
పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం అనూహ్యంగా పడిపోవడం తీవ్ర ఆందోళనకరం. రాష్ట్ర వ్యాప్తంగా 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 2,01,627 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే దాదాపుగా 33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేదు. గడిచిన 20 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష తప్పడం ఇదే మొదటిసారి. 71 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 31 ప్రైవేటు, 18 ఎయిడెడ్ పాఠశాలలు కూడా సున్నా శాతంతో సరిపెట్టాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా విద్యారంగ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి కారణం ఏమిటి? కారణం ఏదైనా పెద్ద సంఖ్యలో విద్యార్థులపై దీని ప్రభావం పడింది. సప్లిమెంటరీ పరీక్షలను జులై నెలలోనే నిర్వహించి, రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా కళాశాలల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ, విద్యార్థులు తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల్లోనూ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ఈ ఏడాది పదవ తరగతి రాసిన విద్యార్థులపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఎనిమిది, తొమ్మిది తరగతులను వీరు పాఠశాల ముఖం చూడకుండానే దాటేశారు. అన్‌లైన్‌లో బోధన జరిగిందని చెబుతున్నప్పటికీ అవి అరకొర చదువులే! ఆన్‌లైన్ చదువుల బండారాన్ని ఎన్నో సర్వేలు బట్టబయలు చేశాయి. ఆగస్టులో బడులు ప్రారంభమైనప్పటికీ వ్యాక్సినేషన్లకు అనుమతిచ్చేంతవరకు కరోనా భయం వెంటాడుతూనే ఉండింది. నిజానికి ఇప్పటికి కూడా వైరస్ భయం పూర్తిగా తొలగలేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులపైనా, విద్యాబోధనపైనా ఏ స్థాయిలో శ్రద్ధ తీసుకుని ఉండాలి! కానీ, జరిగిందేమిటి? టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉపాధ్యాయుల కొరత వెంటాడింది. దాదాపుగా 25 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఒక అంచనా! ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇది చాలదన్నట్టు బోధనతో సంబంధంలేని ఎన్నో పనులను ఉపాధ్యాయులపై మోపారు. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ పనుల వివరాలు యాప్‌లలో నింపేటప్పటికే పుణ్యకాలం గడిచిపోతోందంటూ గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. ఉపాధ్యాయులపై పెరిగిన పని భారాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఇవి చాలవన్నట్టు నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాలల విలీనం పేరుతో గందరగోళం సృష్టించింది. తరలింపు ప్రక్రియను ఈ ఏడాదే ప్రారంభించింది. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఉపాధ్యాయులు బోధన సాగించినా ఏకపక్షంగా ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం చదువుల ప్రభావమూ ఈ ఏడాదే కనిపించింది! ఎయిడెడ్ రంగంలో సంస్కరణల పేరిట కొన్నింటిని మూసివేయడానికి అనుమతించడం...మరికొన్నింటిని ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించడం వంటి చర్యలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. బడుల పరిరక్షణ కోసం కరోనా సమయంలోనూ విద్యార్థులు ఆందోళనలు చేయాల్సి వచ్చింది. ఇక పరీక్షల సందర్భంగా యథేచ్ఛగా జరిగిన పేపర్ లీక్‌లు కూడా విద్యార్థులపై ప్రభావం చూపాయి. ఈ విషయాలన్నింటికి, వాటి ఫలితంగా చోటు చేసుకుంటున్న అన్ని దుష్పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పదవ తరగతి ఫలితాలు తగ్గడం కూడా వాటిలో ఒకటి.
పరీక్ష తప్పామన్న అందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఇళ్ల నుండి అదృశ్యమైనారు. పరీక్షలు జీవితంలో భాగమే కానీ, అవే జీవితం కాదు! ఈ విషయాన్ని విద్యార్థులతో పాటు, వారి తల్లితండ్రులకు అర్ధమయ్యేలా చెప్పాలి! ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. విద్యార్థులు విద్యా సంవత్సరంతో పాటు, మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలి. ఇప్పటికైనా ఏకపక్ష ధోరణలు వీడి, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎంఎల్‌సిలతో పదవ తరగతి ఫలితాల తీరుపై విస్తృతంగా చర్చించి తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. విద్యారంగాన్ని పటిష్టపరచడంలో కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగులు వేస్తే ఉపాధ్యాయులు, విద్యార్థులపైన ఒత్తిడి లేకుండానే అత్యుత్తమ లక్ష్యాలను అందుకోవడం అసాధ్యమేమి కాదు.