Apr 14,2023 07:40

  • నేడు డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ 132వ జయంతి

స్వచ్ఛంద వనరులతో అనేక స్వచ్ఛంద విద్యాసంస్థలను అంబేద్కర్‌ ప్రారంభించారు. కాని జీవితం ఆధునికం కావాలంటే వారందరికీ రాజ్యమే విద్యావకాశాలు కల్పించాలని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయన కాంక్షించిన సోషలిజంలో లక్షోపలక్షలుగా ఉన్న పేద నిరక్షరాస్య ప్రజలకు అక్షరాస్యతను, విద్యను అందించి, రాజ్యం వారిని శ్రేయోన్ముఖులను చేయాలి !

         విద్య తాలూకు అంబేద్కర్‌ దృక్పథానికి, ఆయన వృత్తి ఉద్యోగ జీవిత వికాసానికి (కెరీర్‌ డెవలప్‌మెంట్‌కి) అవినాభావ సంబంధముంది. మెట్రిక్‌ పూర్తయిన తరువాత ఆయన మహారాజు శాయాజిరావు ఎస్టేట్లో పనిచేశాడు. 1917లో విదేశాలలో విద్యాభ్యాసం ముగించుకు వచ్చాక మళ్ళీ బరోడా మహారాజా దగ్గర మిలిటరీ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన సంస్థానంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు అంబేద్కర్‌ను సాటిమనిషిగా, సగౌరవంగా ఎప్పుడూ చూడలేదు. అక్కడి చప్రాసీలు, సిబ్బంది ఆయనను చాలా నీచంగా చూసేవారు. ఆయనకు సరైన ఇల్లు, భోజన వసతులు దొరకలేదు. విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనలు చేసి, అంబేద్కర్‌ రెండు డాక్టరేట్లు సంపాదించాడు. గొప్ప మేధావిగా అప్పటికే ఆయనకు ఇతర పండితుల నుంచి ఆమోద ముద్ర పడింది. అయినా మహర్‌ కులంలో పుట్టడంవల్ల పుట్టుకతో వచ్చిన అస్పృశ్యతా కళంకం అతన్ని వెన్నాడుతూనే ఉంది. ఉన్నత కులాల వారి చేతిలో ఆయనకు పీడన, వివక్ష తప్పలేదు. 1918 నవంబరులో ఆయన బొంబాయి లోని సిడ్నెహం కళాశాలలో రాజకీయ అర్థశాస్త్రంలో ఆచార్యుడిగా చేరాడు. అటు తర్వాత ఆయన మళ్ళీ లండన్‌ వెళ్ళాడు. లండన్‌ నుంచి తిరిగి వచ్చాక లాయరు వృత్తిలో చేరి, ఆదాయం చాలక, బాట్లీ బారు అకౌంటెన్సీ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ళు పార్ట్‌ టైం ప్రాతిపదికగా వ్యాపార న్యాయశాస్త్రం ఆచార్యుడిగా పనిచేయాల్సి వచ్చింది. బొంబాయి విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర పరీక్షాధికారిగా కూడా పనిచేశాడు. నాలుగేళ్ళు గడిచాక బొంబాయి లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో పూర్తిస్థాయి ఆచార్యుడిగా నియమింపబడ్డాడు. ఆయనకు విద్యార్థులు, అధ్యాపకులతో మంచి సంబంధాలుండేవి. అడపా దడపా నిరుత్సాహకరమైన సంఘటనలు కూడా జరిగాయి. కాని అంబేద్కర్‌ వీటిని పక్కకు నెట్టి, విద్యా విషయం పట్ల ఒక సమగ్ర దృక్పథాన్ని రూపొందించుకున్నాడు. కొంతకాలం గడిచాక, జూన్‌ 1935లో, బొంబాయి లోని ప్రభుత్వ లా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమింపబడ్డాడు. ప్రిన్సిపాల్‌గా గడించిన మూడేళ్ళ అనుభవం విద్యా, పరిపాలనా విషయాలతో ఆయనను నిశితగ్రాహిగా, నిష్ణాతుడిగా రూపొందించింది. తదుపరి ఆయన బొంబాయి ప్రాంతీయ శాసన సమితి సభ్యుడిగా చేరాడు. సమితిలో మహర్‌ జాతివారి అనేక విద్యా సమస్యలను లేవనెత్తి కూలంకషంగా చర్చించాడు. విద్యారంగంలోని సంక్లిష్ట సమస్యల పట్ల ఆయనకు చక్కని అవగాహన ఏర్పడింది.
