Jun 03,2022 06:51

.నైరుతి రుతు పవనాల కంటే ముందుగానే ఖరీఫ్‌ పంటల సాగు నిమిత్తం గోదావరి డెల్టా కాల్వలకు ప్రభుత్వం బుధవారం నీటిని విడుదల చేసింది. ప్రతి ఏటా నవంబర్‌లో తుపాన్ల బెడద రీత్యా ముందస్తుగా నీటిని విడుదల చేస్తే పంట నష్టాన్ని నివారించొచ్చు. గోదావరితో పాటే కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌, సోమశిల, రాయలసీమ ప్రాజెక్టులకు సైతం నీటి విడుదల షెడ్యూల్‌ గత నెల 12న జరిగిన మంత్రి మండలి భేటీలో ఖరారైంది. నీటి విడుదలపై రైతుల్లో డైలమా తొలగించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం మంచిదే. రైతులు సాగుకు సన్నద్ధమవుతారు. కాగా నీటి విడుదల షెడ్యూల్‌ను పక్కాగా అమలు చేయాలంటే ఎదురయ్యే ఆటంకాలు, సమస్యలపై సర్కారు ముందే అంచనా వేసి తగిన చర్యలు చేపట్టవలసి ఉంది. గోదావరి వరకు ఖరీఫ్‌లో పెద్దగా నీటి సమస్య ఉండకపోవచ్చు. గోదావరికి వరదొస్తే కాఫర్‌ డ్యాం వద్ద పరిమితంగానే నీటిని నిల్వ చేయడానికి వీలుంది. చిన్నపాటి వరదకే బ్యాక్‌ వాటర్‌ ఎగదన్ని నిర్వాసిత గ్రామాలు, కాలనీలు మునుగుతున్నాయి. అనివార్యంగా నీటిని సముద్రానికి వృధాగా పంపించాల్సిన పరిస్థితి. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు, పోలవరం పూర్తయ్యేంత వరకు అంతే.
కృష్ణా డెల్టా సమస్య వేరొక తీరు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పట్టిసీమ ఈ మూడింటిపై ఆధారపడాలి. ఎ.పి, తెలంగాణ మధ్య శ్రీశైలం, సాగర్‌ నీటి పంపకాల వివాదం ప్రతి ఏడాదీ తలెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల్లేకపోతే ఇబ్బంది తీవ్రమవుతుంది. ప్రస్తుతం ఆ రెండు జలాశయాల్లో పరిమితంగానే నీటి నిల్వలున్నాయి. పులిచింతల నిర్వాసితుల సమస్య తేలనందున పూర్తి స్థాయి సామర్ధ్యానికనుగుణంగా నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. మొన్న వరదలకు కొట్టుకుపోయిన గేటు నిర్మాణానికి అతీగతీ లేదు. ఈ ఏడాది పట్టిసీమ నీటిని వాడుకునే అవసరం ఉండకపోవచ్చంటోంది సర్కారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు ప్రాజెక్టులో నీటి నిల్వలు సరిపడ ఉంటేనే విడుదలవుతాయి. లేకపోతే పరిమితులు, నియంత్రణలు తప్పవు. సోమశిలలో గడచిన సంవత్సరాలతో పోల్చుకుంటే నీటి స్టోరేజి కొంత పర్వాలేదు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నంత మాత్రాన రైతులు కోరుకున్న పంటలకు ప్రభుత్వం నీళ్లివ్వట్లేదు. బోర్ల కింద, లిఫ్టుల కింద, కాల్వల కింద రబీలో వరి సాగుపై ఆంక్షలు పెట్టింది. దాంతో మునుపటి ఏడాది కంటే నిన్న రబీలో వరి సాగు తగ్గింది. రబీలో వరి వేయని రైతులు ఖరీఫ్‌లోనైనా వేద్దామని ఆశగా ఉన్నారు. మొత్తం సాగులో కాల్వలు, బోరు బావులు, చెరువుల కింద సాగు 50 శాతమే. తతిమ్మా సగభాగానికి వర్షమే ఆధారం. తొలకరి వానల కోసం అన్నదాతలు వెయ్యి కళ్లతో ఆకాశంకేసి ఎదురు చూస్తున్నారు.
         ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు కాల్వలకు నీరిస్తేనే, వాతావరణశాఖ ముందస్తు అంచనా మేరకు దండిగా వానలు కురిస్తేనే అంతా అయిపోదు. సేద్యానికి తొట్టతొలిగా కావాల్సినవి అదనుకు శ్రేష్టమైన విత్తనాలు. రాష్ట్రానికి నాసిరకం, కల్తీ, నకిలీ విత్తనాల పీడ పట్టుకుంది. వరి, పత్తి, మిర్చి, జొన్న, మొక్కజొన్న, ఒకటేమిటి అన్నీ కల్తీనే. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నాణ్యత లేనివి అంటగడుతున్నారు. రైతుభరోసా కేంద్రాలతో చెక్‌ పెడతామంటున్నా అదేమీ లేదు. కేంద్రం తగినంత సబ్సిడీ ఇవ్వకపోవడంతో ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఒక్కో తడవ రైతులకు కావాల్సిన ఎరువులు దొరకట్లేదు. ఇక్కడా ఆర్‌బికెలు ఉత్సవ విగ్రహాలే. పురుగుమందుల నాణ్యతకూ పూచీ లేదు. వ్యాపారుల ఇష్టారాజ్యం. డీజిల్‌, పెట్రోలు ధరల పెరుగుదలతో దుక్కి, కోతలు సమస్త ఛార్జీలూ కొన్ని రెట్లు పెరిగాయి. రైతుభరోసా సహాయం ఏ మూలకూ చాలదు. రైతులకు బ్యాంక్‌ పరపతి అంతంతే. కౌలు రైతులకు అదీ లేదు. ఇన్ని అవరోధాలన్నీ దాటుకున్నాక పంటలకు ధర జూదం మాదిరి తయారైంది. ఇక్కడా ఆర్‌బికెల మంత్రమే. రైతులను వ్యాపారులకు, దళారులకు, మాఫియాలకు వదిలేసినంత కాలం రైతు కోలుకోలేడు. ఆత్మహత్యలు ఆగవు. వ్యవసాయం ఎప్పటికీ అన్నదాతలకు పండగ కానేరదు. రైతు సంక్షేమానికి అన్ని విధాలా ప్రభుత్వం పూచీ పడితేనే రైతుకు నిజమైన పండగ. ఈ తత్వం పాలకుల తలకెక్కేనా?