Aug 22,2023 14:49

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : విద్యా సంస్థలు వ్యాపార రంగ సంస్థలుగా మారుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ ఆరోపించారు. ఎస్‌ ఎఫ్‌ ఐ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేసినా.. నేటికీ ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సెలవు దినాలలో కాకుండా మిగిలిన సమయాలలో విద్యార్థులకు ఆట, పాట లేకుండా ఉదయం 6 నుంచే రాత్రి 8 గంటల వరకు విద్యాసంస్థలు నడుపుతున్నా ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులు ఉండి కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏదో తూతూ మంత్రంగా విద్యార్థి సంఘాలు చెప్పినప్పుడు మాత్రమే తనిఖీలు చేయడం తప్ప ఏ ఒక్క పాఠశాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపైన ఇప్పటికైనా స్పందించకపోతే ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరవదిక నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తూ సూచిక బోర్డులలో ఫీజుల వివరాలు వెల్లడించకుండా విద్యాసంస్థలు ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాజంపేట పట్టణ కార్యదర్శి ఉపేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు యుగేందర్‌, దినేష్‌, పాల్గొన్నారు.