
ఏ దేశంలోనైనా మనిషి జీవితంలో పెళ్ళి ఒక ముఖ్యమైన వేడుక. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతుంది. సుదీర్ఘ మానవ జీవన వ్యవస్థలో సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగా కొనసాగుతోన్న ఒక నాగరిక కట్టుబాటు ఈ వివాహ వేడుక. యజ్ఞయాగాల కాలంలో అయితే... పెళ్లికాని పురుషునికి అసలు గుర్తింపే వుండేదికాదట. 'అథో అర్థోవా ఏష ఆత్మవ: యత్ పత్నీ' అని పురాణాలు చెబుతాయి. అంటే... భార్య లేనివాడు, ఏకాకి అయిన వాడు... అసంపూర్ణుడు అని అర్థం. దీనికి సంపూర్ణతనిచ్చింది వివాహం. 'శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం/ ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం' అంటాడో సినీకవి. ఆడ, మగ... ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించే కొత్త జీవితానికి శ్రీకారం చుట్టేది వివాహం. మన దేశంలో నాటి గాంధర్వ వివాహం నుంచి నేటి ఆర్య సమాజ్ వివాహం వరకు అనేక పద్ధతుల్లో పెళ్లి తంతు జరుగుతుంటుంది. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు, కులాంతర, మతాంతర వివాహాలకు ఆర్యసమాజ్ ఒక వేదిక. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లి పెద్దలు. వారే ఆ పెళ్లికి సాక్షులు. ఆర్య సమాజ్ ఒక హిందూ సంస్కరణవాద సంస్థ. దీనిని 1875లో స్వామి దయానంద్ సరస్వతి స్థాపించారు. సామాన్యులే కాకుండా సమాజంలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ వేదికలపై పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రభావం ఆర్యసమాజ్ వివాహాలపై ఎలా వుండనుందనేది ఆసక్తికరంగా మారింది.
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన యువకుడు ఆర్యసమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రాన్ని సమర్పించాడు. అయితే, సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు, ఆ సంస్థ ఇస్తున్న ధ్రువపత్రాలను గుర్తించబోమని, ఆర్య సమాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయడానికి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కులాంతర, మతాంతర, ప్రేమ వివాహాలు జరపడంలో ఆర్య సమాజ్ నిర్వహించిన పాత్రను గుర్తించడం అవసరం. దండలు మార్చుకొని పెళ్లి చేసుకోవడం ఇక్కడి సాంప్రదాయం. కులాంతర, మతాంతర వివాహాలు, ప్రేమ వివాహాలకు ఇదొక వేదిక. ఈ క్రమంలో ఏవైనా పొరబాట్లు జరిగితే, వాటిని సరిదిద్దాలి. చట్టబద్దమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప మొత్తంగా ఆ వివాహ ధ్రువపత్రమే చెల్లదంటే... దాని లక్ష్యానికి, ఇక్కడ వివాహాలు చేసుకునేవారికి నష్టం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఆశయానికి తూట్లు పొడిచినట్లవుతుంది. అంబేద్కర్ కోరుకున్న కులరహిత సమాజం రావాలంటే... కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
తమిళనాడు కోయంబత్తూర్ చెందిన నరేశ్ విజయ్, గాయత్రి దంపతులు... తమ కుమార్తెను ఎవరూ కుల, మతం పరంగా చూడకూడదని.. కేవలం ప్రేమతోనే ఆమెను చూడాలని భావించి, కులం లేదు, మతం లేదు అన్న అరుదైన ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. దీనికోసం వారు చాలా పోరాటమే చేశారు. ఇది చట్టంలో లేకపోవచ్చు. కానీ అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒక భద్రత కల్పించారు. అలాగే... ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లకు కూడా ఇటువంటి ఏర్పాటు చేయాలనివుంటే సమంజసంగా వుండేది. కులాంతర, మతాంతర వివాహాలను సహించలేని తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కడతేర్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. కులం ముందు సమానత్వాలు, సౌభ్రాతృత్వాలు, ప్రజాస్వామ్యాలు దిగదుడుపే అన్నట్లుగా పెంచి పోషించింది హిందూ ఆధిపత్యవాదం. ఇలాంటి సామాజిక పరిస్థితిని ఎదిరించి వివాహం చేసుకోవాలనుకునే వారికి సుప్రీం ఉత్తర్వు అశనిపాతంలా మారుతుంది. ఈ పర్యవసానాలను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని వుంటే బాగుండేది. సదుద్దేశ్యంతో కొనసాగుతోన్న ఆర్యసమాజ్ జరిపే పెళ్లిళ్లకు చట్టబద్దత ఎలా కల్పించాలో ఆలోచించాలి తప్ప... చట్టబద్దత లేదని తోసేయడం నష్టం కలిగిస్తుంది. కులాంతర, మతాంతర, ప్రేమ వివాహాలు చేసుక్నువారికి, చేసుకోవాలనుకునేవారికి రక్షణ కల్పించేలా చట్టం, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ వ్యవహరించడం అవసరం.