Jun 08,2022 06:56

బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ, ఆ పార్టీ ఢిల్లీ మీడియా విభాగం అధిపతి నవీన్‌ కుమార్‌ జిందాల్‌ ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజం ఎదుట దేశాన్ని నగుబాటుకు గురిచేశాయి. ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దేశం తలదించుకునే ఏ పనీ తాను చేయలేదని డాబుసరి ప్రకటన చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే బిజెపి అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ జ్ఞానవాపి వివాదంపై ఓ ఆంగ్ల టీవీ చానెల్‌ నిర్వహించిన చర్చలో పాల్గొంటూ మహ్మద్‌ ప్రవక్తను అగౌరవపరిచే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇస్లామిక్‌ దేశాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడం, భారత ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు ఇవ్వడంతో బిజెపి కొన్ని కంటి తుడుపు చర్యలు చేపట్టింది. ఆ ఇద్దరిని ప్రస్తుతానికి సస్పెండ్‌ చేసింది. అన్ని మతాలను బిజెపి గౌరవిస్తుందని, ఏ మతాన్ని లేదా మతానికి చెందిన వ్యక్తిని అవమానించడాన్ని సహించదని బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ముక్తాయించారు. విద్వేష వ్యాఖ్యల తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్ర హోం మంత్రి, విదేశాంగ మంత్రి వరకు అత్యున్నత స్థాయిలో ఉన్నవారంతా నిన్నటివరకు తనకు అండగా నిలిచారని, ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు తనపై చర్య తీసుకున్నారని నూపుర్‌ శర్మ ట్వీట్‌ చేస్తే, దానిపై ఈ మహా మహులెవరూ ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఆమె చెప్పింది తప్పు అయితే ఖండించాలి. ఆ పనీ చేయలేదు. బిజెపి ప్రకటించిన సస్పెన్షన్లు ప్రస్తుతానికి పరువు కాపాడుకోడానికి వేసిన ఎత్తుగడే తప్ప, చిత్తశుద్ధితో చేసింది కాదు. వీరి నోటి దురుసుతనం ఖతార్‌లో పర్యటనకెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని సైతం ఇబ్బందుల్లో పడేసింది. ఉపరాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు రద్దు కావడం, ఆయన అక్కడ ఉండగానే ఖతార్‌ ప్రభుత్వం భారత రాయబారిని పిలిపించుకుని నిరసన తెలియజేయడం, భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం ఇవన్నీ దేశ ప్రతిష్టను మసకబార్చేవే. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో దేశ ప్రతిష్టను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం మరొకటి లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. విద్వేషాన్ని రెచ్చగొట్టే మూకలను ప్రేరేపించేలా బాధ్యతాయుత స్థానాల్లో వున్న వ్యక్తులే మాట్లాడినప్పుడు ఇక కిందివారిని వారు ఎలా అదుపు చేస్తారు? పౌరసత్వ చట్ట సవరణ (సిఎఎ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను అవహేళన చేస్తూ, వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా వ్యాఖ్యానించి విద్వేష రాజకీయాల ప్రచారకుడిగా నిలిచారు. బిజెపి మొదటి ఐదేళ్లలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని పెద్దయెత్తున మూక దాడులు జరిగాయి. 2019లో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చాక బుల్డోజర్‌ దాడులకు తెర తీసింది. ప్రవక్తపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రధాని నోరు మెదపలేదు. భారత్‌కు చమురు సరఫరాలోను, ఇతర వాణిజ్య కార్యకలాపాల్లో సహకరిస్తూ, తెలుగువారితో సహా 80 లక్షల మంది భారతీయులకు ఉపాధి చూపుతున్న ఇరాక్‌, ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, వంటి అరబ్‌ దేశాలు భారత రాయబారులను పిలిపించి నిరసన తెలిపితే కానీ, బిజెపి నేతల ఉన్మత్తపూరిత వ్యాఖ్యలకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయం ఆయనకు ఎరుక రాలేదు. అరబ్‌ దేశాలు గనుక భారతీయులను అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తే వారి గతేమిటి? దేశవ్యాపితంగా వసూలు చేసిన పన్నుల కన్నా ఎక్కువ ఆదాయం అరబ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల ద్వారా మన దేశానికి వస్తుంది. పాకిస్తాన్‌ వంటి దేశాలు బహిష్కరిస్తామని బెదిరించినా, 2019లో అబుదాబిలో జరిగిన 46వ ఓఐసి సదస్సుకు భారత్‌ను అరబ్‌ దేశాలు ఆహ్వానించాయి. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌ పాల్గొన్న ఆ సదస్సు భారత్‌లో ముస్లిం సమాజం భద్రత, రక్షణకు పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పడం ఎవరిని మోసగించడానికి? ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశాలు చేసిన డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం తిరస్కరించడాన్ని బట్టి ప్రధానిలో కొంచెం కూడా పశ్చాత్తాపం ఉన్నట్టు కానరావడం లేదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి నడుపుతున్న విభజన రాజకీయాలు దేశాన్ని అథోగతి పాల్జేసే ప్రమాదముంది. ఈ వినాశనాన్ని అడ్డుకునేందుకు దేశభక్తియుత, ప్రజాతంత్ర, లౌకికవాదులంతా ముందుకు రావాలి.