Jun 08,2022 06:52

బిజెపి ప్రభుత్వం తన ఎనిమిదేళ్ళ పాలనలో ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ ఎజెండాకు అనుగుణంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు తీరికలేకుండా పని చేసిందనేది ఇక్కడ కీలకమైన వాస్తవం. ఇందుకు గాను, ప్రసుత్తమున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ పాత్ర, సివిల్‌ సర్వీసులు, మీడియా... అన్నింటినీ మారుస్తూ, నిరంకుశ ప్రభుత్వానికి సేవ చేసేలా వాటిని తయారు చేస్తున్నారు. హిందూత్వ-కార్పొరేట్‌ కూటమికి వెన్నుదన్నుగా వుండేలా మొత్తంగా ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నారు. దాంతో నియంతృత్వ పోకడలకు మరింతగా ఆజ్యం పోసినట్లవుతోంది.

మోడీ ప్రభుత్వ ఎనిమిదేళ్ళ పాలనను పురస్కరించుకుని బిజెపి పక్షం రోజుల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆహార ధాన్యాల ఉత్పత్తి, సామాజిక సంక్షేమ పథకాలు, విదేశాంగ విధానం వంటి విషయాల్లో ప్రభుత్వం సాధించిన వివిధ విజయాలను ప్రముఖంగా ప్రస్తావించేలా ఈ ప్రచారం వుంటోంది. ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అవిశ్రాంతంగా చేసిన కృషి, చేపట్టిన చొరవ వల్లనే సాధ్యమయ్యాయని చెబుతున్నారు.
     అయితే, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు, రాజ్యాంగ వ్యవస్థను పటిష్టపరిచేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కానీ, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నట్లుగా సామాజిక, ఆర్థిక న్యాయానికి హామీ కల్పించే చర్యలు కానీ...ఇంత విస్తృతంగా పేర్కొంటున్న మోడీ విజయాల జాబితాలో లేవు.
    గత ఎనిమిదేళ్ళలో మోడీ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగానికి తీవ్ర హాని, నష్టం కలిగించే పలు చర్యలు తీసుకుంది. అందువల్ల ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని విస్మరించారు.
    పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కుదించడానికి, పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్లో కోత విధించడానికి, రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించే అన్ని సంస్థలను ధ్వంసం చేయడానికి మోడీ ప్రభుత్వం తన ఎనిమిదేళ్ళ పాలనలో ఒక పద్ధతి ప్రకారం అనేక చర్యలు తీసుకుంది. పార్లమెంట్‌ విలువ తగ్గించడం, పార్లమెంటరీ పద్ధతులను, ప్రక్రియను దిగజార్చడం వంటివి మోడీ ప్రభుత్వ రెండో దఫా పాలనా కాలంలో చాలా ఎక్కువగా, తీవ్రంగా చోటు చేసుకున్నాయి. గతేడాది పార్లమెంట్‌ 50 రోజులు కూడా సమావేశం కాలేదు. చట్టాలపై సరైన చర్చ లేకపోవడంతో పాటు శాసన బిల్లులపై కూడా సరైన తనిఖీ లేదు. యుపిఎ ప్రభుత్వ హయాంలో లోక్‌సభ 60 నుండి 70 శాతం వరకు బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించగా, మోడీ తొలిసారిగా పదవి చేపట్టినప్పుడు ఈ సంఖ్య 27 శాతానికి తగ్గిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకయితే కేవలం 13 శాతం బిల్లులు మాత్రమే స్థాయీ సంఘాలకు నివేదించబడ్డాయి. పైగా, దీనికి తోడు సమస్యలను లేవదీసేందుకు, లెజిస్లేటివ్‌ క్రమంలో ఓటింగ్‌కు పట్టుబట్టేందుకు ప్రతిపక్షానికి గల హక్కును తిరస్కరిస్తూ వచ్చారు. మూడు వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ద్వారా ఆమోదం పొందిన తీరు ఇందుకు ప్రధాన ఉదాహరణగా వుంది.
   పార్లమెంట్‌ పరిమితులకు లోబడి వ్యవహరిస్తూ, సభ్యుల హక్కులు కాలరాస్తుండడంతో మొత్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటోంది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలను నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్‌ దానికదే అడ్డుకట్ట వేసుకుంటోంది. తరచుగా ప్రభుత్వ ఆకాంక్షలకు తగినట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఎలక్టొరల్‌ బాండ్లు అనే సాధనం చట్టబద్ధమైన ముడుపుగా మారింది. వీటి ద్వారా పాలక పార్టీకి క్రమం తప్పకుండా నిధులు అందుతూ వుంటాయి. మరోపక్క ప్రతిపక్షాలకు నిధుల లేమి ఎదురవుతూ వుంటుంది.
     ప్రతిపక్ష పార్టీలపై దాడి ఇప్పుడు కేంద్ర అధికార సంస్థల ద్వారా జరుగుతోంది ప్రతిపక్ష పార్టీల నేతలు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి), ఆదాయ పన్ను శాఖల లక్ష్యాలుగా మారుతున్నారు. వారిపై కేసులు దాఖలు చేస్తారు. వారిలో కొందరిని అరెస్టు చేస్తారు. జైలుకు కూడా పంపుతారు. ప్రస్తుతం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి... 'ఆప్‌' నేత, మహారాష్ట్రలో ఎన్‌సిపి మంత్రి ఇ.డి దాఖలు చేసిన కేసులకు సంబంధించి కస్టడీలో వున్నారు. డజన్ల సంఖ్యలో ప్రతిపక్ష నేతలు సిబిఐ, ఇ.డి దర్యాప్తులను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఈ కేంద్ర సంస్థలను మోడీ సర్కార్‌ దారుణంగా ఉపయోగించుకుంటోంది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని విచారించేందుకు ఇ.డి సమన్లు జారీ చేసింది.
    చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, దేశద్రోహం వంటి నిరంకుశ చట్టాలను ఉపయోగించడం ద్వారా అసమ్మతిని నేరపూరితం చేయడం, పౌరహక్కులను అణచివేయడం వంటివి అనూహ్య రీతుల్లో పెరిగిపోయాయి. 2014, 2020 మధ్య ఏడేళ్ళ కాలంలో యుఎపిఎ (ఉపా) కింద దాదాపు 690 కేసులు నమోదయ్యాయి. ఉపా కింద 10,552 మంది అరెస్టయ్యారు. వీరిలో రాజకీయ కార్యకర్తలు, పౌర హక్కుల న్యాయవాదులు, జర్నలిస్టులు, రచయితలు వున్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 124ఎ లోని దేశద్రోహ నిబంధనను కూడా ఒక ఆయుధంగా మలుచుకుని ప్రభుత్వాన్ని విమర్శించే వారి వాణిని అణచివేసేందుకు ఉపయోగిస్తున్నారు. 2014 నుండి 2021 వరకు 450కి పైగా దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.
    మీడియా ఎలాంటి స్వతంత్ర పాత్ర పోషించకుండా అడ్డుకునేందుకు బెదిరింపులకు, బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారు. జర్నలిస్టులపై అణచివేత చర్యలకు దిగడంతో పాటుగా, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ కొన్ని మీడియా యజమానులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక వాటిపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తాయి. కార్పొరేట్‌ మీడియాలో సింహ భాగం ఇప్పుడు ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా మారి వారికి చీర్‌ లీడర్లుగా వ్యవహరిస్తున్నది.
    మోడీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఫెడరల్‌ కోణాన్ని పూర్తిగా నులిమివేస్తోంది. రాష్ట్రాల హక్కులను, ఆర్థిక రంగంలో, ఉమ్మడి, రాష్ట్రాల జాబితాల్లో పేర్కొన్న అంశాలను కేంద్రం నెమ్మదిగా ఆక్రమించుకుంటోంది. కేంద్రం నియమించే గవర్నర్లు పాలక పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. కొన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలను కూడా అడ్డుకుంటున్నారు.
     ప్రజాస్వామ్యం బదులుగా మెజారిటీవాద పాలనను ప్రవేశ పెట్టడానికి చూస్తున్నారు. చట్ట సభల్లో మెజారిటీని ఉపయోగించుకుని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు, గో వధ నిషేధ బిల్లు వంటి అన్ని రకాల చట్టాలను తీసుకు వస్తున్నారు. కేంద్ర స్థాయిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఈ చట్టాలన్నీ కూడా మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నవే. వారి మౌలిక హక్కులను హరించేలానే వున్నాయి. హిందూత్వ సంస్థలు కింది స్థాయిలో మైనారిటీలపై పాల్పడే దాడులను చట్టబద్ధంగా మాఫీ చేయడానికి ఇటువంటి చట్టాలు ఉపయోగపడతాయి.
మోడీ ప్రభుత్వ ఎనిమిదేళ్ళ పాలనను చర్చించే సమయంలో, ప్రజాస్వామ్యానికి తలెత్తుతున్న ఈ ముప్పులేవీ కూడా ప్రభుత్వ కార్యాచరణలో భాగం కాదని పేర్కొనడం నిరంకుశ పాలన పట్టు పెరిగిందనడానికి ఒక సంకేతం. ప్రముఖ వార్తా పత్రికల సంపాదకీయాలు ప్రభుత్వ ఎనిమిదేళ్ళ కాలంలోని సానుకూల చర్యలు-లోపాలు, లొసుగుల మధ్య సమ తూకాన్ని చెప్పే ప్రయత్నం చేశాయి. ఇవి, ప్రభుత్వ సాధారణ కార్యకలాపాలే అయినట్లతే వీటిని అంచనా వేయవచ్చు. కానీ, భారతదేశాన్ని హిందూత్వ నియంతృత్వ దేశంగా మార్చాలన్న సుదూర ప్రాజెక్టు వాస్తవికతను దృష్టిలో వుంచుకుంటే దీన్ని నిర్ద్వంద్వంగా నివారించాల్సి వుంది.
      బిజెపి ప్రభుత్వం తన ఎనిమిదేళ్ళ పాలనలో ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ ఎజెండాకు అనుగుణంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు తీరికలేకుండా పని చేసిందనేది ఇక్కడ కీలకమైన వాస్తవం. ఇందుకు గాను, ప్రసుత్తమున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ పాత్ర, సివిల్‌ సర్వీసులు, మీడియా...అన్నింటినీ మారుస్తూ నిరంకుశ ప్రభుత్వానికి సేవ చేసేలా వాటిని తయారు చేస్తున్నారు. హిందూత్వ-కార్పొరేట్‌ కూటమికి వెన్నుదన్నుగా వుండేలా మొత్తంగా ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నారు. దాంతో నియంతృత్వ పోకడలకు మరింతగా ఆజ్యం పోసినట్టవుతోంది.
మోడీ ప్రభుత్వ ఎనిమిదేళ్ళ పాలన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా వుందంటే... అది, ప్రజాస్వామ్యం, ప్రజల మౌలిక ఆర్థిక, సామాజిక, పౌర హక్కులు ...పాలక వర్గం నుండి పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయనే.

/ 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం /