Jun 02,2022 06:48

ఆధార్‌ వినియోగంపై ప్రజానీకంలో నెలకొన్న భయాలు, అనుమానాలు కొత్తేమీ కాదు. కాదు. వీటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తూ వచ్చింది. ఆధార్‌లో సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని, దుర్వినియోగం చేయడానికి అవకాశమే లేదని అత్యున్నత న్యాయస్థానానికి సైతం నివేదించింది. ఆధార్‌ తప్పనిసరి కాదని కూడా పేర్కొంది. ఆచరణలో మాత్రం ఆధార్‌ వాడనిదే రోజు గడవని స్థితికి తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మే 27వ తేదిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యుఐడిఎఐ) జారీ చేసిన హెచ్చరిక దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆధార్‌ వినియోగంపై ప్రజానీకంలో ఉన్న భయాలను రెట్టింపు చేసింది. యుఐడిఎఐకి చెందిన బెంగళూరు ప్రాంతీయ కార్యాలయం ఈ నోటిఫికేషన్‌లో సాధారణ ఆధార్‌ కార్డుకు బదులు మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును మాత్రమే ప్రజలు వినియోగించాలని సూచించింది. మాస్క్‌డ్‌ కార్డులో ఆధార్‌ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. ఫోటోతో పాటు ఇతర వివరాలు కనిపించవు. వ్యక్తుల ధృవీకరణకు చివరి నాలుగు అంకెలు మాత్రమే సరిపోతాయని, పూర్తి నంబర్‌ అవసరం లేదని, మాస్క్‌డ్‌ కార్డును వాడటం వల్ల దుర్వినియోగానికి అసలు అవకాశం ఉండదని, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం సాధ్యమవుతుందని పేర్కొనడం సంచలనం రేపింది. పూర్తి నంబర్‌తో పాటు ఇతర వివరాలు నమోదైన సాధారణ ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీలనే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ప్రజానీకం వాడుతండటంతో దేశ వ్యాప్తంగా గగ్గోలు ప్రారంభమైంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఆ నోటిఫికేషన్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని, అందువల్ల ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. నోటిఫికేషన్‌ను అయితే ఉపసంహరించుకుందిగానీ, ఇంత అకస్మాత్తుగా ఆ తరహా హెచ్చరిక ఎందుకు చేయాల్సి వచ్చిందో కేంద్రం వివరించలేదు. అలాగే ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలను దూరం చేసే ప్రయత్నమూ చేయలేదు.
నిజానికి ఆధార్‌ కార్డును ప్రభుత్వం ప్రవేశ పెట్టినప్పటి నుండి ఈ తరహా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆధార్‌ డేటా బేస్‌ను దుర్వినియోగం చేసిన సంఘటనలు, కొన్ని కార్పొరేట్‌ సంస్థలకు మార్కెట్‌లో విక్రయించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కెవైసి వివరాలను కూడా దుర్వినియోగం చేస్తూ నేరాలకు ఉపయోగిస్తున్న ఉదంతాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించే బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని కూడా స్వాహా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంతకన్నా పెద్ద మోసాలను యుఐడిఎఐ స్వయంగా కూడా నమోదు చేసింది. బయోమెట్రిక్స్‌ను కూడా చౌర్యం చేసి లబ్ధిదారులకు అందవలసిన ఆర్థిక సహాయాన్ని పెద్ద మొత్తంలో కాజేస్తున్న ఘనులు కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్నారు. ఈ తరహా మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వివిధ రూపాల్లో ఆధార్‌ డాటా నుండి లీకైన సమచారంతో ఇంటర్‌నెట్‌ నిండిపోతోంది. ఇది వ్యక్తి గోప్యతకు గొడ్డలిపెట్టుగా మారుతోంది.
ఆధార్‌ను విచక్షణా రహితంగా వినియోగించడం వల్ల చోటుచేసుకునే దుష్పరిణామాలపై యుఐడిఎఐ సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజా నోటిఫికేషన్‌ జారీ, ఉపసంహరణలకు ముందు కూడా అటువంటి తడబాటు సంఘటనలు ఆ సంస్థలో చోటుచేసుకున్నాయి. ఆధార్‌ భద్రతకు సంబంధించి యుఐడిఎఐ లోనే భిన్నాభిప్రాయాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక గ్రూపు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వత్తాసు పలుకుతూ ఆరు నూరైనా ఆధార్‌ను అన్ని రకాల సేవలకు, కార్యక్రమాలకు అనుసంధానించాలని వాదిస్తుండగా, ఆధార్‌ వల్ల చోటుచేసుకునే దుష్పరిణామాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని, అనుసంధానాన్ని వారి ఇష్టానికి వదిలేయాలని మరో గ్రూపు వాదిస్తోంది. అత్యున్నత స్థాయి సంస్థలో నెలకొన్న ఈ తరహా విభేదాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా కాపాడటం, వారి గోప్యత హక్కుకు భంగం కలిగించకుండా చూడటం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత! ఆ బాధ్యతను కూడా విస్మరించడం క్షమార్హం కాని నేరం! ఇప్పటికైనా ఆధార్‌ డేటా దుర్వినియోగం చేయడాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి. ఆ దిశలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.