- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి-కొత్తవలస : జిల్లాలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. విద్యారంగ అభివృద్ధికై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన చేపట్టిన 'విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర'ను సోమవారం విజయనగరం జిల్లా కొత్తవలసలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ విజయనగరం విద్యారంగం సమస్యలకు నిలయంగా మారిందని, వీటి పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర చేయడం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నాంది అని అన్నారు. ఒక పక్క బడులు మూసివేస్తూ ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తున్నారని, సంక్షేమ హాస్టళ్లలో పూర్తిగా విద్యార్థులకు మౌలిక సదుపాయలు లేక, మెస్ ఛార్జీలు పెరగక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కెజిబివిల్లో ఇప్పటికీ సరిగ్గా టీచర్లు లేరని, తక్షణమే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ అశోక్ మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ తమ సొంత జిల్లాలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. జిఒ 77 తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. గిరిజన యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చెయ్యాలని కోరారు. లేని పక్షంలో 2024 ఎన్నికలలో విద్యార్థుల సత్తా చూపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్, పి రామ్మోహన్ రావు, నాయకులు డి రాము, హర్ష తదితరులు పాల్గొన్నారు. సైకిల్‌యాత్రకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు మద్దతు తెలిపారు. సైకిల్‌యాత్రలో స్థానిక కెజిబివిని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.










