Feb 14,2023 07:38

''అదో కొత్త ఆసుపత్రి. అదేమీ ధర్మాసుపత్రి కాదు. పైసలు తీసుకునే ఆసుపత్రీ కాదు. అందులో ఒక ప్రత్యేక విభాగం ఉంది. దాని గురించికూడా చెబుతా''
''మరి ఎలాంటి ఆసుపత్రి చెప్పు''
''చెప్తా చెప్తా...అన్నీ చెప్తా వినడానికి చెవులున్నాయా... ''
''ఉన్నారు''
''చూడడానికి కళ్లున్నాయా....''
''ఉన్నారు''
''చెప్పడానికి నోరుందా....''
''ఉంది''
''అన్నీ సరిగ్గా ఉన్నాయా...''
''ఉన్నాయి''
''అన్నీ పని చేస్తున్నాయా''
''చేస్తున్నాయి''
''మరి దేశంలో జరిగేవన్నీ చూస్తున్నావా, వింటున్నావా, వాటి గురించి మాట్లాడుతున్నావా''
''లేదు''
''ఎందుకని?''
''ఎందుకనంటే మరి.....''
''చెప్పు ఎందుకని?''
''ఎందుకంటే దేశభక్తి మరి!!''
సరే ఆ ఆసుపత్రిని చూద్దామని పోతే ఒక్కో రూముకు ఒక్కో పేరుంది. అన్నీ మామూలుగా చూసేవే అవి. ఇంకా పోతూ పోతూ ఉంటే కనిపించింది ఒక డిపార్టుమెంటు. చెవి, కన్ను, నోరు శాఖ అని. మామూలుగా చెవి, ముక్కు, గొంతు కదా ఉండాల్సింది, ఇదేమిటి ఇలా ఉంది. ఏమో ఇదో కొత్త శాఖనేమో. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కొత్తగా ప్రవేశ పెట్టారేమో? ఐనా ఎవరినైనా అడిగితే పోలా అనుకుంటూ అక్కడ ఓ పెద్దాయన కనిపిస్తే అడిగా ''ఈ శాఖ ఎప్పటినుండి మొదలు పెట్టారూ'' అని.
''ఈరోజే మొదలు బాబూ'' అన్నాడు.
''ఎందుకు...'' అని అడిగా
''చూడు బాబూ మనిషికి చెవి, కన్ను ఉండేది బాగా వినమని, బాగా చూడమని. అందుకే అవి రెండు రెండు ఉంటాయి. నోరు మాత్రం ఒక్కటే, తక్కువ మాట్లాడమని. ఇది మా సారు చిన్నప్పుడు క్లాసులో చెప్పింది''
''అవును మా టీచరమ్మ కూడా చెప్పింది'' నేనూ నా టీచర్‌ గురించి చెప్పుకోవాలి కదా
''కదా..... మరి నేడు జరుగుతున్నది ఏమిటి?''
''అందరూ బాగా వింటున్నారు, చూస్తున్నారు కదా?!''
''చూడ్డమంటే ఊరికే చూడడం కాదు బాబూ''
''మరి......?''
''ఏమి జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో చూస్తున్నారా?''
''ఇప్పుడే కొద్దిగా అర్థమవుతోంది, మీరే చెప్పండి క్లియరుగా......''
''చెబుతా బాబూ. చెప్పడమే కాదు ఈ దవాఖానాలో కొత్తగా పెట్టిన ఈ శాఖలో కూడా అదే చేయబోతున్నా''
''ఏది...?''
''చెవితో సరిగ్గా వినడం ఎట్లా, ఎవరు చెప్పింది బాగా వినాలి, ఏది మెదడుకు పంపాలి, ఏది ఇంకో చెవి లోంచి వదిలేయాలి. పనిగట్టుకొని కొందరు పొద్దున లేచినప్పటి నుండి చెప్పే విషయాలను ఎలా వినాలి అన్నవి చెవికి సంబంధించి. ఇక కన్ను... రోజూ పేపర్లలో, టీవీల్లో, వాట్సప్పుల్లాంటి ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెట్టే వార్తలు, దేశభక్తి సందేశాలు చదివి వాటిలో నిజమైనది ఏది అన్న విషయాన్ని కంటితో చూడడమే కాదు ఎలా అన్వయించుకోవాలో చెబుతాం. ఇక ముఖ్యమైనది నోరు. ఊరకే నోరుంది కదా అని మాట్లాడడం ఎంత తప్పో, అవసరమైనప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. అదే ఇక్కడ చేస్తాం''.
''మీరు వినిందే నిజమని, మీరు చదివిందే నిజమని, మీరు మాట్లాడిందే నిజమని మేమెందుకు అనుకోవాలి?''
''అసలైన పాయింటుకే వచ్చావు. అది నేర్పడానికే ఈ ప్రయత్నం. అలా ఎందుకు చేస్తున్నారో చూపాలన్నదే మా తాపత్రయం. మేము చెప్పేవే కాదు...ఇతరులు చెప్పేవీ బాగా వినమంటున్నాం, అలాగే చూసేవి, చదివేవి కూడా ''.
''ఐతే ఎవరివైపూ ఉండరన్నమాట''
''ప్రజలవైపు ఉందామనే కదా ప్రయత్నమంతా. కృష్ణుడు కుచేలుడిని చేరదీసే రోజులు పోయాయి. కుబేరుడికి షేక్‌ హ్యాండిచ్చే రోజులు, కుబేరుడిని ఆలింగనం చేసుకొనే రోజులు, అతడి ఆస్తులను కాపాడే రోజులొచ్చాయి. ఆ విషయాన్నే చూసేటట్టు, వినేటట్టు, మాట్లాడేటట్లు చేస్తాం ఈ ఆసుపత్రిలోని ఈ విభాగంలో......''
''ప్రొసీడ్‌ సార్‌ ప్రొసీడ్‌ . గాంధీ గారి మూడు కోతుల కథను తారుమారు చేయండి''.

- జంధ్యాల రఘుబాబు
సెల్‌ : 9849753298