Jul 23,2023 11:12

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : మణిపూర్‌ రాష్ట్రంలో గిరిజనులు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్న ముష్కరుల దిష్టిబొమ్మను సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నాడు సిపిఎం మండల కార్యాలయం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి మాట్లాడుతూ ... సుమారు గత మూడు నెలలుగా మణిపూర్‌ రాష్ట్రంలో గిరిజనులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా సరే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా ఆందోళనకరమని అన్నారు. ఇంత జరుగుతున్నా డబుల్‌ ఇంజన్‌ సర్కారు యంత్రాంగం, ఇంటలిజెన్స్‌ వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కేంద్రంలో ఆర్‌ ఎస్‌ ఎస్‌ కనుసన్నల్లో పని చేస్తున్న బిజెపి తన మతోన్మాదపు చర్యల కారణంగానే మణిపూర్‌లో మానవ సమాజం సిగ్గుపడే విధంగా అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మణిపూర్‌ ఘటనల నేపథ్యంలో ... దేశం మొత్తం ఉలిక్కిపడిందనీ కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జంగా వెంకటరెడ్డి, సిపిఎం సీనియర్‌ నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, సిఐటియు నాయకులు వెంకట్రామయ్య, రైతు సంఘం నాయకులు అప్పిరెడ్డి, మోహనరెడ్డి, రామిరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి, బాబు, విజరు, తదితరులు పాల్గొన్నారు.