Sep 27,2022 06:56

ఫాసిస్టులు ఈ విధంగా కార్మికుల మీద కురిపించే ప్రేమలో నిజాయితీ ఉండదు. వారిది పచ్చి అవకాశవాదం అన్నది విదితమే. ఒకసారి అధికారంలోకి రాగానే మొత్తం ప్లేటు ఫిరాయిస్తారు. తమ మద్దతుదారులు పాత నినాదాలనే కొనసాగిస్తే, వారి మీద కూడా చర్యలు తీసుకోడానికి వెనుకాడరు. ఇలా ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కార్చి ఫాసిస్టు శక్తులు అధికారం చేజిక్కించుకోవడమే అసలు ప్రమాదం.

కాని ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అది రష్యాలో అధికార మార్పుకు దారి తీయవచ్చునన్న పేరాశతో అమెరికా ఉంది. అమెరికా నుండి ఎంత త్వరగా యూరప్‌ విడగొట్టుకుని సంప్రదింపుల ద్వారా రష్యాతో ఒక ఒప్పందానికి వస్తే అందరికీ అంత మేలు.

క్రెయిన్‌ తో రష్యా యుద్ధానికి తలపడినందుకు ప్రతీకారంగా రష్యాపై పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు ఆంక్షలు విధించాయి. దానికి ఎదురుదాడిగా రష్యా యూరప్‌ దేశాలకు సహజవాయువు సరఫరాలను నిలిపివేసింది. రాబోయే శీతాకాలం అంతా యూరప్‌ లో ఇళ్ళలో, ఆఫీసుల్లో వెచ్చదనం కోసం అవసరమైన గ్యాస్‌ లేకపోతే చాలామంది పేదలు ఆ చలిని తట్టుకోలేని స్థితి వస్తుంది. ప్రాణనష్టం కూడా జరగవచ్చు. అంతేగాక. భారీ ఎత్తున పరిశ్రమలు కూడా మూత పడతాయి. ఆ మూసివేతల వలన నిరుద్యోగం మరింత పెరుగుతుంది. దాంతోబాటు పేదరికమూ, దుర్భర దారిద్య్రమూ కూడా కార్మికులలో పెరుగుతాయి.
         యూరప్‌ ఎదుర్కొంటున్న ఈ తక్షణ ముప్పు చాలా తీవ్రంగా ఉండబోతున్నది. అంతేకాదు. ఇప్పుడు పెట్టుబడులు యూరప్‌ నుండి అమెరికాకు తరలిపోతున్నాయి. ఈ తరలిపోయే వేగం రానున్న కాలంలో మరింత పుంజుకుంటుంది. అందువలన దీర్ఘకాలంలో యూరప్‌ ఖండంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయి. ఇటువంటి తీవ్ర ఆర్థిక దుర్భర పరిస్థితులను యూరప్‌ తనకు తాను కొనితెచ్చుకున్నవే.
         ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా అమెరికాకు విశ్వాసపాత్రంగా ఉండడం కోసం యూరప్‌ ఆర్థికంగా తానే ఆత్మహత్య చేసుకుంటోంది. జర్మనీలో గత ఎస్‌పిడి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆస్కార్‌ లాఫాంటైన్‌ (ఈయన డై లింక్‌ అనే వామపక్ష పార్టీ వ్యవస్థాపకుడు) ఉక్రెయిన్‌ యుద్ధంలో జర్మనీ అమెరికా కు పాలెగాడి మాదిరిగా వ్యవహరిస్తోందని అన్నాడు. నిస్సందేహంగా అతడు చెప్పింది కరెక్ట్‌.
