Mar 17,2023 07:30

సాగునీటి రంగంలో అంతర్గతంగానూ అంతర్‌ రాష్ట్ర జల వివాదాల అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రల వ్యవసాయ రంగంలో మున్ముందు తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఒత్తిడికి తలొంచి గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించినా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి నిధులు రాబట్టలేక నీటి నిల్వ సామర్థ్యం తగ్గించినా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రధానంగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సాగునీటి వసతి అటుంచి తాగునీటికి కటకటలాడవలసి వుంటుంది. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఉపాధి లేకుండా వలసలు ఎక్కువగా వున్నాయి. తుదకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ వైరస్‌ వుంది. ఆంధ్ర ప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భవితవ్యం నేడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. డయాఫ్రం వాల్‌ గొడవ ఒక దారికొచ్చినా ఇంకా బాలారిష్టాలు చుట్టు ముట్టే వున్నాయి.
         ప్రాజెక్టు రెండవ డిపిఆర్‌ ఆమోదం, పెట్టుబడి అనుమతి లభించే అవకాశాలు కన్పించడం లేదు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. పక్కనే వున్న కర్ణాటకలో అప్పర్‌ భద్రకు కేందం ఈ బడ్జెట్‌లో రూ. 5300 కోట్లు కేటాయించినా చట్ట భద్రతగల పోలవరానికి ఎగనామం పెట్టారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గాని పోలవరం మాట ఎత్తడం లేదు. రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రాజెక్టు నిర్మాణం ''మ మ'' అనిపించేందుకు నీటి నిల్వ 41.15 మీటర్లకు పరిమితం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమౌతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిగా అటకెక్కినట్లే. పోలవరం రిజర్వాయర్‌గా కాకుండా ఒక బ్యారేజీగా మిగిలిపోతుంది. స్పిల్‌వే ఈపాటికే నిర్మాణం జరిగినందున సాంకేతికంగా ప్రాజెక్టు ఎత్తు తగ్గించలేరు. కాని నీటి నిల్వ సామర్థ్యం తగ్గించే కుట్ర జరుగుతోంది. గోదావరి వరద రోజుల్లో పోలవరం నుండి 63.2 టియంసిలు నీరు తీసుకొనే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథక రచన జరిగింది. పోలవరం ఎడమ కాలువ స్పిల్‌ లెవల్‌ 40.54 మీటర్లు. కాబట్టి పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమైతే సుజల స్రవంతి పథకం మరచిపోవలసిందే! దీనికి తోడు గోదావరి మిగులు జలాలు గోదావరి, కావేరి అనుసంధానానికి తరలించితే సుజల స్రవంతి పథకానికి ఎక్కడ నుండి నీళ్లు తెస్తారు ?
         అంతేకాదు. విశాఖ పట్టణం తాగునీటికి పోలవరం నుండి 23.44 టియంసిల నీరు కేటాయించి వున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30 లక్షల మందికి తాగునీరు అందించే విధంగా రూపకల్పన చేశారు. తుదకు పోలవరం ఎడమ కాలువలో వరద రోజుల్లో తప్ప గ్రావెటీ ద్వారా నీళ్లు వెళ్లే పరిస్థితి లేకపోతే ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లా మెట్ట ప్రాంత ప్రజలకు గోదావరి జలాలు హుష్‌ కాకి అవుతాయి.
        మరోవైపు రాయలసీమ కాదు రాళ్ల సీమ. శ్రీశైలం జలాశయం నిండుగా నీళ్లున్నా వాడుకొనే అవకాశం లేదు. తుంగభద్ర జలాలు తప్ప వేరు గత్యంతరం లేదు. మొదలే తుంగభద్ర పూడిక పేర నీటి వాటా కోత పెట్టి వున్నారు. అప్పర్‌ భద్రతో మరీ కోత పడుతుంది. పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి కేవలం 19 టియంసిలు తీసుకొనేలాగా వుంటేనే శ్రీశైలం జలాశయం రూల్‌ కర్వ్‌లో సంతకం చేస్తానని తెలంగాణ పేచీ పెడుతోంది. ట్రిబ్యునల్‌ వద్ద బేసిన్‌ సమస్య ముందుకు తెస్తోంది. రాయలసీమలో వుండిన అరకొర ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. కొత్త ప్రాజెక్టులు పునాది రాళ్లతో మిగిలాయి.
     రాయలసీమకు ప్రాజెక్టులు పూర్తిగా కృష్ణాజలాల వివాదంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో అంతర్గతంగానైనా గోదావరి జలాలను సీమకు తరలించాలంటే న్యాయపరమైన అంశాలు అటుంచి పోలవరం రిజర్వాయర్‌ నీటి నిల్వ 41.15 మీటర్లకు పరిమితమైతే ఏ విధంగానూ వీలు కాదు. పోలవరం కుడి కాలువ స్పిల్‌ లెవల్‌ 40.23 మీటర్లు కాబట్టి గ్రావెటితో నీటిని కృష్ణాకు తరలించడం కుదరదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అట్టహాసంగా పునాదిరాయి వేసిన వైయస్‌ఆర్‌ పల్నాటి ఎత్తిపోతలు పథకం అటకెక్కినట్లే! కృష్ణా జలాల వివాదాలు కొనసాగినా పోలవరం అటకెక్కినా మున్ముందు ట్రిబ్యునళ్లు భిన్నమైన తీర్పులు ఇచ్చినా అటు ఇటుగా ఇప్పుడున్న సాగునీటి వసతి ఏదో విధంగా కుంటి నడక సాగించుతుంది. కాని రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రలో వ్యయసాయం తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదు. తస్మాత్‌ జాగ్రత్త !

(వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు, సెల్‌ : 9848394013)
వి. శంకరయ్య

వి. శంకరయ్య