దసరా ఉత్సవాలు అనేక రాష్ట్రాల్లో విభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. నవరాత్రుల సందర్భంగా విజయవాడ లోని కనకదుర్గమ్మ గుడికి రాష్ట్ర నలుమూలల నుండి వేల సంఖ్యలో తరలివస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దసరా సందర్భంగా రెండు రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని, ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రోత్సహించాలని... మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) ప్రోత్సాహంతో దసరా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ ఏర్పడింది. విజయవాడ నగరంలోని మహిళా సంస్థలు, ప్రముఖులు, వ్యక్తులు ఇందులో భాగస్వాములయ్యారు.
మన రాష్ట్రం గొప్ప సంస్కృతికి నిలయం. కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, తప్పెటగుళ్ళు, కర్ర సాము, డప్పుల నృత్యాలు, ధింసా వంటి కళారూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కళకూ ఒక్కో విలక్షణ లక్షణం ఉంది. గతంలో పల్లెల్లో, పట్టణాల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంగా కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తుండేవారు. నాలుగు రోడ్ల కూడళ్లలో హరి కథ, బుర్రకథ, ఒగ్గు కథ, నాటకాలు ప్రదర్శించబడేవి. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై కళా ప్రదర్శనలు ఇస్తుండేవారు. నాటి కళారూపాలు ప్రజలను చైతన్య పరిచేవిగా ఉండేవి. పాశ్చాత్య విష సంస్కృతి దిగుమతి అయిన తర్వాత మన సాంప్రదాయ కళలు కనుమరు గయ్యాయి. ఆ వృత్తిపై ఆధారపడి జీవించే వారి ఉపాధి పోయింది. సరళీకరణ విధానాల అమలు తర్వాత పెరిగిన జీవన వ్యయంతో బతుకుతెరువు కోసం ఉరుకులు, పరుగుల జీవితాలుగా మారిపోయాయి. పట్టణీకరణ పెరిగింది. సినిమాలు, సెల్ ఫోన్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. ఈ విష సంస్కృతి వల్ల బాలికలు-మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మహిళలకు భద్రత కరువవుతోంది. ఈ విష సంస్కృతి నుండి యువతను మంచి మార్గం వైపు మళ్లించాలి. అంతేగాక స్త్రీ, పురుష సమానత్వానికి సాంస్కృతిక రంగం ద్వారా కృషి చేయాలనే సంకల్పంతోనే దసరా ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్వర్యంలో కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి.
పి.బి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిని భాను, ప్రగతి స్వాగత నృత్యంతో అక్టోబర్ 10వ తేదీన ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో సభ ప్రారంభమైంది. సృహాప్తి సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో 30 మంది మహిళలు, యువతులు వందకు పైగా కళాకృతులను ప్రదర్శించారు. తదనంతరం కోలాటం, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యాలతో ఉత్సవాలు ఆద్యంతం ఉత్సాహపూరితంగా జరిగాయి. అనేక ప్రాంతాల నుండి 27 మహిళా కోలాట దళాలు మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రదర్శించారు. 'ఆధునిక నవదుర్గ'ల పేరుతో నలంద డిగ్రీ కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు చేసిన ప్రత్యేక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ, ఆ తర్వాత కాలంలోనూ వీరోచితంగా పోరాడిన, పోరాడుతున్న వీరవనితలు ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రీబాయి పూలే, దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు, మల్లు స్వరాజ్యం, హేమలత లవణం, గౌరీ లంకేష్, బిల్కిస్ భానో, సాక్షి మాలిక్‌ల వేషధారణతో సభికులను ఆకట్టుకున్నారు. విజయవాడ నగరంలోని ఎనిమిది నృత్య అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నృత్యాల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. యువతీ, యువకులలో సృజనాత్మకతను వెలికి తీయటానికి ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని వక్తలు తెలిపారు. చలం, గురజాడ, కాళిదాసు, వీరేశలింగం వంటి మహనీయుల రచనలు, కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారని, కళల ద్వారానే విజ్ఞానం పెరుగుతుందన్నారు. మహిళలను చైతన్య వంతులను చేసేందుకు, వారిలో ఉన్న కళా తృష్ణను బయటికి తీసేందుకు కృషి చేస్తున్న నిర్వహణ కమిటీకి అభినందనలు తెలిపారు.
/ వ్యాసకర్త దసరా ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎం.బి.వి.కె /
కె. స్వరూపరాణి