          యూరప్‌ ప్రజల కష్టాలకు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రమే కారణం అన్న అభిప్రాయాన్ని ఆ ప్రజానీకానికి ఎక్కిస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేయడం ఊహకు అందనిదేమీ కాదు. కాని యూరప్‌కు గ్యాస్‌ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్‌-1 పైప్‌లైన్‌ను పుతిన్‌ మూసివేయడానికి ముందే యూరోపియన్‌ దేశాల నాయకులు రష్యన్‌ గ్యాస్‌ ను బహిష్కరించాలంటూ రోజూ ప్రకటిస్తూ వచ్చారు. మహా అయితే యూరోపియన్‌ నేతలు కోరుకున్నట్టే పుతిన్‌ వ్యవహరించాడని చెప్పవచ్చు. ఒక పక్క యూరప్‌ దేశాల నుండి అనేక ఆంక్షలను ఎదుర్కొంటూనే, ఇంకోపక్క యూరప్‌ కు గ్యాస్‌ మాత్రం రష్యా నిరంతరాయంగా సరఫరా చేస్తూ వుండాలని అనుకోవడం అసంగతం కాదా. యూరప్‌కు అవసరమైనంత మాత్రాన, ఆంక్షల నుండి గ్యాస్‌ సరఫరాను మినహాయించినంత మాత్రాన రష్యా గ్యాస్‌ సరఫరా ఎందుకు చేస్తుంది? ఇదేమన్నా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించమన్న సిద్ధాంతమా ? ఒకరి మీద ఆంక్షలు విధించడానికి పూనుకున్నవారు అవతలివైపు నుండి కూడా ప్రతీకార చర్యలు ఉంటాయని సిద్ధపడాలి. అసలు మొదట ఆంక్షల రూపంలో దాడికి తలపడిందే పశ్చిమ దేశాలు. కనుక ప్రతీకార చర్య తీసుకునే హక్కు రష్యాకు ఉండి తీరుతుంది.
         ఐతే, పుతినే అసలు నేరస్తుడని, ఏ కూటమిలో చేరాలో నిర్ణయించుకునే హక్కు ప్రతీ దేశానికీ ఉన్నట్టే ఉక్రెయిన్‌ కూ ఉంటుందని, ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని అడ్డుకునే హక్కు వేరే దేశానికి లేదని యూరప్‌ దేశాల నేతలు వాదించవచ్చు. కాని ఇదే పశ్చిమ దేశాలు సోవియట్‌ యూనియన్‌ చివరి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌ కు ఇచ్చిన హామీ మాటేమిటి? అప్పుడు నాటోను తూర్పు దిశగా విస్తరించబోము అని హామీ ఇచ్చారా? లేదా? ఆ తర్వాతనే ఉక్రెయిన్‌ లో ప్రజాబలం పొంది ఎన్నికైన ప్రభుత్వం రష్యాతో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. దానిని తప్పుబట్టిన అమెరికా ఆ ప్రభుత్వాన్ని కూలదోయడానికి 2014లో కుట్రలు పన్నింది. ఆ తర్వాత అమెరికా ఆడమన్నట్టల్లా ఆడే కొత్త ప్రభుత్వం ఉక్రెయిన్‌ లో వచ్చింది. ఆ ప్రభుత్వం ఉక్రెయిన్‌ లో రష్యన్‌ జాతి ప్రజలు అధికంగా నివసించే డాన్‌ బాస్‌ ప్రాంతం మీద యుద్ధాన్ని తలపెట్టి 14 వేలమంది రష్యన్ల ప్రాణాలు బలిగొంది. ఆ తర్వాతనే రష్యా సైనిక జోక్యం చేసుకుంది.
      భూగోళంలో 80 దేశాల్లో 800 సైనిక స్థావరాలను అమెరికా ఏర్పాటు చేసుకుంది. అమెరికా ఆధిపత్యాన్ని నిరాఘాటంగా కొనసాగించడమే దానివెనుక లక్ష్యం. పోనీ, ఇదంతా పక్కన పెడదాం. ప్రతీ దేశానికీ తనకు నచ్చిన కూటమిలో చేరడానికి, తన గడ్డమీద తనకు ఇష్టం వచ్చిన ఆయుధాలను మోహరించడానికి హక్కు ఉంది అన్నదే అమెరికా వాదన అయితే, 1962లో తన స్వంత గడ్డ మీద క్యూబా ఆయుధాలను మోహరించడానికి పూనుకున్నప్పుడు అమెరికా ఏకంగా ప్రపంచాన్నే అణుయుద్ధ ప్రమాదపు అంచు దాకా తెచ్చినంత హడావుడి ఎందుకు చేసింది ?

                                                                     ఈ కయ్యాలమారితనం వినాశకరం

అమెరికా ప్రోద్బలంతో యూరప్‌ రష్యా మీద కయ్యానికి కాలు దువ్వుతోంది. దీని .పర్యవసానాలు కేవలం ఆర్థిక వినాశనాన్ని కొనితెచ్చుకోడానికే పరిమితం కావు. రాజకీయ పరిణామాలూ అత్యంత నష్టకరంగా ఉంటాయి. యూరప్‌ దేశాలు మరింతగా మితవాదం వైపు మొగ్గడమే కాక, ఫాసిజానికి చేరువౌతాయి. కార్మికవర్గం మీద పెను భారాలు పడతాయి. సహజంగానే కార్మికవర్గం ఆ భారాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు పూనుకుంటుంది. కాని ఆ దేశాల్లోని ''ఉదార'' రాజకీయ కూటములకు ఇదేమీ పట్టదు. రష్యా నుండి గ్యాస్‌ సరఫరా నిలిచిపోయినందువలన పశ్చిమ దేశాల చమురు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి లాభాలను మూటకట్టుకునే పనిలో ఉన్నాయి (అదే విధంగా ఉక్రెయిన్‌ యుద్ధానికి సైనిక సరఫరాల ఖర్చు నిమిత్తం అమెరికన్‌ ప్రజలమీద మోపిన అదనపు పన్నులు అక్కడి ప్రజలకు భారం కాగా అక్కడి ఆయుధాల ఉత్పత్తి కంపెనీలకు బ్రహ్మాండమైన లాభాలను తెచ్చిపెడుతున్నాయి.). ఐతే యూరప్‌ లోని కొన్ని వామపక్షాలు సైతం తమ ప్రభుత్వాల కయ్యాలమారితనానికి వత్తాసు పలుకుతున్నాయి. ఇది బాధాకరం.
          ఇంకోపక్క యూరప్‌ లోని పలు ఫాసిస్టు గ్రూపులు జరగబోతున్న వినాశనం గురించి గగ్గోలు పెడుతున్నాయి. ఈ సమయంలో తాము గనుక కార్మికవర్గం మీద పడుతున్న భారాల గురించి ఆందోళనలకు దిగితే అది ఫాసిస్టు శక్తులతో తామూ గొంతు కలిపినట్టు అవుతుందన్న వాదనను అనేక వామపక్ష గ్రూపులు చేస్తున్నాయి.
        ఉదాహరణకు జర్మనీ లోని ఆఫడ్‌ అనే ఫాసిస్టు గ్రూపు ప్రభుత్వ చర్యలకు నిరసనలు తెలుపుతున్నాయి. ఐతే ఫాసిస్టులు ఈ విధంగా కార్మికుల మీద కురిపించే ప్రేమలో నిజాయితీ ఉండదు. వారిది పచ్చి అవకాశవాదం అన్నది విదితమే. ఒకసారి అధికారంలోకి రాగానే మొత్తం ప్లేటు ఫిరాయిస్తారు. తమ మద్దతుదారులు పాత నినాదాలనే కొనసాగిస్తే, వారి మీద కూడా చర్యలు తీసుకోడానికి వెనుకాడరు. ఇలా ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కార్చి ఫాసిస్టు శక్తులు అధికారం చేజిక్కించుకోవడమే అసలు ప్రమాదం.
       ఇటలీలో ఈ సెప్టెంబరు 25న జరగబోయే ఎన్నికలలో పచ్చి మితవాద ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ముస్సోలినీ పార్టీకి నేరుగా వారసులైన ఫాసిస్టులు ఆ ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ విధమైన పరిణామాలు కేవలం ఇటలీకే పరిమితం కావు. యూరప్‌ ఖండంలో జర్మనీతో సహా చాలా దేశాల్లో ఈ విధంగానే ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది.
          'డై లింక్‌' పార్టీ నాయకురాలు సారా వేజెన్‌నెట్‌ సరిగ్గా ఈ ప్రమాదం గురించే తన పార్టీని హెచ్చరించారు. ''మితవాద ఫాసిస్టు గ్రూపులు ప్రజలపై పడుతున్న భారాలను వ్యతిరేకిస్తున్నాయి గనుక, మనం అవే అంశాలపై ఆందోళనలు చేపట్టకూడదు అని, ఒకవేళ చేపడితే అది ఆ ఫాసిస్టులతో చేయి కలిపినట్టు ఔతుందని వాదించేవాళ్ళు యుద్ధం మొదలుగాక ముందే ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది.'' అని ఆమె సెప్టెంబర్‌ 18న మంత్లీ రివ్యూ (ఆన్‌ లైన్‌) లో రాశారు.
