
ప్రకృతిలో మనిషి ఒక భాగం. దేశంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పర్యావరణ ప్రాముఖ్యతను చర్చించుకోవడం సర్వసాధారణం అయింది. చెట్లను కాపాడడం, ప్లాస్టిక్‌ను నిరోధించడం, వాయు కాలుష్యం, జల కాలుష్యంను నిలువరించడం వంటి పర్యావరణ అంశాలపై చాలా చర్చ జరుగుతుంది. కానీ ఈ చర్చలు నిజ జీవితంలో అమలు కావడం లేదు. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని నిలవరించ లేక పోతున్నాం. చట్టాలతో సాధించలేనిది చదువుతో సాధించవచ్చని అనేక సందర్భాలలో నిరూపించబడింది. పర్యావరణ విద్య ద్వారా పర్యావరణ పరిరక్షణ జరిగే అవకాశముంది.
మెహతా అనే న్యాయవాది పర్యావరణ విద్య అమలుకై భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (డబ్ల్యు.పి నంబర్ 860/1991)పై తీర్పునిస్తూ... పర్యావరణ విద్యను అన్ని శాఖలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో తప్పనిసరిగా అమలు చేయాలని (6.12.1999న) పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటీఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఈ. ఆర్.టి)లను ఆదేశించింది కూడా. ఈ తీర్పుకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003-2004 విద్యా సంవత్సరం నుండి పర్యావరణ శాస్త్రాన్ని అన్ని శాఖలకు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో పాఠ్యాంశంగా అమలు చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా పర్యావరణ శాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చారు. కానీ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఉన్నత విద్యాస్థాయి వరకు పర్యావరణ శాస్త్రాన్ని అమలు చేస్తున్న తీరు విద్యార్థులకు పర్యావరణ శాస్త్రంపై ఒక నిర్లిప్త వైఖరి పెంపొందించే విధంగా ఉన్నది. ఈ పాఠ్యాంశం అమలు చేసిన మొదట్లో క్రెడిట్లు లేకపోవటం వలన విద్యార్థులు దీనిపై అంతగా శ్రద్ధ చూపేవారు కాదు. ఇది గమనించిన విశ్వవిద్యాలయాలు పర్యావరణ శాస్త్రానికి కూడా క్రెడిట్లు ఇచ్చాయి. 2018లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రతిపాదించిన పాఠ్య ప్రణాళికలో పర్యావరణ శాస్త్రానికి క్రెడిట్లు తిరిగి తొలగించడం జరిగింది. కాబట్టి ఈ పాఠ్యాంశం అమలు విద్యా సంస్థల్లో అంత ప్రభావవంతంగా అమలు కావడం లేదు. విద్యాసంస్థల్లో పర్యావరణ శాస్త్రానికి సంబంధం లేని ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించడం, సరైన పరీక్షా విధానాన్ని పాటించకపోవడం... వీటికి తోడు క్రెడిట్లు కూడా లేకపోవడం వలన పర్యావరణ శాస్త్రం ఒక మొక్కుబడి చదువుగా మారిపోయింది.
పర్యావరణ శాస్త్రం ఆవశ్యకత
పర్యావరణ శాస్త్రం వివిధ పాఠ్యాంశాల కలయిక. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, వాతావరణ శాస్త్రం, భౌగోళిక శాస్త్రాలకు సంబంధించిన విజ్ఞానం పర్యావరణ శాస్త్రంలో ఉంటుంది. మనిషి భూమిపై మనుగడ సాగించాలంటే తను చుట్టూ ఉన్న పరిసరాల గురించి, ప్రకృతి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలన్నీ మానవుడు సృష్టించినవే. పర్యావరణంపై అవగాహనా రాహిత్యంతో మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ విద్య పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని పెంపొందిస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పర్యావరణ అనుకూల జీవన విధానం మంచి ఆరోగ్యానికి సోపానం.
పర్యావరణ పరిజ్ఞానం లేకుండా స్వచ్ఛభారత్ ఎలా ?
మన చుట్టూ ఉండే పరిసరాలు మన జీవన విధానాన్ని, మన ఆలోచనా విధానాన్ని తెలియజేస్తాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ పర్యావరణ పరిజ్ఞానం లేకుండా స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు విజయవంతం కావు. ఈ కారణం చేతనే స్వచ్ఛభారత్‌పై వేల కోట్ల ధనం వెచ్చించినప్పటికీ విజయవంతం కాలేదు. ధనం వృధా అయింది తప్ప ఫలితం సాధించలేదు. ప్రజల ఆలోచనా విధానం మారినప్పుడే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. పర్యావరణ విద్య ద్వారా విద్యార్థులలో తద్వారా సమాజంలో పర్యావరణ అనుకూల ఆలోచనా విధానం పెంపొందే అవకాశం ఉంది. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు పర్యావరణ శాస్త్రాన్ని ఇతర పాఠ్యాంశాలతో సమానంగా అమలు చేసినట్లైతే పర్యావరణ పరిరక్షణ జరిగే అవకాశముంది.
- డా|| శ్రీదరాల రాము,
సెల్: 9441184667