         అంబేద్కర్‌ విద్యాప్రాపంచిక దృక్పథం, విలువలు ఆయన పూర్వజులైన మేధావులు, సంస్కర్తల వారసత్వంలోని భాగమేకాని - వేరు కాదు. దాదాభాయి నౌరోజీ నుంచి, ఫూలే, రనడే, గోఖలే, తిలక్‌ దాకా వికసించిన విద్యాచింతన, ఆచరణను అంబేద్కర్‌ స్వంతం చేసుకున్నాడు. రాజా రామ్‌మోహన్‌ రారు కాలం నుంచి ఇంగ్లీషు విద్యకు బాగా ప్రాచుర్యం లభించింది. ఇంగ్లీషు విద్య ద్వారా నూతన విజ్ఞానం, హేతుబద్ద మైన ఆలోచన, మానవీయ విలువలను భారతీయులలో ఆవిష్కరించవచ్చునని వీరందరి గట్టి నమ్మకం. వీరి దృక్పథాన్ని అంబేద్కర్‌ కూడా పంచుకున్నాడు. తన తోటి మహర్‌ సోదరులు చదువు లేకుండా కర్మ సిద్ధాంతం లాంటి మూఢ నమ్మకాలకు బలై బతుకుతున్న విషయం అంబేద్కర్‌ గమనించాడు. వారి పాశవిక బతుకులో మానవీయ దీపాలను వెలిగించాలంటే వారికి విద్య గరపాలి. మహర్‌ జనావళిలో విద్య విస్తారంగా పెరిగిన కొద్దీ వీరిలో ఒక నవ్య చైతన్యం వస్తుంది. అప్పుడు వారు స్వచ్ఛందంగా ఒక కొత్త ఆచరణ వైపు, ఆత్మవిముక్తి వైపు పోరాడుతూ పురోగమిస్తారని అంబేద్కర్‌ ప్రబల విశ్వాసం.
      దళిత విముక్తి సాధించడానికి అంబేద్కర్‌ అనేక పాఠశాలలను స్థాపించాడు. 1920లో నాగపూర్‌లో కర్మవీర్‌ వి.ఆర్‌.షిండేను కలిసి ముఖాముఖి మాట్లాడినప్పుడు, దళిత పాఠశాలలను, విద్యాసంస్థలను దళితులే స్థాపించాలని, వారి యాజమాన్యం కిందనే వాటిని నడపాలని గట్టిగా వాదించాడు. అయితే షిండే ఈ అభిప్రాయాన్ని పూర్తిగా ఆమోదించలేదు. 1945లో ''పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ'' నేతృత్వంలో బొంబాయిలో సిద్ధార్థ కాలేజీని స్థాపించాడు. తరువాత ఇందులో వాణిజ్య, న్యాయ కళాశాలలను, అదనంగా చేర్చారు. ఔరంగాబాదులో మిళింద్‌ కళాశాల, మహద్‌లో అంబేద్కర్‌ కళాశాలలను తదుపరి ప్రారంభించారు. అంబేద్కర్‌ పేరిట నాగపూర్‌లో ఇంకొక కళాశాలను కూడా నవ బౌద్ధులు స్థాపించారు. అంబేడ్కర్‌ అనుచరులు క్రమేపి దళిత ప్రజల మనోవికాసానికి, పురోభివద్ధికి అనేక కళాశాలలను, విద్యాసంస్థలను స్థాపించారు.
      ఇంతవరకు అంబేద్కర్‌ జీవిత చరిత్రను ఆయన సామాజిక నేపథ్యాన్ని జోడించి విద్య తాలూకు ఆలోచనలను చర్చించాము. ఇప్పుడు అంబేద్కర్‌లో ఆకతి చెందిన విద్య తాలూకు మౌలిక చింతనను విశ్లేషిద్దాం.
          ''పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ'' ప్రారంభోపన్యాసంలో విద్య పట్ల తనకున్న ప్రాథమిక అభిప్రాయాలను స్పష్టం చేశాడు అంబేద్కర్‌. విద్యా సంస్థల రెండు ప్రధాన లక్ష్యాలు: ఒకటి, సత్యాన్వేషణ. రెండు, వ్యక్తి జీవితంలో మానవీయ విలువల్ని పెంపొందించడం. బుద్ధుడు తన ప్రవచనాలలో ప్రచారం చేసిన, సూత్రత్రయం అంబేద్కర్‌ జీవితాన్ని, ఆయన విద్యా చింతనను నిశితంగా ప్రభావితం చేసింది. ఆ సూత్రాలు 1. ప్రజ్ఞ 2. కరుణ 3. సమత. ఈ మూడు సూత్రాలు ఆయన బతుకు శైలికి మార్గదర్శకంగా ఉండటమే కాదు-ఆయన విద్యాచింతనను, ఆచరణను కూడా కాంతిమయం చేశాయి. బుద్ధుడి హేతువాదం, డూయీ శాస్త్రీయ ఆలోచనా వాదాల (సైంటిఫిక్‌ టెంపరిమెంట్‌)తో ప్రేరణ పొందిన అంబేద్కర్‌...జనావళిలో ప్రధానంగా విద్యార్థులలో విద్య ద్వారా శాస్త్ర దృష్టిని పెంపొందించడానికి కృషిచేశాడు.
       1937లో బ్రిటీషు పాలకులు ప్రాంతీయ స్వయం పాలనా శాసనం కింద సాధారణ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఎన్నికలకు ముందు అంబేడ్కర్‌ 'ఇండియన్‌ లేబర్‌ పార్టీ'ని స్థాపించాడు. ఆ పార్టీ ప్రణాళికలో దళిత వర్గాల అభివద్ధికి దోహదం చేసే విద్యావిధానాన్ని రూపొందించాడు డాక్టర్‌ అంబేద్కర్‌. నిరక్షరాస్యతను రూపుమాపాలంటే పరిపూర్ణ నిర్బంధ విద్యావిధానాన్ని అమలు పరచాలన్నాడు. బ్రిటీషు వాళ్ళు ప్రవేశపెట్టిన ఉదార విద్యావిధానం. - అటు ఉన్నత వర్గాల వారికి కానీ, ఇటు నిమ్న వర్గాల వారికి కానీ అట్టే ఉపయోగపడదని చెప్పాడు. విభిన్న వృత్తులలో శిక్షణనిచ్చే సాంకేతిక విద్య చాలా అవసరమని వాదించాడు. చాలామంది షెడ్యూల్డు కులాలవారు దారిద్య్రరేఖకు అట్టడుగున ఉండటంవల్ల, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు. అందుకే విద్యాలయాలలో షెడ్యూల్డు కులాల వారికి ఉపకార వేతనాలిచ్చి చదువుకునే అవకాశం కల్పించాలని నొక్కి చెప్పాడు. ప్రకార్యాల రీత్యా విశ్వవిద్యాలయాలను శిక్షణాత్మక (టీచింగ్‌), శిక్షణేతర (నాన్‌ టీచింగ్‌) విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సలహా ఇచ్చాడు.
        సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను ఉద్యమ స్పృహతో ప్రచారం చేసిన వారిలో అంబేద్కర్‌ ఒకరు. బొంబాయి శాసన సభలో ఆనాటి విద్యామంత్రి అప్పుడు అమలులో ఉన్న విద్యా శాసనాన్ని మార్చి, ప్రాథమిక పాఠశాలల్లో చరఖా వడకటాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నించాడు. గాంధీజీ తన ''నయీ తాలీమ్‌''లో భాగంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలు చరఖా వడికి సంపాదిస్తూ, చదువుకోవచ్చునని అభిప్రాయపడ్డాడు. దీన్ని అంబేద్కర్‌ వ్యతిరేకించాడు. ''సంపాదిస్తూ చదువు'' పథకాన్ని గాంధీజీ గ్రామాలలో ఉన్న పేదరికాన్ని నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారే కాని ఏదో ఒక ప్రత్యేక సామాజిక వర్గాన్ని (దళితులు, ఇతరులు) దృష్టిలో వుంచుకొని కాదు. అయితే అంబేద్కర్‌ దృక్పథం వేరు. ఆయన అభిప్రాయంలో హైందవ సమాజంలోని అట్టడుగున ఉండే అతి దరిద్రులైన వర్గంవారు - షెడ్యూల్డు కులాల పిల్లలు. వారిని సంపాదిస్తూ చదువుకోండని అంటే - వారు సంపాదన వైపు ఎక్కువ ఆకర్షింపబడి, చదువును అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. అంతే కాదు. ''పొట్ట తిప్పలు'' లేకుండా చదువుకోగలిగితే వారిలో విజ్ఞాన తృష్ణ, సాహసోపేతమైన చింతన వృద్ధి చెందుతాయి. అందుకే విద్య నిర్బంధం చేయాలని అంబేద్కర్‌ వాదించారు.
