
విద్యుత్తు తీగలు ప్రజల ప్రాణాలు తీయడం అత్యంత విషాదకరం. ఇటువంటి దుర్ఘటనల్లో అత్యధికంగా పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కార్మికులు బలి కావడం మరింత బాధాకరం. బుధవారం ఒక్కరోజే అనంతపురం జిల్ల్లాలో నలుగురు, ఏలూరు జిల్లాలో ఒకరు విద్యుద్ఘాతంతో మృత్యువాత పడ్డారు. తరచూ ఇటువంటి దుస్సంఘటనలు జరుగుతున్నా విద్యుత్తు శాఖ తగు నివారణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నా సర్కారు తీరులో మార్పు కనిపించడం లేదు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన ఎనిమిది మంది వ్యవసాయ కార్మికులు ఆముదం కాయలు కోయడానికి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా 33 కెవి ఎల్‌టి విద్యుత్తు వైరు తెగి ట్రాక్టర్‌పై పడింది. దీంతో, ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామంలో ఈ ఏడాది జులై 30న కూలీలతో వెళ్తున్న ఆటోపై 11 కెవి విద్యుత్తు వైర్లు తెగిపడిన ప్రమాదంలో ఆరుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. దాన్ని మరవక ముందే అనంతపురం జిల్లాలో ఇలాంటిది మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బుధవారంనాడే ఏలూరు జిల్లా పెదవేగి మండలం బాదరాలలోని పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి విద్యుద్ఘాతానికి గురై మరణించాడు. పామాయిల్ గెలలు నరుకుతున్న సమయంలో విద్యుద్ఘాతానికి గురై గత ఏడాది కాలంలో ఆ జిల్లాలో 12 మంది కార్మికులు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రమాదాల్లో ఏటా మరణిస్తున్నవారి సంఖ్య వందల్లో ఉంటోంది.
జనం పిట్టల్లా రాలిపోతుంటే సర్కారు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొంటోంది తప్ప ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. ఇలాంటి తీవ్ర దుర్ఘటనలు జరిగితే విచారణకు ఆదేశిస్తోందితప్ప ఆచరణలో తీసుకున్న ప్రమాద నివారణా చర్యలు పూజ్యమే! విద్యుత్ స్తంభాలు, తీగలు సరైన నిర్వహణ లేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాలం చెల్లిన విద్యుత్ తీగలే కొన్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అంతేగాక ప్రమాదాలు జరిగే సమయంలో దాని తీవ్రతను తగ్గించే వివిధ భద్రతా వ్యవస్థలు కూడా ఎందుకు సరిగా పని చేయడంలేదో విద్యుత్ శాఖ సరిగా సమీక్షించిన దాఖలాల్లేవు. అలా చేసివుంటే ఇలా ప్రమాదాలు పునరావృతం కావు కదా! ఉదాహరణకు బుధవారంనాటి ప్రమాద సమయంలో 11 కెవి, 33 కెవి సబ్‌స్టేషన్లకు సంబంధించిన బ్రేకర్లు పని చెయ్యలేదు. అవి పని చేసివుంటే వైరు తెగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. రెండు దశల్లోని భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడం దేనికి సూచిక ఇటువంటి వైఫల్యాలు ఇంకెన్ని జరిగాయో! కాబట్టి ఈ ప్రమాదాల్లో అత్యధికం సర్కారు, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మూలంగానే జరుగుతున్నాయన్నమాట.
ప్రపంచ బ్యాంకు మొదలు దేశంలో దొరికిన చోటల్లా అప్పు చేసి సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ సాగిస్తున్న నిర్వాకమేమిటి? మాడు పగులగొట్టేలా స్మార్ట్ మీటర్లు, ట్రూఅప్ ఛార్జీలు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల పేరుతో భారాలు మోపడానికి కొత్తదారులు వెతుక్కుంటున్నారే తప్ప విద్యుత్ లైన్ల నిర్వహణకు, ప్రమాదాలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాలం చెల్లిన స్తంభాలు, వైర్లు, ఇతర భద్రతా సంబంధిత సామగ్రిని యుద్ధప్రాతిపదికన రీప్లేస్ చేయాలి. నిధుల కేటాయింపులో వాటికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రజల ప్రాణాలకన్నా విలువైనదేదీ లేదు. వాటిని కాపాడడానికి ఎంత ఖర్చయినా చేయాలి. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 'ప్రపంచ స్థాయి' అని మాటలు చెప్పడం కాకుండా అలాంటి భద్రతా వ్యవస్థల ఏర్పాటుకు గట్టి చర్యలు చేపట్టాలి.