Aug 02,2023 21:35
  • ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌

ప్రజాశక్తి- గంట్యాడ, గజపతినగరం (విజయనగరం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్‌ విమర్శించారు. జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన చేపట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర మూడోరోజు విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని శ్రీనిధి కళాశాల వద్ద ప్రసన్నకుమార్‌ ప్రారంభించారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు సోమేష్‌ అధ్యక్షతన లక్కిడాం జంక్షన్‌లో జరిగిన సభలో ప్రసననకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ డిగ్రీలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని విద్యార్థుల స్థాయికి, సిలబస్‌కు అనుగుణంగా పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు సమీరా మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె రవికుమార్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ అనసూయమ్మ, సిఐటియు నాయకులు వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం సైకిల్‌యాత్ర బృందం నాయకులు స్థానిక జెడ్‌పి హైస్కూలును, బుడతనాపల్లి హైస్కూలును సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వీరికి యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జెఆర్‌సి పట్నాయిక్‌ స్వాగతం పలికారు. సైకిల్‌యాత్ర బొండపల్లి మండలం మీదుగా గజపతినగరం చేరుకుంది.