       స్వచ్ఛంద వనరులతో అనేక స్వచ్ఛంద విద్యాసంస్థలను అంబేద్కర్‌ ప్రారంభించారు. కాని జీవితం ఆధునికం కావాలంటే వారందరికీ రాజ్యమే విద్యావకాశాలు కల్పించాలని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆయన కాంక్షించిన సోషలిజంలో లక్షోపలక్షలుగా ఉన్న పేద నిరక్షరాస్య ప్రజలకు అక్షరాస్యతను, విద్యను అందించి, రాజ్యం వారిని శ్రేయోన్ముఖులను చేయాలి !
    విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో బ్రిటీషు వారు ప్రవేశపెట్టిన వలస విద్యావిధానం, బోధనా పద్ధతులు దురదృష్టకరమని అంబేద్కర్‌ అభిప్రాయం. దాదాపు అదే వలస విద్యా విధానం స్వాతంత్య్రానంతరం కూడా మన దేశంలో కొనసాగుతోంది. దీన్ని మార్చాలని ఆయన తపన, ఉద్దేశ్యమూనూ.
         అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో ఒక కోర్సు చదువుతున్నప్పుడు, అనేక విషయాలను ఐచ్ఛికాలుగా తీసుకోవచ్చు. దానివల్ల విద్యార్థి విజ్ఞాన పరిధి గణనీయంగా పెరుగుతుంది. భారతదేశంలోని విద్యాలయాలలోని కోర్సులలో, విస్తారమైన మార్పు రావాలని అంబేద్కర్‌ అభిప్రాయం. స్వానుభవం ఆధారంగా బోధనాత్మక పరిశోధనా సిబ్బంది మధ్య అంతస్తు, వేతన వ్యత్యాసాలు బాగా తగ్గించాలని ఆయన వక్కాణించారు. అలాగే ఒకే విశ్వవిద్యాలయం పరిధిలో నడిచే డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్‌ కళాశాలల మధ్య అంతస్తు వ్యత్యాలసాలు వుండ కూడదని చెప్పారు.
      విద్యార్థులంటే అంబేద్కర్‌కు చాలా మక్కువ. ప్రభుత్వ లా కాలేజి ప్రిన్సిపాల్‌గా పనిచేసినప్పుడు ఆయన అక్కడి గ్రంథాలయాన్ని బాగా అభివృద్ధి చేశాడు. విద్యార్థులు విజ్ఞానంతో పాటు, వినోద క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేట్టుగా వారిని ఉత్సాహపరిచాడు. అనేక వసతులను, సాధనాలను సమకూర్చాడు. ఆయన చక్కని చిత్తశుద్ధి గల మాష్టారు. బాగా కష్టపడి పాఠాల్ని తయారుచేసి చాలా ఉత్సాహంతో నిశిత దృక్పథంతో చెప్పేవాడు. ఆయన అభిప్రాయంలో ఒక ప్రొఫెసర్‌ పండితుడై ఉంటే సరిపోదు. చక్కని స్వర విన్యాసంతో బోధించాలి. ఆయన క్షుణ్ణంగా తెలుసుకొన్నవాడై ఉండాలి. ఆచార్యులు నిర్విరామంగా జ్ఞానాన్ని ఆర్జిస్తూ, సత్యాన్ని శోధిస్తూ, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలని బోధ చేశాడు అంబేద్కర్‌.
       అధ్యయనం నుంచి పోరాటం, పోరాటం నుంచి అధ్యయనం వైపు నిరాఘాటంగా సాగిన జీవితం అంబేద్కర్‌ది. రాజకీయ - ఆర్థిక, సాంఘిక - సాంస్కృతిక సమస్యలను అధ్యయనం చేయడంలోని జిజ్ఞాస ఆయన జీవితాంతం కొనసాగింది. తుది క్షణాల వరకు చదువుతూ, రాస్తూనే ఉన్నాడు.
       విద్య పట్ల అంబేద్కర్‌కు వున్న నిబద్ధత చాలా గొప్పది - ఈ జిజ్ఞాసా దృక్పథం ఆయన సమస్త ఆలోచనలను, ఆచరణను ప్రభావితం చేసింది. బ్రిటీషు కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ వారికి వ్యతిరేకంగా ఆయన నడిపిన పోరాటాలు పార్లమెంటరీ పంథాలో నడిచాయి. మహజర్లు, చర్చలు, ప్రాతినిధ్య పద్ధతుల ద్వారా సామాజిక సమస్యలను విశదీకరిస్తూ. వాటి పరిష్కారానికి కృషి చేయవచ్చు. ఆయన భారతీయ కరెన్సీ తాలూకు రాయల్‌ కమిషన్‌, సైమన్‌ కమిషన్ల ముందు హాజరయి షెడ్యూల్డు కులాల సమస్యలను వెలుగులోకి తెచ్చాడు. అలాగే రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో అనేకసార్లు దళిత సమస్యలను ఆవేశంతో, ఉద్రేకంతో నివేదించాడు. ఈ పద్ధతుల ద్వారా కొంత జాప్యం జరిగినా, క్రమంగా దళితులు తమ స్వాధీనతను, విమోచనను సాధించగలరని ఆయన అచంచల విశ్వాసం. దీనికి భిన్నంగా సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం పద్ధతులను, పోరాట పద్ధతులుగా వాడుకున్నాడు గాంధీజీ. తన మొత్తం జీవిత పోరాట కాలంలో అంబేద్కర్‌ మూడుసార్లే సత్యాగ్రహాన్ని వాడాడు. అస్పృశ్యులకు ఇతరులతో సమానంగా చెరువుల్లోని నీరు వాడే హక్కున్నదని నిరూపించడానికి ఆయన డిసెంబరు 1927లో మహద్‌లో సత్యాగ్రహాన్ని నడిపాడు. అలాగే మార్చి 1930లో నాసిక్‌ లోని కాలారాం మందిరంలో అస్పృశ్యులకు, సవర్ణ హిందువులతో సమానంగా ఈశ్వరుణ్ని ఆరాధించే హక్కును కల్పించడానికి దేవాలయం ప్రవేశ ఉద్యమం నడిపినప్పుడూ, విదర్భ ప్రాంతంలో భూమి లేని దళిత రైతులకు భూమి పంచి ఇవ్వాలన్నప్పుడూ, ఆయన సత్యాగ్రహ పద్ధతులను వాడాడు. స్వతహాగా ఆయనకు సత్యాగ్రహంలో నమ్మకం లేదు. అలాగే గాంధీజీ ప్రతిపాదించిన హదయ పరివర్తన సిద్ధాంతంలో కూడా నమ్మకంలేదు. సత్యాగ్రహం ద్వారా సమస్యలపట్ల జనంలో చైతన్యం కలిగించినాబీ పోరాటంవల్ల కొన్ని లాభాలు కలిగినా, శాసన నిర్మాణం ద్వారానే ఆ లాభాలు ప్రజలకు శాశ్వతంగా అందించవచ్చునని అంబేద్కర్‌ స్పష్టంగా ప్రకటించాడు. దీనివల్ల రాజకీయంగా అంబేద్కర్‌ రాజ్యాంగ, పార్లమెంటరీ ప్రజాస్వామ్మ న్యాయసమ్మతమైన పద్ధతులను గట్టిగా నమ్మేవాడని బోధపడుతుంది. జీవితాన్ని ఒక సాహసోపేతమైన ఉద్యమంగా భావించే ప్రతి వ్యక్తికి అంబేద్కర్‌ జీవితం మరువలేని మధురమైన పాఠం !
 

/వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు/
/డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ స్మారకోపన్యాసం సంక్షిప్తంగా.../- ప్రొ|| జె.వి. రాఘవేంద్రరావు