
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు పరస్పర విరుద్ధమైన రాజకీయాలు, ప్రయోజనాలను కలిగి వుండడం సహజమే. వారికి ఒకరిపై ఒకరు పోటీ పడే స్వేచ్ఛ వుంటుంది. కానీ, మోడీ ప్రభుత్వ నిరంకుశ-ఫాసిస్ట్ తరహా దాడి ప్రతిపక్షాలన్నిటిపైనా జరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర హక్కులను కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు తమ మధ్య వున్న అభిప్రాయ బేధాలను పక్కనబెట్టి వ్యవహరించాల్సి వుంటుంది. ఇది మినహా మరే వైఖరి తీసుకున్నా అది ఆత్మవంచనే అవుతుంది.
ప్రతిపక్షాలపై మోడీ ప్రభుత్వం కొత్త రకమైన దాడిని ప్రారంభించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) కార్యకలాపాలు పెచ్చరిల్లాయి. గత రెండు వారాల్లో ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రశ్నించడానికి సిబిఐ సమన్లు జారీ చేసి, అరెస్టు చేసింది. అలా జైల్లో వుండగానే, ఇ.డి మళ్ళీ అయనను అరెస్టు చేసింది. ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవిని కూడా సిబిఐ ప్రశ్నించింది. ఆ తర్వాత ఉద్యోగాలకు భూమి కుంభకోణంలో లాలూ ప్రసాద్‌ను కూడా ఢిల్లీలో ప్రశ్నించింది. ఈ కుంభకోణం దాదాపు దశాబ్దం కిందట జరిగిందని భావిస్తున్నారు. సిబిఐ చర్యలను తర్వాత కాలంలో ఇ.డి అనుసరించింది. ఢిల్లీలో తేజస్వి యాదవ్ నివాసం పైన, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళపైన మొత్తంగా 24 చోట్ల దాడులు జరిగాయి. సిబిఐ దర్యాప్తు నివేదికను దాఖలు చేసింది. దాని ఆధారంగా ఇ.డి రంగంలోకి దిగి మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని (పిఎంఎల్‌ఎ) అమలు చేసింది. పిఎంఎల్‌ఎ నిబంధనలు అత్యంత నిరంకుశంగా వున్నాయి. అరెస్టు చేయడానికి, సోదాలు జరిపి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, జైల్లో పెట్టడానికి, బెయిల్ మంజూరు కూడా కష్టమయ్యే రీతిలో ఇ.డి కి అధికారాలను కట్టబెట్టాయి.
మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ముఖ్యంగా ఇ.డి ని ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఆయుధంగా మార్చుకుంది. ఇ.డి, సిబిఐ లను ఆయుధాలుగా ఉపయోగించడం రాజకీయంగా దురుద్దేశపూరితమైన చర్య. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకవైపు, ప్రతిపక్షాలను అణచివేయడానికి దీన్ని ఉపయోగించుకుంటోంది. కీలక నేతలను ఎలాంటి విచారణలు జరపకుండా సుదీర్ఘకాలం పాటు జైళ్లలో మగ్గేలా చేయడానికి ఉపయోగపడుతోంది. ఈ ప్రక్రియే పెద్ద శిక్షలా మారుతోంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలను చీల్చాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇ.డి ని ఉపయోగించుకుంటోంది. సిబిఐ-ఇ.డి ల ద్వారా బెదిరింపులకు పాల్పడి ఎంపిక చేసుకున్న కొద్దిమంది నేతలు బిజెపిలో చేరేలా చూస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో, ఢిల్లీలో ఆప్‌ను రాజకీయంగా ఓడించడం కష్టమని తేలడంతో బిజెపి ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఆప్ మారింది. 2022 డిసెంబరులో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయం ఇందుకు ఉదాహరణ. ఆప్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీ లాండరింగ్ అభియోగాలపై 2022 మేలో అరెస్టు చేశారు. 9 నెలలైనా ఆయన ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. ఇక ఆప్ కీలక నేత, మరో మంత్రి మనీష్ సిసోడియా లిక్కర్ కుంభకోణంలో జైలు పాలయ్యారు. సిబిఐ అరెస్టుతో పాటు ఇ.డి కూడా అరెస్టు చేయడంతో ఆయనకు బెయిల్ రావడం మరింత కష్టమైంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి వున్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో పుంజుకోవాలన్న లక్ష్యంతో బిజెపి పని చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ నేత కెసిఆర్ కుమార్తె కె.కవితకు ఢిల్లీ లోని లిక్కర్ కుంభకోణంతో సంబంధమున్న ఆరోపణలపై ఇ.డి సమన్లు జారీ చేసింది. తన ఎన్నికల ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను బిజెపి ఎలా ఉపయోగించుకుంటోందనేది ఈ చర్య ద్వారా మరింత స్పష్టమవుతోంది.