          యూరప్‌ దేశాలను, మరీ ముఖ్యంగా జర్మనీని రష్యాకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అన్నది ఆంగ్లో-అమెరికన్‌ విధానం. యూరప్‌ దేశాల లోని ప్రస్తుత నాయకత్వం ఆ విధానానికి పూర్తిగా తలొగ్గింది. గతంలో ఈ విధంగా ఉండేది కాదు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉండిన చార్లెస్‌ డి గాల్‌ తన దేశపు భూభాగం మీద నాటో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరిస్తే తమ భూభాగంపై నుండి యుద్ధం చేయాలా వద్దా అనే నిర్ణయం తమ దేశ ప్రభుత్వం చేతుల్లో ఉండదు అన్నదే ఆయన అభ్యంతరం. విల్లీ బ్రాండ్ట్‌ జర్మనీ చాన్సలర్‌గా ఉండిన కాలంలో ఆ ప్రభుత్వం తూర్పుయూరప్‌ దేశాలతో (అప్పటికి అవి సోషలిస్టు దేశాలు) స్నేహ సంబంధాలను పెంపొందించసాగింది. అమెరికా కనుసన్నల్లో మెలగడం కాకుండా స్వతంత్ర విధానం కలిగివుండాలన్నదే ఆయన అభిలాష.
           అటువంటి స్వతంత్రతను ప్రస్తుత యూరోపియన్‌ నేతలు ప్రదర్శించలేకపోతున్నారు. ఆ నాయకులు సమర్ధులు కాకపోవడమే దీనికి కారణం అని కొందరు విశ్లేషిస్తున్నారు. యుద్ధం వలన నేరుగా లాభాలు పోగేసుకుంటున్న కార్పొరేట్లతో ఈ నాయకులు కుమ్మక్కు అయినందువలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న వాదన కూడా ఉంది. వీరిలో కొందరికి అమెరికన్‌ ఆర్థిక, ఆయుధ తయారీ కార్పొరేట్లతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి (జర్మనీ లోని సిడియు అనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మాజీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఈ పార్టీ వ్యక్తే. ఆ పార్టీ కి ప్రస్తుత నేతగా ఉన్న ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అమెరికన్‌ ఫైనాన్స్‌ రంగపు కార్పొరేట్‌ సంస్థ 'బ్లాక్‌రాక్‌' లో ఉద్యోగిగా గతంలో పని చేశాడు.)
       ఏదేమైనా ప్రస్తుతం యూరప్‌ లో జరుగుతున్న పరిణామాలు మొదటి ప్రపంచయుద్ధం మొదలవబోయే ముందు ఉండిన పరిస్థితులను తలపిస్తున్నాయి. ప్రజల నుండి పూర్తిగా వేరుపడిపోయిన ప్రభుత్వాలు ఆ ప్రజలను అప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే త్యాగాలు చేయాలని పిలుపులనిచ్చాయి. ఆ ప్రజల దృష్టిలో మాత్రం ఆ పిలుపులకు ఎటువంటి హేతుబద్ధతా లేదు.
ఏకధృవ ప్రపంచాన్ని, అందులో తమ ఆధిపత్యాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే యావతో పశ్చిమ దేశాల నయా ఉదారవాద కార్పొరేట్ల సంతృప్తి కోసం రష్యాతో ఘర్షణకు తలపడుతున్నాయి ఈ దేశాలు. అందుకే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి సంప్రదింపుల ద్వారా పరిష్కారం సాధించాలన్న ప్రయత్నాలను ముందుకు సాగనివ్వడం లేదు. ఒక దశలో ఫ్రాన్స్‌, జర్మనీ మద్దతుతో జరిగిన మిన్స్క్‌ ఒప్పందాన్ని బ్రిటన్‌, అమెరికా చెడగొట్టాయి. ఇప్పటికీ ఆ మిన్స్క్‌ ఒప్పందం ప్రాతిపదికన సంప్రదింపుల ద్వారా పరిష్కారం సాధించవచ్చునని ఆస్కార్‌ లాఫాంటైన్‌ వంటి నేతలు భావిస్తున్నారు. వెంటనే కాల్పుల విరమణ పాటించి సంప్రదింపులు ప్రారంభిస్తే వినాశనాన్ని నివారించవచ్చు. కాని ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అది రష్యాలో అధికార మార్పుకు దారి తీయవచ్చునన్న పేరాశతో అమెరికా ఉంది. పుతిన్‌ కు తన స్వంత పార్టీ నుండే తిరుగుబాటు ఎదురౌతుందన్న ఆశతో (అటువంటి ప్రయత్నాలకు ''వెలుపల'' నుండి ఎటూ ప్రోద్బలం ఉంటుందనుకోండి) అమెరికా ఉంది. అమెరికా నుండి ఎంత త్వరగా యూరప్‌ విడగొట్టుకుని సంప్రదింపుల ద్వారా రష్యాతో ఒక ఒప్పందానికి వస్తే అందరికీ అంత మేలు.

(స్వేచ్ఛానువాదం)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