- ఖరీఫ్‌లో నూరు శాతం నమోదులన్న సర్కారు
- పది శాతం కూడా లేని అక్నాలడ్జ్‌మెంట్
- పారదర్శకత ప్రశ్నార్ధకం
- రైతులకు నష్టం
- అక్రమార్కులకు అవకాశం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : పంట సాగుల నమోదుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇ-క్రాప్' పారదర్శకత ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇ-క్రాప్ పోర్టల్‌లో పంటలు నమోదయ్యాయని తెలియజేస్తూ రైతులకు విధిగా వ్యవసాయశాఖ భౌతిక రసీదులు జారీ చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ ఆనవాళ్లు ఎక్కడా కనిపించట్లేదు. ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ సగం గడుస్తున్నా ఖరీఫ్ పంట నమోదుల భౌతిక రసీదులు పట్టుమని పది శాతం కూడా పూర్తి కాలేదని సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ అన్నీ కలుపుకొని కోటి పది లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని సర్కారు వెల్లడించింది. నూరు శాతం విస్తీర్ణానికి ఇ-క్రాప్ చేసేశామనీ ప్రకటించింది. రైతులకు జారీ చేసే రసీదులను మాత్రం విస్మరించింది. దాంతో తమ పేరు ఆన్‌లైన్ రికార్డుల్లో ఎక్కిందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల వద్ద ఇ-క్రాప్ చేయించుకున్న ఆధారం లేక అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం నెలకొంది.
జవాబుదారీ ఏదీ?
ప్రభుత్వం రైతన్నల కోసం అమలు చేసే అన్ని పథకాలకూ ఇ-క్రాప్ తప్పనిసరి చేసింది. ఇ-క్రాప్‌లో ఎక్కితేనే రైతు భరోసా, సున్నావడ్డీ, విత్తన సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పంట రుణాలు... చివరికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటలు అమ్ముకోవాలన్నా ఇ-క్రాపే. అంత ముఖ్యమైన ఇ-క్రాప్ విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది. గ్రామ స్థాయిలోని రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె)లో విలేజి అగ్రికల్చర్ అసిస్టెంట్ (వివిఎ) రైతుల పొలాల వద్దకెళ్లి ఏ సర్వే నెంబర్‌లో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వెబ్‌ల్యాండ్‌లో ఎక్కిన సర్వే నెంబర్లలోనే సాగులు నమోదవుతాయి. కౌలు రైతులకైతే సిసిఆర్‌సి గుర్తింపు ఉంటేనే ఇ-క్రాప్‌లో ఎక్కుతాయి. ఆ జాబితాలను ఆర్‌బికెలలో ప్రదర్శించమన్నారు. సోషల్ ఆడిట్ అన్నారు. ఉన్నతాధికారుల ర్యాండమ్ తనిఖీలన్నారు. అనంతరం తుది జాబితాలను ధ్రువీకరించి రైతులకు రసీదులివ్వాలి. రసీదులు మినహా అన్ని పనులూ ఏదోఒక విధంగా అయిందనిపించింది ప్రభుత్వం, రసీదులు మాత్రం ఇవ్వట్లేదు. డిసెంబర్ 9 లోపు ఇ-క్రాప్ పూర్తి కావాలనగా రసీదుల పంపిణీ పది శాతం కూడా జరగలేదు. ఎంఎఒ నిర్ణీత ఫార్మెట్‌లో ధ్రువీకరించి ఎ.డి.కి, అక్కడి నుంచి డిఎఒకు, అక్కడి నుంచి కమిషనర్‌కు రసీదుల సమాచారం పంపాలనగా సరైన పర్యవేక్షణ లేక కార్యక్రమం అటకెక్కింది.
అవినీతికి దారులు
పలు ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ ఇ-క్రాప్ లేదనే పేర రైతులను తిరస్కరిస్తున్నారు. తాము ఇ-క్రాప్ చేయించుకున్నామని రైతులు మొత్తుకుంటున్నా వినిపించుకునే నాథుడే లేడు. సర్కారు నుంచి వచ్చే పంట నష్టపరిహారం, బీమా, సున్నా వడ్డీ, యంత్ర పరికరాలు తదితరాలను రైతులు నష్టపోతున్నారు. కనీసం పంటలు అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. సిబ్బంది చాలా ప్రాంతాల్లో పై నుంచి వచ్చే ఒత్తిళ్లతో రైతులను సంప్రదించకుండానే పంటలను నమోదు చేస్తున్నారు. రికార్డులో ఉన్న పంటకు, వేసిన పంటకు తేడా వచ్చినప్పుడు పరిహారాలు రావట్లేదు. అధికారులు, సిబ్బంది చేసే తప్పులకు రైతులు బలవుతున్నారు. కొన్ని చోట్ల నెట్, సర్వర్ ఇత్యాది సాంకేతిక కారణాల వలన డేటా కరప్ట్ అయి ఎగిరిపోతోంది. అటువంటి సందర్భాల్లో రైతులు ఇ-క్రాప్‌లో ఎక్కినట్లు ఆధారం ఉండట్లేదు. ఒక్కొక్క ఆర్‌బికెలో 600 వరకు రైతులుంటారు. వారికి రసీదులివ్వడం పెద్దగా ఇబ్బంది ఉండదు. రసీదులివ్వకపోవడం వలన సాగుదారులు కాని వారు, తప్పుడు సమాచారంతో అనర్హులు, పెత్తందారులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రసీదులివ్వకుండా ప్రభుత్వమే అక్రమాలను ప్రోత్సహిస్తోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.