ఇక బీహార్ విషయానికి వస్తే, లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై ఎన్నో ఏళ్ళనాటి పాత కేసును తిరగదోడడానికి, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సంబంధం వుంది. బీహార్‌లో బిజెపిని ఒంటరిని చేసి నితీష్ కుమార్, జెడి(యు) మహాగట్‌బంధన్‌లో చేరడం బిజెపికి ఆగ్రహం తెప్పించింది. దాంతో అవినీతి మిషతో కేంద్ర సంస్థలను ప్రయోగించి మహాగట్‌బంధన్ కూటమిని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది.
కేంద్ర సంస్థలను ఇతర ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా కూడా బిజెపి లాభపడుతోంది. వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై ఒత్తిడి తెచ్చి లేదా వారిని ప్రలోభ పెట్టి ఆయా పార్టీల నుండి ఫిరాయించి బిజెపిలో చేరేలా చూస్తోంది. అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్ పార్టీలో వుండగా శారదా కుంభకోణంలో సిబిఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు. కానీ బిజెపిలో చేరిన తర్వాత, ఆయనపై ఇంక తదుపరి చర్యలే లేకుండా పోవడం దీనికి ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపి లోకి ఫిరాయించారు. మహారాష్ట్రలో నారాయణ రాణె కూడా అంతే.
శివసేనలో చీలిక కారణంగా మహారాష్ట్రలో ఎంవిఎ ప్రభుత్వం కుప్పకూలడానికి కూడా పాక్షికంగా అదే కారణమని చెప్పవచ్చు. ఇ.డి ఒక పద్ధతి ప్రకారం చేపట్టిన చర్యల వల్లనే ఆ పరిణామాలు సంభవించాయి. శివసేన ఎంఎల్‌ఎలు ప్రతాప్ సర్‌నాయక్, యామిని జాదవ్, ఎం.పి భావనా గవాలి, తదితరులు ఏక్‌నాథ్ షిండే గ్రూపులో చేరేలా ప్రోత్సహించారు. వారిపై ఇ.డి కేసులు దాఖలు చేయడం, వారి ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలకు పాల్పడడంతో ఇక వారికి తప్పలేదు.
కర్ణాటకలో ఇటీవల నమోదైన అవినీతి కేసు...కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి, ఏకపక్ష స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ. బిజెపి ప్రభుత్వ హయాంలో, పాలక పార్టీ ఎంఎల్‌ఎ కుమారుడు ప్రశాంత్ మదల్ లంచం తీసుకుంటున్నందుకు గాను విజిలెన్స్ విభాగ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తంగా, పార్టీ కార్యాలయం నుండి, ఆయన నివాసం నుండి రూ. 6.73 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంఎల్‌ఎ మదల్ విరూపాక్ష ఛైర్మన్‌గా వున్న కార్పొరేషన్ నుండి పనులు చేసిపెట్టేందుకు ఈ ముడుపులు అందుకున్నారు. ఆశ్చర్యకరంగా, 24 గంటల వ్యవధిలో, ఎంఎల్‌ఎకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే గనుక ప్రతిపక్ష పార్టీ నేత అయినట్లైతే సిబిఐ, ఇ.డి లు వెంటనే రంగం లోకి దిగి చర్యలు తీసుకుని వుండేవి.
రాజకీయ నేతలపై ఇ.డి దాఖలు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నేతలపై, ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై నమోదు చేసినవే. మిగిలిన 5 శాతం కేసులనైనా ఎప్పటికైనా శ్రద్ధగా విచారిస్తారా లేదా అనేది చూడాల్సి వుంది.
