూ బెదిరిపోలేదు
ఆకలి నన్నుచూసి తోక ముడాల
ప్రాణదీపం కొండెక్కిపోతే
నాకట్టి అనాధ శవమై అల్లాడరాదు
పగ వానికయిన ఇలాంటి
కష్టం పనికిరాదు
కడ ప్రాణాలు కొట్లాడుకొని
కళ్ళు కాలిన చిచ్చుబుడ్డుల్లా
మాడి మసిగా మారినపుడు
నా కన్న పేగులు
నన్ను చుట్టుకోవాల
ఆకాకూ కళ్ళు జేసుకొని
ఆశతో చూసుకొనే చెట్టుమీద
సందేలకైనా పిట్టలు
సందడి చేయాలిగా!

ఆగూరు రామారావు
8886555822