- వెయ్యి మంది పైగా మృతి - వందలాది మందికి గాయాలు
- ఐక్యరాజ్యసమితి, జి20 దేశాధినేతల దిగ్భ్రాంతి
రాబట్ : ఉత్తరాఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన పెను భూకంపంలో వెయ్యి మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 600 మంది పైగా గాయపడ్డారు. నివాసాలు నేలమట్టం కావడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. భూకంప కేంద్రానికి సమీపంలోని మర్రాకేచ్ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఎటుచూసినా నేలమట్టమైన భవనాల శిథిలాలు, వాటి కింద నలిగిపోయి ప్రాణాలదిలినవారి మృతదేహాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతటా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దారుణ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహావిలయంలో ప్రాణాలు కోల్పోయినవారికి ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో మొరాకో ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వంతో కలిసిపనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జి20 శిఖరాగ్ర సదస్సు కూడా మొరాకో భూకంపం పట్ల దిగ్భ్రాంతి ప్రకటించింది. విపత్కాలంలో ప్రపంచ దేశాలన్నీ మొరాకో ప్రజలతోనే ఉన్నారని ఈ సదస్సు ప్రారంభానికి ముందు జి20కి ఆతిథ్యమిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మొరాకోలో శుక్రవారం రాత్రి 11.11 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత సుమారు 20 నిమిషాలకు మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మర్రాకేచ్ నగరానికి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాలలో గాఢాంధకారం అలముకొంది. కోస్తా ప్రాంతంలోని రాబట్, కసబ్‌లన్సా, ఎస్సావోయురా నగరాలలో కూడా భూమి కంపించింది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మర్రాకేచ్ నగరంలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. రెస్టారెంట్ల నుండి పర్యాటకులను ఖాళీ చేయించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. నగరంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం, కొన్ని ఇతర భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు, కుప్పకూలిన భవనాల శిథిలాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానక వాతావరణం కన్పిస్తోంది. కొన్ని భవంతులు కూలకపోయినా వాటికి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాలలో మహిళలు, చిన్నారులు సహా ప్రజలు రాత్రంతా రోడ్ల పైనే బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో కాలక్షేపం చేశారు. కొన్ని చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయేమోనన్న అనుమానంతో ప్రజలు తిరిగి తమ నివాసాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఇప్పటి వరకూ ఇలాంటి భారీ భూకంపం సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది. 'భూమి కంపిస్తోన్న సమయంలో నిద్రలో ఉన్నాం. గాల్లోకి ఎగిరిపోతున్నట్టు మాకు అనిపించింది. దాంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకుపరిగెత్తాము. మా ప్రాంతమంతా ఏడుపులు, కేకలతో నిండిపోయింది' అని మర్రాకేశ్ స్థానికులు వాపోయారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆస్పత్రులు కిక్కిరిసి పోయాయి. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలోనూ కనిపించింది. అయితే, అక్కడ ఎలాంటి నష్టం సంభవించలేదు. 1980లో అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 2500 మంది మరణించగా.. 3 లక్షల మంది నిరాశ్రయలుగా మారారు. ఈ ఏడాది తుర్కియే సైతం ప్రకృతి ప్రకోపానికి గురైన సంగతి తెలిసిందే. దాంతో వేలల్లో మరణాలు సంభవించాయి.
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023