నిరంకుశ ప్రభుత్వానికి ఇ.డి ఒక బలమైన సాధనంగా మారింది. 2020లో పిఎంఎల్‌ఎకి చేసిన సవరణలు వ్యక్తులను అరెస్టు చేయడానికి, సోదాలు చేపట్టడానికి, ఆస్తులను స్వాధీనం చేసుకుని, జప్తు చేయడానికి విస్తృతాధికారాలు కట్టబెట్టాయి. దురదృష్టవశాత్తూ జస్టిస్ ఎం.ఎం.ఖాన్‌విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2022 జులైలో ఈ సవరణలను సమర్ధించింది. ఎఫ్‌ఐఆర్ తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ను ప్రతి కేసు లోనూ సంబంధిత వ్యక్తికి తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదన్న నిబంధన కూడా ఆమోదించిన సవరణల్లో వుంది.
దీనితో సంతృప్తి చెందకుండా, గత వారంలోనే మార్చి 7వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవిన్యూ విభాగం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఉన్నత పదవులలో వున్న రాజకీయ నేతలు (పిఇపి), ఎన్‌జిఓలను కూడా పిఎంఎల్‌ఎ పరిధి లోకి తీసుకురావాలన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం. అంటే అటువంటి వ్యక్తుల, సంస్థల ఆర్థిక చరిత్ర మొత్తం ఇ.డి కి అందుబాటులో వుంటుంది. ప్రతిపక్ష రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థల నేతలను మరింత విస్తృతంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని, వారిపై దాడి చేయడాన్ని ఇది సూచిస్తుంది.
కేంద్ర సంస్థల దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న ముప్పు గురించి అందరిలో అవగాహన పెరుగుతోంది. కొన్ని పార్టీలు తీసుకుంటున్న వైఖరుల వల్ల బలమైన ఐక్యకార్యాచరణ, ప్రయోజనం లోపిస్తోంది. ఆప్ నేత మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసినపుడు...కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఢిల్లీ శాఖ అరెస్టును స్వాగతించడమే కాకుండా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. పైగా, ఆప్ ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బియు)ను ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్‌కి లేఖ రాశారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌బియు కేసులో సిసోడియాను విచారణ చేయడానికి సిబిఐకి అనుమతిస్తే సరిపోదని...దేశద్రోహం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా ఆప్ నేతలను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. దీనిపై ఆప్ కూడా దీటుగానే స్పందించింది. పదేళ్ళ క్రితమే ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలైనప్పటికీ, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎదుటి పార్టీపై ప్రయోగించాలని ప్రతి పార్టీ ఏదో రకంగా బిజెపి ప్రభుత్వాన్ని కోరుతుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు పరస్పర విరుద్ధమైన రాజకీయాలు, ప్రయోజనాలను కలిగి వుండడం సహజమే. వారికి ఒకరిపై ఒకరు పోటీ పడే స్వేచ్ఛ వుంటుంది. కానీ, మోడీ ప్రభుత్వ నిరంకుశ-ఫాసిస్ట్ తరహా దాడి ప్రతిపక్షాలన్నిటిపైనా జరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర హక్కులను కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు తమ మధ్య వున్న అభిప్రాయ బేధాలను పక్కనబెట్టి వ్యవహరించాల్సి వుంటుంది. ఇది మినహా మరే వైఖరి తీసుకున్నా అది ఆత్మవంచనే అవుతుంది.
అయితే, ప్రతిపక్షానికి ఉమ్మడి ముప్పు ఎదురైనప్పుడు కలుస్తుంటాయి. ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమైనపుడు ఆ ఉమ్మడి ముప్పే చాలా వరకు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చింది. అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై దర్యాప్తు చేయాలని, ప్రతిపక్ష నేతలపై వేధింపులను ఆపాలని, వారిని లక్ష్యంగా చేసుకోవడాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఇ.డి కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలన్న కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్, ఆప్, బిఆర్‌ఎస్ వంటి విభిన్న ప్రయోజనాలు కలిగిన పార్టీలు ఈ సంయుక్త నిరసనలో భాగస్వాములు కావడం శుభ పరిణామం.
ప్రతిపక్షం ఈవిధంగా ఐక్యంగా నిలబడడంతో పాటు పిఎంఎల్‌ఎ నిరంకుశ నిబంధనలను సమీక్షించేందుకుగాను తక్షణం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అప్పుడే ఈ అదనపు చట్టపరమైన, ఏకపక్ష నిబంధనలను ఇ.డి దుర్వినియోగపరచలేదు.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)