ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్మిషన్ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ నెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఇఎపిసెట్ అడ్మిషన్ల కన్వీనరు సిహెచ్ నాగరాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 12 వరకు వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జరగనుందని తెలిపారు. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యకలాపాలకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఎంపికలు, మార్పులు, సీట్ల కేటాయింపు, సంస్థల్లో నివేధించడం, తరగతుల ప్రారంభం వంటి షెడ్యూల్‌లో కూడా మార్పులు ఉంటాయని వివరించారు. 13న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని తెలిపారు. 17న విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. 17 నుంచి 21లోపు సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని వెల్లడించారు. ఆగస్టు 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా పడింది.










