Aug 21,2022 12:14

ఇపుడు పుడమితల్లి నీటితో యుద్ధం చేస్తోంది.
తన ఎదలో పెరుగుతున్న విత్తును
రక్షించుకోవడం కోసం..
రెండు చేతులు.. అడ్డుపెట్టి..
రాత్రి, పగలు కాపలా కాస్తుంది.
విత్తుకేమో ఆరాటం..
కర్షకుడి మోములో నవ్వును చూడాలని.

పచ్చని తరువులై మొలకెత్తి..
ఆకుపచ్చని పంటలై.. ధాన్యపురాసులై..
అన్నదాత ఇంటిముంగిట పొంగిపొర్లాలని.
మేఘం మెరుస్తూనే ఉంది..
మొగులుకు చిల్లులుపడ్డట్లు..
వర్షం వరదలై పారుతూనే ఉంది..
ఎందుకో ప్రకృతమ్మకు సూడబుద్ధికావడం లేదు.
ప్రతీకారం తీర్చుకుంటుందేమో..?

అవును మరి.. నీరుండే తావులోకి నువ్వెల్తివి.
నువ్వుండే జాగలోకి నీరొస్తుంది.
నీ చుట్టూ నీరు చేరి, నిలదీస్తుంది కదూ..!
కాస్త సమాధానం చెప్పవూ ప్లీజ్‌..!

వర్షం చినుకుల చాటున.. కన్నీరు కనిపిస్తుంది.
వానమ్మ దుఃఖిస్తూ కన్నీరు కారుస్తుంది.
నిజంగా...ఇది దుఃఖపు వానే..!
మనిషిగా మన ధర్మాన్ని తప్పినందుకు
ప్రకృతమ్మ తన ధర్మాన్ని తప్పాల్సి వచ్చింది.

పర్వతాలు.. కొండలు..గుట్టలు..చెరువులు.. కందకాలు..కాలువలు..దేన్నీ వదలలేవు.
కబ్జా కోరువై కోరలు చాచితివి.
కాంక్రీట్‌ జంగిల్‌లో జిందగీ ఇపుడు.
జర సోచో.. రేపటి భవిష్యత్తు ఏంటో..!

అశోక్‌ గోనె
94413 17361