- నదిలో పేరుకుపోయిన ఇసుక మేటలు
- నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం
- ఆందోళనలో డెల్టా రైతులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరిలో డ్రెడ్జింగ్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. 2015 తర్వాత నుంచి ఈ పనులను నిర్వహించలేదు. గతేడాది అగ్రిమెంట్ జరిగినా పనులు ప్రారంభంలో తాత్సారం జరుగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో గోదావరి డెల్టా కింద పది లక్షలు ఎకరాల ఆయకట్టు ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఈ భూములకు సాగునీరు అందుతుంది. బ్యారేజీ ఎగువన నీటి నిల్వల ఆధారంగా సాగునీటి సరఫరా ఉంటుంది. ఎగువన నీటి నిల్వలు పెరగాలంటే నదిలో పేరుకుపోయిన ఇసుక మేటలను ఏటా తొలగించాల్సి ఉంటుంది. ఈ పని సరిగా జరగట్లేదు. ఫలితంగా నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుక మేటలు తొలగిస్తే అఖండ గోదావరి పాండ్ లెవల్ పెరుగుతుందని రైతులు, రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్నేళ్లుగా డ్రెడ్జింగ్ పనులు నిర్వహించకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతోంది. కాటన్ బ్యారేజీ పాండ్ లెవల్ సాధారణ సామర్థ్యం మూడు టిఎంసిలు. ప్రస్తుతం 1.5 టిఎసిలకే పరిమితమవుతోందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. వేసవి రాకముందే నదిలో ఇసుక మేటలు ఇప్పటికే దర్శనమిస్తున్నాయి. ఏటా ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా సాగునీరు లభిస్తున్నప్పటికీ రబీకి నీటి ఎద్దడి తప్పడం లేదు. రబీ చివరి దశలో సీలేరు జలాలే దిక్కవుతున్నాయి. కొన్నిసార్లు సీలేరులోనూ నీటి నిల్వలు అడుగంటడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
- డ్రెడ్జింగ్ పనులకు ముహూర్తమెప్పుడు?
గోదావరి నీటి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తున్న ఇసుక మేటలు, దిబ్బలను గుర్తించి డ్రెడ్జింగ్ కోసం అధికారులు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అనంతరం టెండర్ల దశ పూర్తి చేసి డ్రెడ్డింగ్ పనులు నిర్వహించేందుకు సుమారు రూ.272 కోట్లతో 2022 సెప్టెంబరులో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీతో ఒప్పందం జరిగింది. కాటన్ బ్యారేజీ ముందు భాగం నుంచి ఎడమ గట్టు వైపు రూ.144.23 కోట్లు, నదిలో బ్యారేజీ ఫోర్ షోర్ నుంచి రూ.128.13 కోట్లతో డీ సిల్టింగ్ చేపట్టాల్సి ఉంది. సుమారు రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. ఏటా ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ దశల వారీగా గోదావరికి వరదలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూడికతీత పనులు జులై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అగ్రిమెంట్ జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.
- చివరిసారిగా 2015లో పూడిక తీత
కాటన్ బ్యారేజీ ఎగువన 2015లో చివరిసారిగా పూడికతీత పనులు జరిగాయి. దాదాపు 20 మేటలు, ఇసుక దిబ్బలు తొలగించారు. రూ.16.52 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్రెడ్జింగ్ పనులను అప్పట్లో నిర్వహించారు. డ్రెడ్జింగ్ ద్వారా సేకరించిన ఇసుకను పర్యాటక ప్రాజెక్టు అవసరాల నిమిత్తం పిచ్చుకలంక ప్రాంతాన్ని ఎత్తు చేసేందుకు ఉపయోగించారు. దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా మళ్లీ డ్రెడ్జింగ్ పనులు చేపట్టలేదు. గడిచిన ఏడేళ్లలో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. 2022 అక్టోబరులో గరిష్ట స్థాయిలో 22 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో, బ్యారేజీ ఎగువన ఇసుక మేటలు, మట్టి దిబ్బలు ఏర్పడ్డాయి.
- ఫిబ్రవరిలో పనులు ప్రారంభం
గోదావరిలో పూడికతీత పనులు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. రూ.272 కోట్ల వ్యయంతో సెప్టెంబరులో అగ్రిమెంట్ జరిగింది. జనవరి 15 తర్వాత పనులు ప్రారంభం కావాల్సి ఉంది. త్వరితగతిన ప్రారంభించి నిర్దేశిత కాలంలోపు పూర్తి చేయాలని ఆదేశించాం. పూడిక తీత పనుల వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.
- జి. శ్రీనివాసరావు, ఎస్‌ఇ, జలవనరుల శాఖ, తూర్పు గోదావరి జిల్లా










