
నానబెట్టి నానబెట్టి ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) ఉద్యోగులకు ప్రభుత్వం ఖరారు చేసిన వేతన సవరణ (పిఆర్‌సి) తతిమ్మా ప్రభుత్వోద్యోగులకు మల్లే రివర్స్‌లోనే ఉంది. పిఆర్‌సిపై వేసిన అశుతోష్ మిశ్రా కమిటీ ఆర్‌టిసి ఉద్యోగులకు చేసిన అరకొర సిఫారసులను సైతం సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనలనే తుదకు ఖరారు చేసి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడోకాని ఉద్యోగుల జీత భత్యాలు పెరగడం సర్వ సాధారణం. తగ్గడం ఇప్పుడే చూస్తున్నాం. అశుతోష్ మిశ్రా ప్రకారం మూల వేతనం 6.3 శాతం పెరగాల్సి ఉండగా 3.1 శాతానికి తగ్గిపోయింది. అందుకే ఆర్‌టిసి ఉద్యోగులు రివర్స్ పిఆర్‌సి అని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. కీలకమైన ఫిట్‌మెంట్ విషయంలో ఉద్యోగులకు భారీగా అన్యాయం జరిగింది. 2017 ఏప్రిల్ 1 నుండి ఆర్‌టిసిలో పిఆర్‌సి అమలు కావాల్సి ఉండగా అప్పటి టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముంగిట వరకు వాయిదా వేస్తూ వచ్చింది. 2019 ఫిబ్రవరిలో కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో 25 శాతం ఫిట్‌మెంట్‌తో 2017 ఏప్రిల్ 1 నుండి పిఆర్‌సి అమలు చేసింది. కాగా ప్రస్తుతం తక్కిన ప్రభుత్వోద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం కనుక ఆర్‌టిసి వారికీ అంతేనన్న వైసిపి ప్రభుత్వం, లెవెల్ చేసేందుకు వేరే మార్గంలో డిఎలో 1.6 శాతం కోసేసింది. ధరల పెరుగుదలకనుగుణంగా ఇచ్చే కరువు భత్యాన్ని తగ్గించడం అన్యాయం. చట్టబద్ధమూ కాదు. అమల్లో ఉన్న ఫిట్‌మెంట్ తగ్గింపు గత ఒప్పందాల ఉల్లంఘన.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైసిపి సర్కారు ఆర్‌టిసి ఉద్యోగులను 2020 జనవరి 1 నుండి ప్రభుత్వంలో విలీనం చేసింది. విలీనం వలన ఒనగూరే అదనపు ప్రయోజనాల సంగతెలా ఉన్నా, విలీనం పేరు చెప్పి 2021 ఏప్రిల్‌లో రావాల్సిన పిఆర్‌సిని మర్చిపొమ్మంది ప్రభుత్వం. ఆ మేరకు ఉద్యోగులు ప్రయోజనాలు కోల్పోయారు. 2017 ఏప్రిల్ 1 నుండి 2018 జులై మధ్య కాలానికి 4.7 శాతం డిఎ మూలవేతనంలో కలపాలని అశుతోష్‌మిశ్రా కమిటీ సిఫారసు చేయగా 1.6 శాతం తగ్గించి 3.1 శాతమే కలిపారు. మిగిలిన ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే లెక్కయితే ఆర్‌టిసి ఉద్యోగులకు అప్పటికి ఉన్న 25 శాతం ఫిట్‌మెంట్‌కు 1.6 శాతం కలపమన్నారు. అటు డిఎ ఇటు ఫిట్‌మెంట్ రెండింటికీ సర్కారు కోత పెట్టింది. ఇవే కాదు పిఆర్‌సిలో ఉద్యోగులకు నష్టదాయకమైన అంశాలు చాలానే ఉన్నాయి. హెచ్‌ఆర్‌ఎ తగ్గింపు వలన ఇప్పుడు పొందుతున్న జీతం సైతం తగ్గే పరిస్థితి. అలవెన్స్‌లపైనా సర్కారు కత్తి దూసింది. బస్ డ్రైవర్ల అలవెన్స్‌లు 50 శాతం వరకు తగ్గించింది. అధికారుల కారు డ్రైవర్లకు అలవెన్స్‌లు ఎత్తేసింది. ప్రభుత్వంలో విలీనమయ్యాక క్యాడర్ల ఖరారుతో పలు క్యాడర్లలోని ఉద్యోగుల హోదా, స్కేల్స్ తగ్గాయి. ప్రమోషన్ల విషయంలో కొందరికి రివర్స్ తన్నింది. ఈ పరిణామాలు సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తాయి.
ఆసియాలోనే ప్రభుత్వరంగ అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా మన అర్‌టిసి పేరు ప్రఖ్యాతులు గడించింది. రాష్ట్ర విభజన తర్వాత కాస్త వాసిలో రాసిలో తగ్గుదల ఉన్నా ప్రాముఖ్యతేమీ తగ్గలేదు. ఆర్‌టిసి ఆ స్థాయి మన్ననలు పొందడానికి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు అహర్నిశలూ పడ్డ కష్టం ఫలితం. అటువంటి సిబ్బంది జీత భత్యాలు, ఉద్యోగ భద్రతకు పూచీ పడాల్సిన ప్రభుత్వం రివర్స్ పిఆర్‌సి ఇవ్వడం, కోతలు పెట్టడం అన్యాయం. ఆర్‌టిసిలో దాదాపు 60 వేల మంది పని చేస్తున్నారు. వేల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్‌సోర్స్ సిబ్బంది ఏళ్ల తరబడి ఊడిగం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వారిని పర్మినెంట్ చేస్తామని వైసిపి హామీ ఇచ్చింది. పిఆర్‌సిలో ఆ ప్రస్తావన మాట వరసకైనా లేదు. అధికారంలోకొచ్చిన తొలి రోజున తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పిఆర్‌సి, సిపిఎస్ రద్దు హామీల దగ్గరకొచ్చేసరికి మాట తప్పారు. అసంబద్ధమైన, ఆర్‌టిసి ఉద్యోగులకు నష్టదాయకమైన పిఆర్‌సిపై ప్రభుత్వం పునరాలోచించాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి మెరుగైన పిఆర్‌సి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత.