
ఏప్రిల్ ఎండలు మెండు..మే మేడల వాడ, జూన్ చుక్కల రాత్రి అన్నది పాట. భూతాపం కారణంగా ఏటికేడు పరిస్థితులు మారిపోతున్నాయి. జూన్ లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. ప్రతి యేటా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నింద సూర్యుడిపై వేస్తాం కానీ సూర్యగోళం మండకపోతే ప్రాణికోటి మనుగడ సాధ్యం కాదు కదా! సౌర కిరణాలు నేరుగా భూమిని తాకకుండా రక్షణ తెరగా ఉన్న ఓజోన్ పొరకు కర్బన ఉద్గారాల కత్తులతో తూట్లు పొడుస్తుండటమే ఉష్ణోగ్రతలు ఇంతలా పెరిగిపోవడానికి అసలు కారణం. మనుషుల చర్యలే భూతాపానికి ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు తేల్చి చెప్పారు. పారిశ్రామిక విప్లవంతో అందరికంటే ముందుగా, అందరికంటే ఎక్కువగా విశ్వంలోకి కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్నది అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలే. పెట్టుబడిదారుల లాభాల కోసం సమస్త పర్యావరణాన్ని పణంగా పెట్టిన సంపన్న రాజ్యాలు.. ఆ పాపాన్ని ప్రపంచమంతా పంచుకోవాలంటూ వాటి బాధ్యతను పేద దేశాలపైనా, వర్ధమాన దేశాలపైనా రుద్దేందుకు తెగబడుతున్నాయి. అమెరికా గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా పర్యావరణ ఒడంబడికకు చరమ గీతమే పాడేశారు. భూగోళం సెగలు కక్కుతుండటానికీ, ప్రపంచ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిపోవడానికీ పాశ్చాత్య దేశాలు, అవి కొమ్ముకాస్తున్న పెట్టుబడిదారులే ప్రధానకారణం. మన దేశంలో అదానీ గ్రూపు వంటి కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ చట్టాలను సైతం తుంగలో తొక్కి ప్రకృతి హననానికి ఎంతగా తెగబడుతున్నాయో చూస్తున్నాం. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక ఇలాంటి కార్పొరేట్ శక్తుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. వీటి లాభాలకు అడవులు ఆవిరైపోతున్నాయి. భూమి తల్లి భగభగ మండిపోతుండటానికి పాలకుల ఈ వినాశకర విధానాలే కారణం. 'మా భవిష్యత్‌ను దోచుకోవడానికి మీకు ఎన్ని గుండెలు' అంటూ భావితరం ప్రతినిధిగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థంబర్గ్ మొన్నటి ఏడు ఐరాస పర్యావరణ వేదికపై నిగ్గదీసి ప్రశ్నిస్తే ప్రపంచం నివ్వెరపోయింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంత గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలు బయటకు అడుగుపెట్టాలంటేనే బెంబేలెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. విజయవాడ, అమరావతి, ప్రాంతాల్లో శుక్రవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు గానూ, నంద్యాల, కాకినాడ, నెల్లూరు, జంగమహేశ్వరపురం, కావలి, మచిలీపట్నం, ఒంగోలు ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీలు గానూ నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో దాదాపు 186 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నది వాతావరణ శాఖ అంచనా. భూతాపమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైనా ప్రత్యేకించి నగరాల్లో వడగాలులు తీవ్రమవుతుండటానికి నగరజీవి స్వయంకృతాపరాధమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారాల కోసం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేయడం, జల వనరుల ప్రాంతాలు ఆక్రమణకు గురై కుంచించుకుపోవడం, సహజ అడవుల స్థానంలో కాంక్రీటు కీకారణ్యాలు విస్తరించడం భూతాపానికి కారణమని వారు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రకోపానికి కష్టజీవులు సమిధలౌతున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులపైనా, భవన నిర్మాణ రంగ కార్మికులపైనా ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల బతుకు వేడిగాలుల తీవ్రతతో ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా మారింది. కోవిడ్ విపత్తు సమయంలో నిర్దయగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం వడగాడ్పుల వేళ కూడా పేదల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. వేడిగాలులతో జర జాగ్రత్త అంటూ ఒకవైపు ఆరోగ్య సూచనలు చేస్తూనే మరోవైపు గ్రామీణ ఉపాధి కార్మికులతో రెండు పూటలా పని చేయాల్సిందే అంటూ ఆదేశాలివ్వడం కష్టజీవుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. కార్మికుల పట్ల కేంద్రం ఈ వినాశకర విధానాలను విడనాడాలి. ఒక పూటే పని చేసేందుకు అనుమతించాలి. అలాగే పిల్లలు, బాలింతలు, గర్భిణుల బాగోగులను చూసే అంగన్‌వాడీ కేంద్రాల్లో పని గంటలను మధ్యాహ్నం వరకే పరిమితం చేసి ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి వారికి రక్షణ కల్పించాలి. ఎండల వల్ల ఉపాధి కోల్పోతున్న పేదలకు భృతి, రేషన్ అందజేయాలి.